ప్రఖ్యాత రచయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు తన 87వ ఏట (14-05-2026) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈరోజు (15-05-2026) ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఈమెకు నలుగురు కుమార్తెలు, నలుగురు అల్లుళ్లు, ఎనమండుగురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.
జననం, ఉద్యోగ ప్రస్థానం: 28 జూలై 1938న సికింద్రాబాద్‌లో జన్మించిన శారద గారు, ఆకాశవాణిలో ఫీల్డ్ ఆఫీసర్‌గా, జవహర్ బాల భవన్ సంచాలకులుగా, ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా సేవలందించి పదవీ విరమణ చేశారు. అలాగే సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా, రీజినల్ సెన్సార్ బోర్డ్ చైర్‌పర్సన్‌గా కూడా విశేష సేవలు అందించారు.
సాహిత్య కృషి: తెలుగు సాహిత్యంలో నిలువెత్తు సంతకమైన ఆమె, అన్ని ప్రక్రియలలో కలిపి 82కి పైగా గ్రంథాలు వెలువరించారు. ఇందులో 26 నవలలు, 8 కథా సంపుటాలు, 12 కవితా గ్రంథాలు, 12 బాల సాహిత్య గ్రంథాలు, 7 నాటకాలు, వ్యాసాలు, సంగీత రూపకాలు, బుర్రకథలు ఉన్నాయి. ‘ఆంధ్రభూమి’లో ‘శారదాలోచనం’, ‘మరమరాలు’, ఆంధ్రప్రభలో ‘చిన్నారి’ వంటి కాలమ్స్‌తో సుమారు 1000కి పైగా వ్యాసాలు రాశారు. ఆకాశవాణి, దూరదర్శన్ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె, భానుమతి గారి ‘భక్త ధృవ మార్కండేయ’, ‘గోడ మీది బొమ్మ’ వంటి సినిమాలకు పాటలు రాశారు. మంగళంపల్లి గారు పాడిన వీరి ‘వినాయక సుప్రభాతం’ అత్యంత ప్రసిద్ధి చెందింది.
బాలసాహిత్యానికి సేవలు: జవహర్ బాలభవన్ డైరెక్టర్‌గా ఆమె ‘బాల చంద్రిక’ పత్రికను నడిపారు. పిల్లల కోసం వంద కథలతో విజ్ఞాన సర్వస్వం లాంటి పుస్తకాన్ని, పండుగల విశేషాలతో (బతుకమ్మ, సంక్రాంతి, గుడ్ ఫ్రైడే, ఈద్ తదితర) ‘రుక్మిణీ కల్యాణం’ పుస్తకాన్ని రచించి బాలసాహిత్య వికాసానికి విశేష కృషి చేశారు.
ముఖ్యమైన రచనలు: నవలలు: కుంతీపుత్రిక, ఈ తరం నాది, జూనియర్ ఆర్టిస్ట్, అశృతర్పణ, గజ్జె ఘల్లుమంటుంటే, జీవితం గెలుపు నీది, కలనిజమాయెగా, మనస్విని, నా కథవింటావా?, పిపాసి, కలవరమాయే మధిలో, తిరగబడ్డ పిల్లి, వెన్నెలవేట, చెదిరిపోతున్న దృశ్యం.
బాలసాహిత్యం: కిలకిలనవ్వుల పిల్లల్లారా, కనిపించే దేవుళ్ళు.
కథాసంపుటాలు: శారదా అశోకవర్థన్ కథలు.
పురస్కారాలు: రాష్ట్ర ప్రభుత్వంచే మూడు నంది అవార్డులు (1990, 1997, 2000) పొందిన ఏకైక రచయిత్రి.
తెలుగు విశ్వవిద్యాలయంచే వచన కవితా పురస్కారంతో పాటు 3 విశిష్ట పురస్కారాలు.
నాలుగుసార్లు ఉత్తమ రచయిత్రి బహుమతులు.
‘స్త్రీ’ టీవీ సీరియల్‌కు నంది అవార్డు.
-కళాసాగర్
