సామాజిక, సమకాలీన, రాజకీయ అంశాలను స్పృశిస్తూ కవి, రచయిత శర్మ సీహెచ్., రాసిన ‘శర్మ శతకము’ పద్య సంపుటి శుక్రవారం విజయవాడలో ఆవిష్కృతమైంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న 35వ విజయవాడ పుస్తక ప్రదర్శన ఇందుకు వేదికైంది. అచ్చంగా రచయితల కోసమే ఏర్పాటుచేసిన రైటర్స్ స్టాల్‌లో సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శర్మ రాసిన పద్యాలు సమాజానికి ఉపకరిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రచయిత శర్మ సీహెచ్., ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ చిల్లర భవానీదేవి, ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, 64 కళలు డాట్ కామ్ ఎడిటర్ కళాసాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.