తెనాలికి చెందిన అంతర్జాతీయ శిల్పి అక్కల మంగయ్య (83) శుక్రవారం (02-07-2021) రాత్రి 9.30 గంటలకు తెనాలిలోని వారి స్వగృహంలో కన్నుమూసారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అక్కల మంగయ్య గారి అంత్యక్రియలు శనివారం ఉదయం 11 గంటలకు చినరావూరు శ్మశాన వాటికలో జరిగాయని కుటుంబసభ్యులు తెలియజేసారు.
అక్కల మంగయ్య చారిత్రక పట్టణంగా, లలితకళలకు పుట్టినిల్లుగా, ఆంధ్ర ప్యారిగా కీర్తి పొందిన తెనాలిలో మూడు తరాలుగా శిల్పకళారంగంలో రాణిస్తున్న కుటుంబం అక్కల మంగయ్య గారిది. దాదాపుగా వందేళ్లుగా ఈ రంగంలో ఆ కుటంబ సభ్యులు తమ ప్రతిభను నిరూపించుకొంటున్నారు. ఇత్తడి, పుత్తడి, రాగి, వెండి వంటి విభిన్న లోహములలతో అక్కల కుటుంబం, నగిషీలు, పంచ లోహాల తయారిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు.
కోటిరత్నం- రామయ్య దంపతులకు మంగయ్య గుంటూరు జిల్లా తెనాలిలో 1937
ఫిబ్రవరి 5న జన్మించారు. శిల్పకళకు అంత ఆదరణలేని రోజుల్లో వారి తాత శ్రీరాములు, తనకు కుమారుడైన రామయ్యకి శిల్పకళలో శిక్షణ ఇచ్చి శిల్పిగా తయారు చేశారు. వారసత్వానికి అందిపుచ్చుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధతతో అంకితభావంతో రాతి, పోత విగ్రహాలను తయారు చేసేవారు. వీరి వారసులుగా సోదరులు అక్కల రామకృష్ణ, రామమోహనరావు, శ్రీరామ్ లు, కుమారులు రామలింగేశ్వర్ కూడా ఇదే రంగంలో కొనసాగుతున్నారు. వీరిలో అక్కల సత్యరమేష్ ‘అజంతా కళారామం’ పేరుతో సంస్థను స్థాపించి… నాలుగేళ్ళ పాటు చిత్ర, శిల్పకళా పోటీలు, ప్రదర్శనలు నిర్వహించారు. సత్యరమేష్ మూడేళ్ళ క్రితం గుండె పోటుతో మరణించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, అమెరికాలోని అనేక ఆలయాలకు దేవతా మూర్తుల విగ్రహాలు, ప్రముఖుల విగ్రహాలు రూపకల్పన చేసి గుర్తింపు పొందారు. ‘థామ శ్రీనివాస శిల్ప విగ్రహశాల’ పేరుతో వేల సంఖ్యలో విగ్రహాలు తయారుచేశారు. మన ముఖ్యమంత్రులు టంగుటూరి అంజయ్య, కె. రోశయ్య, రాజశేఖర్‌రెడ్డి, నందమూరి తారకరామారావు, చంద్రబాబు, రాష్ట్రపతి శంకర దయాళశర్మ ల నుండి ప్రశంసలు అందుకున్నారు. తుది శ్వాసవిడిచే వరకు శిల్పకళ కోసమే బతికిన కళాపిపాసి అక్కల మంగయ్య గారికి 64కళలు.కాం నివాళి అర్పిస్తుంది.
-కళాసాగర్
____________________________________________________________________________
శిల్పకళారంగానికి తీరని లోటు….
తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయి కి తీసుకువెళ్లిన శిల్పి అక్కల మంగయ్య గారి మరణం తెనాలి శిల్పకళారంగానికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటూ…..
కాటూరి వెంకటేశ్వర రావు
ప్రముఖ శిల్పి, తెనాలి