కళాకారుల మనసు సున్నితం. అందులో చిత్రకారులకైతే మరీనూ. తాము వేసే రంగుల చిత్రాల్లో.. ప్రకృతిని వెదుక్కొంటారు. ఆ ప్రకృతినే ఆరాధిస్తారు. మనం పరిచయం చేసుకోబోయే చిత్రకారుడూ అలాంటివాడే. ఇతడూ.. తన రంగుల ప్రపంచంలో.. తనకే ప్రత్యేకంగా కనిపించే ప్రకృతిని చూస్తాడు. ప్రకృతిని స్త్రీగా పోలుస్తారు కనుక తనూ అలానే చూశాడు. తన కుంచెలద్దే ప్రతి చిత్రంలోనూ ‘సేవ్ గర్ల్ చైల్డ్’ అనే నినాదాన్ని దిద్దుతూ.. సమాజ కాన్వాసు పై ‘అర్థ’వంతమైన రంగుల సందేశాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ప్రొద్దుటూరు కు చెందిన చిత్రకారుడు మహేష్… అలియాస్ తుపాకుల రామాంజనేయరెడ్డి. పదండి.. మహేష్ బొమ్మల సందేశం వెనుకగల నిజ’జీవన’ చిత్రమేంటో తెలుసుకుందాం!
రంగులతో.. సావాసం...
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మహేష్కు ఐదేళ్ల వయస్సులో ఓ కాలుకి పోలియో సోకింది. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో చదువుకు పదోతరగతి దగ్గరే ఫుల్స్టాప్ పడింది. అక్కడితో.. అతని జీవితం ఆగిపోలేదు. నల్లని రంగులో.. అనేకానేక రంగులున్నట్టుగా.. ప్రతికూల పరిస్థితుల్లోంచి.. రంగుల జీవితాన్ని వెదుక్కున్నాడు.
వైకల్యం.. పేదరికం.. ఇవేవీ అతని ఆత్మస్థయిర్యం ముందు నిలబడలేకపోయాయి. చిత్రకళ పై మక్కువతో ఊళ్లో ఉన్న వెంకట్, సురేష్ అనే ఇద్దరు చిత్రకారుల దగ్గర శిక్షణ పొందాడు. కొన్నాళ్లకు సొంతంగా తానే అందరూ మెచ్చే చిత్రాలను గీసే స్థాయికి చేరుకున్నాడు. ఇల్లు గడవడానికి మహేష్ ఆర్ట్స్ పేరుతో స్టుడియో ప్రారంభించాడు. కానీ… ఆలోచనలన్నీ లక్ష్యం చుట్టే తిరిగేవి. బ్యానర్లు, కటౌట్లు, వాల్ పెయింటింగ్స్, స్టిక్కనింగ్ తో జీవితాన్ని భారంగా నెట్టుకొచ్చేవాడు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తనను కదిలించింది. నాగరిక సమాజంలో.. అది రాజధాని నడిబొడ్డున ఏమిటీ వైపరీత్యమన్న ఆవేదనకు గురయ్యాడు. ఒక కళాకారునిగా సమాజానికి బలమైన సందేశం ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. నాకు నా ఆయుధం’ అనుకున్నాడు. అలా పుట్టిన ఉద్యమమే ‘సేవ్ గర్ల్ చైల్డ్ ‘
ప్రచారం.. వినూత్నం…
విద్యా, సేవా, క్రీడ, కళారంగాల్లోని వ్యక్తులతోపాటు సామాన్యులు సైతం ఈ ప్రచారంలో పాలుపంచుకునేలా ఓ వినూత్న ప్రణాళికను రూపొందించాడు మహేష్. ఉన్నత రంగాల్లో ప్రజాదరణ పొందిన వారి ద్వారానే తమ కార్యక్రమాలను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో ఉచితంగా ప్రముఖుల చిత్రాలను గీస్తూ, వారి ద్వారా బాలికల రక్షణకు పూనుకున్నారు. “నేను ఓ సామాన్య చిత్రకారుడ్ని. నా వంతుగా ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలనే సంకల్పంతో ఆడపిల్లల చదువుపై అవగాహన కల్పించేందుకు ఓ లోగో తయారుచేశాను. సెలబ్రెటీ నుంచి సామాన్యుల వరకూ సమాజానికి స్ఫూర్తినిచ్చే ఎవరు తారసపడినా వారి బొమ్మను(పోట్రైట్) గీసి, బహుమతిగా ఇస్తుంటాను. అలా ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలు ఇప్పటివరకూ మూడొందలమందికిపైగా చిత్రాలను ఉచితంగా అందించాను. నేనిచ్చే ప్రతి చిత్రంపైనా ‘సేవ్ గర్ల్ చైల్డ్’ లోగో ఉంటుంది. అదే నా ప్రచారం. చిత్రాన్ని చూసిన ప్రతిసారీ ఆడపిల్లల కోసం మనం చేయాల్సింది గుర్తుకొస్తుంది. ఈ ప్రాజెక్ట్లో కడపకు చెందిన షరీఫ్ బ్రదర్స్, ప్రొద్దుటూరులోని సాధు పద్మభూషణ్ గార్ల సహకారం మరువలేనిది’ అంటున్నారు మహేష్. ” ఇప్పటివరకూ ఐఎఎస్, ఐపిఎస్, డాక్టర్ల పాటు ఎందరో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారులు ఈయన బొమ్మలు అందించిన జాబితాలో ఉన్నారు.
ఇబ్బందులు ఎదురైనా..
ప్రముఖులను కలిసేందుకు దూరప్రాంతాలకు వెళ్లే సమయంలో అయ్యే పూర్తి ఖర్చులకు తన సొంత డబ్బే వెచ్చిస్తాడు మహేష్. సెలబ్రిటీలకే కాదు, స్ఫూర్తినిచ్చే మహిళలు, శ్రమైక జీవనానికి ప్రతీకగా నిలిచే సామాన్యులకు సైతం తను ఎంతో కష్టపడి గీసిన విలువైన చిత్రాలను అందిస్తూ.. పెద్దా, చిన్నా అనే తారతమ్యం లేకుండా వారందరినీ ఈ ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు మహేష్. తన ఈ ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారాయన. ‘దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో ప్రముఖులను కలిసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ‘సార్ను కలవటం ఇప్పుడు కుదరదని.. మేడం బిజీగా ఉన్నారని.. వాళ్ల దగ్గరకు తీసుకెళ్తే మాకేంటి?’ అని, ఇలాంటి మాటలు చాలా విన్నాను. కొన్నిసార్లు అక్కడే బొమ్మగీసి, నేనేంటో చూపించాలన్నంత కోపం వచ్చేది. అయితే లోపలకు వెళ్లాక, నా ప్రతిభ, నా ఆశయం చూసి నేను కలవాలనుకున్న వ్యక్తులే నన్ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి’ అంటూ ఎంతో తృప్తిగా చెప్తాడు మహేష్. ఎందరో ప్రముఖులకు వారి చిత్రాలను గీసి, అందించిన మహేష్ ప్రముఖ వేణువాదన విద్వాంసుడు పద్మభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా 80వ పుట్టినరోజు సందర్భంగా చిత్రపటాన్ని అందించిన క్షణాలు జీవితంలో మర్చిపోలేనంటాడు. తన సొంత గ్యాలరీ షాపులో బొమ్మలు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత ఇలా బాలికల విద్యా ప్రచారానికి వినియోగిస్తున్నాడు మహేష్.
అర్ధాంగితోనే.. ఆలంబన…
ఆడపిల్లలు చదువు విషయంలో ఎంత చురుకుగా ఉంటారో తన కుటుంబమే ఓ ఉదాహరణ అంటారు మహేష్. అదే సందర్భంలో తాను ఎదుర్కొన్న సమస్యలనూ చెప్పుకొచ్చారు. ‘నా భార్య ఇంటర్ తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది. ఎలాగూ నాకు చదువు అబ్బలేదు. కనీసం ఆమెనైనా చదివించాలనుకున్నాను. పెళ్లయిన మూడేళ్ల తర్వాత డిగ్రీలో జాయిన్ చేశాను. ఫస్ట్ క్లాస్లో పాసైంది. తర్వాత పీజీ పూర్తి చేసింది. కాంపిటేటివ్ పరీక్షల గురించి ఇద్దరం చర్చించుకున్నాక ప్రిపరేషన్ మొదలుపెట్టింది. కుటుంబసభ్యులతోపాటు చుట్టుపక్కల వాళ్లు పెళ్ళయ్యాక చదువేంటి అని విడ్డూరంగా మాట్లాడుకునేవారు. నిరక్షరాస్యురాలైన మా అమ్మ కూడా తెలిసో తెలియకో ‘ఆడపిల్లలను పెద్ద చదువులు చదివిస్తే నీ మాట వినరు. బుద్ధిగా ఇంట్లో కూర్చోబెట్టు’ అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తు. నేనెప్పుడూ ఆ మాటలు పట్టించుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అత్తమామల సహకారంతో ముందడుగు వేశాం. సరిగ్గా ఆరేళ్ల క్రితం ఆమె గెజిటెడ్ పోస్ట్ సాధించింది. ఆమె కష్టం ఫలించింది. ఇప్పుడు ఆమెను కలిసేందుకు పెద్ద పెద్దవారు ఇంటికి వస్తే మా అమ్మ కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నాను. మమ్మల్ని హేళన చేసినవారందరికీ ఆడపిల్లలకు గల శక్తి, సామర్ధ్యాలేంటో తెలిసింది. ఏదైనా సాధించాలనే సంకల్పం ఉండాలేకానీ, దానికి స్త్రీ-పురుష బేధం లేదని అర్థమైంది. అలా మార్పు కోసం నా తొలి అడుగు మా ఇంటి నుంచే మొదలైంది. ఈ ప్రాజెక్ట్లో నా మిత్రుల సహకారమే కీలకమైనది’ అని తన స్వీయానుభవాన్ని చెప్పుకొచ్చాడు మహేష్.
బాలికల సంరక్షణ కోసం..
సమాజంలోని ఆడపిల్లలను చదివించాలి. వారిపై వివక్షను దూరం చేయాలన్నదే నా తపన. అందుకే నాకు తెలిసిన చిత్రకళను ఓ మార్గంగా ఎంచుకున్నాను. ఎందరో ప్రముఖుల ద్వారా నా బొమ్మల సందేశాన్ని ప్రచారం చేశా. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల చిత్రాలు గీసే పనిలో ఉన్నాను. “దేశవ్యాప్తంగా మూడువేల మందికి చిత్రాలను ఇవ్వాలన్నది నా కోరిక ఇప్పటికీ రెండొందల మందికి ఇచ్చాను. మరో రెండొందల చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. వీళ్లందరికీ పెయింటింగ్స్ ఇస్తున్నప్పుడు నా ఆశయాన్ని తెలియజేస్తున్నాను. వాళ్ల ద్వారా విషయం సమాజానికి వెళుతుంది.” అంటున్నాడీ ప్రార్దుటూరు పెయింటర్. ఆ చిత్రకారుడి రంగుల కళనూ, రంగుల కలనూ అభినందించాల్సిందే!
-కళాసాగర్
(తుపాకుల మహేష్, ఫోన్: 9866913354)
Congrats Mahesh garu, You done a wonderful job.
Very inspiring service Mahesh garu
Congrats Mahesh garu…. you are doing good job.