
సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు నాకొక స్ఫూర్తి ప్రదాత. ఆయన పరిచయంలో ఎంతో నేర్చుకున్నాను. ఆయన్ని చూస్తే, ఆయనతో మాట్లాడితే మహా పురుషులు ఇలా ఉంటారనిపిస్తుంది. ఆయనొక గ్రేట్ మెంటార్! ఇవాళ 85వ పుట్టినరోజు. వారి గురించి నాలుగు నా మనసులోని మాటలు.
సంపద చాలా మందికి ఉంటుంది. ఆ సంపదను సరిగ్గా సద్వినియోగం చేయడం కొందరికి మాత్రమే సాధ్యం. అందులో సౌజన్యమూర్తి సారిపల్లి కొండలరావు అగ్రశ్రేణిలో ఉంటారు. ఎవరికి అవసరమో వారికి మాత్రమే సాయం చేసే గొప్ప సుగుణం. చేసిన సాయం రెండవ చేతికి కూడా తెలియనివ్వని మహా సుగుణం.
ఆయనలో ఇప్పటికి నేర్చుకోవాలనే తపన! ప్రతి విషయం పట్ల అవగాహన ఉండాలనే ఆలోచన! ఒక సంకల్పం అనుకుంటే సమగ్రంగా పూర్తి చేసేంత వరకు అదే టార్గెట్ లో నిమగ్నమై ఉండటం. మంచి మాత్రమే వినడం! నెగటివ్ ఆలోచనలు దరికి రానివ్వకపోవడం! ఎవ్వరి గురించి చెడు మాట్లాడకపోవడం, ఎవరైనా మాట్లాడినా మనకు అనవసరం అని కట్ చేయడం! సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు నిర్వహించాలని తపించడం! ఆధ్యాత్మిక సత్సంగంలో సమయం గడపడం! మొఖాన నవ్వు చెదరకపోవడం! ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ప్రేమగా పలకరించడం! అందరూ బావుండాలని ఆశీర్వదించడం! భేషజాలు లేకపోవడం! సింపుల్ గా జీవితం గడపడం వెరసి సారిపల్లి కొండలరావు సుగుణాలు! వారిలో వున్న ఇలాంటి సుగుణాల గురించి ఒక పుస్తకమే రాయవచ్చు.
కరోనాలో నేనున్నా అంటూ రెండు రాష్ట్రాల్లో ప్రతి నెల వంద మంది జానపద కళాకాకారులకు పెన్షన్లు ఇవ్వడం ఒక్క సారిపల్లి కొండలరావుకే సాధ్యమైంది. ఆ సాయం ప్రక్రియ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలు చేరినప్పుడు వారి అటెండెంట్లకు మధ్యాహ్న ఉచిత భోజనం కల్పించడం ఆయనకే చెల్లింది. అక్కినేని నాగేశ్వరరావుకు ఇచ్చిన మాట కోసం గత 30 ఏళ్లుగా అక్కినేని పేరిట పరిషత్ నాటకోత్సవాలు నిర్వహించడం సారిపల్లి కళా సహృదయత. వై.కె.నాగేశ్వరరావు కోసం ఆయన లేకున్నా ఆయన స్థాపించిన యువకళావాహిని సంస్థను ముందుకు తీసుకెళ్లడం ఆయన్ని సాంస్కృతిక బంధు అనడానికి సంపూర్ణ సార్ధకత.
ఎదుటి మనిషిలో మంచిని మాత్రమే చూడాలని నేను వారి నుంచి నేర్చుకున్న విలువైన పాఠం. చేతనైన మేరకు శక్తిమేరకు సాయం చేయాలనే మనస్తత్వం అలవరచుకున్నాను. ఎప్పటికప్పుడు విజ్ఞాన పరంగా అప్ డేట్ అవడం నేర్చుకున్నాను. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలని వారిని చూసి తెలుసుకున్నాను. ఆత్మీయంగా ప్రేమగా నన్ను పలకరించే విధానం నన్ను కట్టిపడేస్తుంది. నాకు ఏం అవసరమో నాకేం కావాలో నాకన్నా ఆయనకే బాగా తెలుసు అనిపిస్తుంటుంది. నా మెంటార్, స్నేహశీలి, సహృదయ శిఖరం సారిపల్లి కొండలరావు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
డా. మహ్మద్ రఫీ