పురుషాధిక్య సమాజంలో కొన్ని రంగాలు పురుషులకే పరిమితం. కవిత్వం, అవధానం, ఫోటోగ్రఫీ, ఆటోమొబైల్ రంగం ఇలాంటి వాటన్నిటి పైన కాపీరైట్ మగవాళ్ళకే. ఆకాశంలో సగం స్త్రీలు. 80 ల తర్వాత కవితాకాశంలో మహిళలు మెరవడం ప్రారంభించారు.
ఇక అవధానం… ఇలాంటి ప్రక్రియల్లో స్త్రీల పేర్లను వెతుక్కోవాల్సిందే. ఇలాంటి సమయంలో బులుసు అపర్ణ గారు అవధానిగా పేరు పొందారు. ఇటీవల కాలంలో కొందరు స్త్రీలు అవధాన కళలో ఆరితేరినా బులుసు అపర్ణ గారి పేరు చాలా కాలంగా ప్రముఖంగా వినబడుతుంది.
ఇటీవల శ్రీశైలంలో అపర్ణ గారి ద్విశతావధానం దిగ్విజయంగా జరిగింది ఐదు రోజులపాటు దేవస్థానం సభా వేదిక మీద ఈ కార్యక్రమం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 60 మంది పృచ్ఛకులు విచ్చేశారు. సమస్యాపూరణం, దత్తపది, వర్ణనలు ఇచ్చారు. వర్తమాన రాజకీయాలు, అలముకుంటున్న యుద్ధమేఘాలు, నివారించలేని దోమల సమస్యల గురించి పలు రకాల సమస్యలు ఇచ్చారు. రామాయణ, భారత పరంగా క్లిష్టమైన వస్తువులను సమస్యలుగా ఇచ్చారు.
శ్రీశైలం, ఆలయ దక్షిణ మాడవీధిలో కళావేదికపై ప్రతిరోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, రెండున్నర నుంచి ఆరున్నర వరకు ద్విశతావధానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని “శ్రీశైలం ప్రభ” సంపాదకులు ఉన్నవ గణేష్ గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు గారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలపండిన పండితులతో పాటు బాలలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిరోజు స్థానిక వేదపాఠశాల విద్యార్థులు ఈ సభలో పాల్గొన్నారు.
మధ్యలో ఆశువులు, అప్రస్తుత ప్రశంసలతో కార్యక్రమం సభికులను అలరించింది. చివరి రోజు తిరుపతి సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్ గారు వచ్చి తమ విద్యార్థిని అపర్ణ గారిని అభినందించారు. ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని శ్రీ పేరి రవికుమార్ గారు అనుసంధానం చేశారు. పంతుల వెంకటేశ్వరరావు గారు, సింహాద్రి పద్మ గారు, సింహాద్రి వాణి గారు, మందరపు హైమావతి మొదలగు పృచ్ఛకులు పాల్గొని సభను రక్తి కట్టించారు. చివరి రోజు అవధాని గారిని, పృచ్ఛకులను, అనుసంధానకర్తను దేవస్థానం వారి ప్రసాదంతో, శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించారు.
-మందరపు హైమావతి