ఆళ్లగడ్డలో శిల్పకళలకు ప్రాణం పోసిన ఆధ్యుడు దురుగడ్డ బాల వీరాచారి
ఆళ్లగడ్డ లో శిల్పకళకు ప్రాణం పోసిన ఆధ్యుడు కీ.శే దురుగడ్డ బాల వీరాచారి అని ఆయన కుమారుడు దురుగడ్డ హరిప్రసాద్ ఆచారి కొనియాడారు. అంధ్రప్రదేశ్ లోని ఆళ్లగడ్డ పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఉన్న శ్రీ శారదా శిల్పకళా మందిరం ఆవరణలో శనివారం, ఆగస్టు 16 న శిల్పి దురుగడ్డ బాల వీరాచారి 99 వ జయంతి వేడుకలను ఆయన కుమారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల వీరాచారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. అనంతరం హరిప్రసాద్ ఆచారి మాట్లాడుతూ గుంప్రమానుదిన్నే గ్రామానికి చెందిన తమ తండ్రి బాల వీరాచారి 1950 వ సంవత్సరంలో ఆళ్లగడ్డ లో శిల్పకళాలకు ప్రాణం పోసి, శిల్పకళల అభివృద్ధికి విశేష కృషిచేశారని తెలిపారు. ఆయన కృషి ఫలితంగానే ఈరోజు దేశ విదేశాలలో ఆళ్లగడ్డ శిల్పకళ ఎంతో ప్రసిద్ధి చెందాయని తెలిపారు. 1978 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శిల్పుల సమాఖ్య చే కీర్తిశేషులు మహాశిల్పి దురుగడ్డ బాల వీరాచార్యులు స్వర్ణాభిషేకం అందుకున్నారు.

శ్రీ శారద శిల్పకళా మందిరం వ్యవస్థాపకులు దురుగడ్డ రవీంద్రాచారి మాట్లాడుతూ తమ తండ్రి బాల వీరాచారి అభినవ జక్కానాచార్యులనీ కొనియాడారు. ఆయన ఆ రోజు విత్తనం నాటితే ఈరోజు మహా వృక్షంగా అవతరించి, ఈరోజు వందలాదిమంది శిల్ప కళాకారులు ఆళ్లగడ్డలో ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చరిత్ర ప్రొఫెసర్ ఆదినారాయణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గంగన్న, రామాచారి, లలిత కళా సమితి నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి తో పాటు శిల్పులు పాల్గొన్నారు.
-కళాసాగర్
