బద్దలైన తెలుగు శిల్పం

చిత్ర, శిల్ప కళారంగాలకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయ శిల్పి చౌదరి సత్యనారాయణ పట్నాయక్ (సిఎస్ఎన్ పట్నాయక్) ఆగస్ట్ 11 న, గురువారం విశాఖపట్నంలో కన్నుమూయడం కళాభిమానులను దుఃఖసాగరంలో ముంచెత్తింది. ఆయన వందేళ్లకు మూడేళ్లు తక్కువతో పరిపూర్ణ జీవితం జీవించారు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఆయన శిల్ప, చిత్ర కళారంగాలను సుసంపన్న చేసేందుకు జీవితాన్ని ధారపోశారని చెప్పవచ్చు. ప్రత్యేకంగా శిల్ప రంగంలో ఆయన చేసిన సేవ నిరుపమానం. తెలుగు రాష్ట్రాల్లోని మన శిల్పులు ప్రముఖుల విగ్రహాలు, లేదా దేవతా విగ్రహాలకే పరిమితం అవుతారు. కానీ పట్నాయక్ శిల్పాలుమానవీయ జీవితాన్ని, సామాజిక అంశాలను తన కళలో చోటుకల్పించారు. శ్రీకాకుళం సమీపాన బడాం గ్రామంలో సీఎస్ఎన్ పట్నాయక్ 1925 డిసెంబర్ 6న జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య దశలోనే మూడు గ్రామాలు మారాల్సి వచ్చింది.

దీంతో పదో తరగతి పూర్తిచేయలేకపోయారు. పట్నాయక్ కుటుంబంలో పెద్ద కుమారుడు కావడంతో వారసత్వంగా వచ్చిన కరణీకం చేపట్టారు. ఈక్రమంలో ఆ ఉద్యోగం నాలుగేళ్లు చేశారు. ఈ క్రమంలో ఆయన శ్రీకాకుళం వచ్చేటప్పుడు ప్రముఖ చిత్రకారుడు కూర్మాపునరసింహం పరిచయం అయ్యారు. కూర్మాపు నరసింహం నడుపుతున్న ఫొటో స్టూడియో వద్దకు వచ్చిన ఆయన చిత్రాలను వేయడం గమనించసాగారు. తర్వాత మార్పులేని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇదే సమయంలో విజయనగరంలో ఉన్న ప్రముఖ చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు పరిచయం.. ఆయన సూచనలతో సిఎస్ఎన్ పట్నాయక్ మద్రాస్ వెళ్లి దేవీ ప్రసాద్ రాయ్ వద్ద శిష్యరికం చేసి పరిపూర్ణ కళాకారుడయ్యారు. ప్రముఖ పాత్రికేయ సంపాదకుడు, రచయిత నార్ల వెంకటేశ్వరరావు, ఖాసా సుబ్బారావు, సి.వి. రాజమన్నార్ వంటి ఉద్దండుల ప్రశంసలు అందుకున్నారు. ఒకసారి విద్యావేత్త డి.ఎస్.రెడ్డి చిత్రపటం గీసి ఇచ్చారు సిఎస్ఎన్ పట్నాయక్. ఆయన ప్రతిభకు ముగ్ధుడై ఇష్టం లేకపోయినా పట్నాయక్ శిల్పకళలో నూతన పోకడలకు పోయారు. మౌర్యులు, మొహంజదారో, సంగు, కుఫాన్ల నాటి ఆకృతుల్లోని రూపురేఖలను, టెర్రకోట శైలిపై కాస్యంపై చెక్కడంతో ఆయన ప్రత్యేకంగా నిలిచారు. ఈ సందర్భంలోనే సహజ సిద్ధమైన గ్రామీణ శైలిని విస్మరించలేదు. ఇదే క్రమంలో గౌరమ్మ, పెంటమ్మ, సోదిచెప్పేయువతి శిల్పాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి.

Receiving Award

దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని గ్యాలరీల్లో పట్నాయన్ శిల్పాలు ఉన్నాయి. కష్టపడి తాను అభ్యసించిన కాంస్య విగ్రహాల రూపకల్పన విద్య ను భవిష్యత్ తరాలకు అందించేందుకు తన స్వీయ అనుభవంతో ‘కాంస్య చితక్రళ’ అనే గ్రంథాన్ని రచించారు. నేటివ్ స్పోర్టు పేరిట ఆయన తన జీవితకాలంలో రూపొందించిన శిల్పాలు, చిత్రాలు విశాఖ ఎంపీపీ కాలనీలో ఏర్పాటుచేసిన సిఎస్ఎన్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాయి. నిందులో కోడిపుంజును పొదవి పట్టుకున్న వ్యక్తి, ఒక చేత్తో కడవ, మరో చేతితో బిడ్డను చేతపట్టి పాలిస్తున్న మాతృమూర్తి, మరో శిల్పంలో చుట్టకాలుస్తూ గ్రామీణ వ్యక్తి పొందే అనుభూతి తదతర బొమ్మలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. పట్నాయక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని లలిత కళా అకాడమికి ఉపాధ్యక్షుడిగా, భారతీయ శిల్పుల సమాఖ్య కార్యదర్శిగా సేవలందించారు. ఆయన రష్యా, పోలెండ్, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరి, బల్గేరియా, రుమేనియా తదితర దేశాల్లో పర్యటించారు. ఆంధ్ర చిత్రకళా వైభవాన్ని ప్రపంచానికి చాటారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కళారత్న అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం విశిష్టపురస్కారం, అలాగే న్యూఢిల్లీకి చెందిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ పురస్కారం, కేంద్ర ప్రభుత్వం వయో శ్రేష్ఠ పురస్కారం పొందారు. విశాఖలో ఆయన సొంతంగా ఏర్పాటుచేసిన ఆర్ట్ గ్యాలరీని అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రారంభించారు. పట్నాయక్ కుమారుడు రవిశంకర్ కూడా శిల్పే. ఆంధ్రాయునివర్సిటీలో అధ్యాపకునిగా పనిచేశారు. రవిశంకర్ రెండేళ్ల కిందట కరోనాతో కన్నుమూశారు. పట్నాయక్ వయోభారంతో ఆర్ట్ గ్యాలరీ నిర్వహించలేకపోయారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ఆర్ట్ గ్యాలరీని నడపాలని కళాకారులు, కళాభిమానులు కోరుతున్నారు. ఇదే సిఎస్ఎన్ పట్నాయకు మనం ఇచ్చే నివాళి.

సుంకర చలపతిరావు,
విశాఖపట్నం ఫోన్..9154688223

1 thought on “బద్దలైన తెలుగు శిల్పం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap