పరలోకానికి ‘శిల్పి పట్నాయక్’ పయనం

చిత్ర, శిల్పకళలలో సవ్యసాచి సి.ఎస్.ఎన్. పట్నాయక్ 2022 ఆగస్ట్ 11 న, గురువారం విశాఖపట్నంలో తన 97 వ యేట కన్నుమూశారు. సంవత్సరం క్రితం జరిగిన తన కుమారుడు రవి శంకర్ పట్నాయక్ ఆకస్మిక మరణం సి.ఎస్.ఎన్. పట్నాయక్ ని కృంగదీసింది.

దేశ స్వాతంత్య్ర అనంతరము సాంకేతికంగా అప్పుడే బుల్లి బుల్లి అడుగులు వేస్తున్న కాలమది. కళాకారులకు అంతగా మనుగడ లేని క్లిస్ఠ పరిస్థితులలో మన దేశం గర్వించదగ్గ దేవి ప్రసాద్ రాయ్ ప్రిన్సిపాల్ గా ఉన్న స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో పొందిన శిక్షణ పట్నాయక్ జీవితాన్ని మలుపు తిప్పింది. చిత్రకళలో పాటు చివరి సంవత్సరంలో శిల్పకళ అభ్యాసం కూడా చేశారు. అటు పిమ్మట దేవీప్రసాద్ రాయ్ చౌదరి గారి శిష్యరికంలో వారు తయారు చేస్తున్న భారీ కాంస్య విగ్రహాల్ని పరిశీలిస్తూ తన శిల్పకళా నైపుణ్యానికి మెరుగులు దిద్దుకున్నారు. దేవీప్రసాద్ రాయ్ చౌదరి, పణిక్కర్ దగ్గర కొంతకాలం పనిచేసి వారి ప్రోత్సాహంతో పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు లోని ట్రైనింగ్ కాలేజీ లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు కొంతకాలానికి ట్రైనింగ్ కాలేజ్ నుండి గుంటూరులోని మహిళా కళాశాలలో ఆచార్యులుగా నియమించబడి గుంటూరులోనే చిత్ర, శిల్పకళా సాధన చేస్తూ పదవీవిరమణ తర్వాత కుమారులు రవిశంకర్ పట్నాయక్ వద్ద వుంటూ విశాఖలో శిల్పకళా మ్యూజియం ఏర్పాటుచేశారు.  1975 వ సంవత్సరం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారి ఆధ్వర్యంలో లోహశిల్పాలు-టెర్రకోట ప్రభావం అనే అంశంపై పరిశోధన నిమిత్తం ఆయన చేసిన ఉత్తర భారతదేశ యాత్రలో భాగంగా శిల్ప కళారీతి పరిశీలించి పరిశోధనాత్మక పత్రాన్ని యూనివర్సిటీ అందించారు.

 

1925 డిసెంబర్ ఆరో తేదీన శ్రీకాకుళం జిల్లా బాదం అనే పల్లెలో జన్మించిన వీరి పూర్తిపేరు చౌదరి సత్యనారాయణ పట్నాయక్. తండ్రి గారు నిర్వహించిన కరణం బాధ్యతలు కూడా వీరు కొంతకాలం నిర్వర్తించారు. వీరికి నటరాజ, విద్యా భూషణ్, శాంతి స్వరూప్, రవిశంకర్ పట్నాయక్ నలుగురు సంతానం. చివరి వారయిన రవిశంకర్ పట్నాయక్ ప్రస్తుతం విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఫైనార్ట్స్ విభాగంలో ఆచార్యులుగా పనిచేశారు. వీరు కూడా ఆధునిక శిల్ప శైలిలో గుర్తింపు పొందారు. రవిశంకర్ గారి భార్య సంధ్యా శంకర్ పట్నాయక్ కూడా ఆర్టిస్ట్. 

ఒక శిల్పిగా రాణించాలంటే సృజనతో పాటు శారీరక శ్రమ కూడా చేయాలి. మృణ్మయ, సుధా, లోహ, శిలా, దారు ఇలా పంచ మాధ్యమాలలో పట్నాయక్ గారికి అపారమైన ప్రజ్ఞ ఉంది. చిత్రకారుడే కాకుండా శిల్పకళలోనూ అనేక మాధ్యమాలలో వారు ప్రదర్శించిన ప్రతిభ కళాకారునిగా వారిని ఉన్నతున్ని చేసింది. ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. చిత్రకారునిగా తొలి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకడెమి కి ఆయన ఐదు సంవత్సరాలు అధ్యక్షులు గా సేవలందించారు శిల్పకళ అధ్యాపకునిగా పదవీ విరమణ అనంతరం పూర్తిస్థాయిలో శిల్పకళా రంగానికే అంకితమై ఆంధ్రప్రదేశ్లో కాంశ్య విగ్రహాలు నెలకొల్పాలంటే మద్రాసు వెళ్లాలి అనుకునేవారిని తనవైపుకు తిప్పుకుని విజయం సాధించారు. ఈ విజయానికి వారి విభిన్న రీతులలో రూపొందించిన శిల్పాలు, సహజత్వం ఉట్టిపడేలా సజీవ మూర్తుల విగ్రహాలు ఎంతగానో దోహద పడ్డాయి. మద్రాసులో మహా మహా శిల్పులు ఉన్నప్పటికీ వీరి సృజణాత్మక నైపుణ్యం తో పోటీ రంగం రాణించారు. బోధనాధ్యాపకులుగా సుదీర్ఘకాలం పనిచేయటం, శిల్ప నిర్మాణ దశ నుండి తుది వరకు అందమైన శిల్పాన్ని ఎలా తయారవుతుంది అనే విధానాన్ని వివరించగలరు.

ముఖ్యంగా లోహ శిల్పంలో పూతపూసే ప్రక్రియ నేటికీ కొత్త పుంతలు తొక్కుతున్నా, గతంలోనే ఎన్నో ప్రయోగాలు చేసాసారు. బహుళ ప్రాచుర్యం పొందిన బాక్స్ మౌల్డింగ్ మరియు కాస్టింగ్ లో ఆయనది అందెవేసిన చేయి. పోత అనంతరం ఎటువంటి అవసరం లేకుండా అనేక రసాయనాతో కలరింగ్ సహజ శైలిలో ఆవిష్కరించడంలో పట్నాయక్ గారు చేయని ప్రయోగం లేదు. చేయి తిరిగిన శిల్పికి ఏ మాధ్యమైనా, ఏ శిల్పమైనా తన హస్త కళానైపుణ్యంతో అద్భుతంగా మలచగలరు. శిల్పం చేత శిల్పికి పేరు వస్తుందా, శిల్పిచే శిల్పానికి పేరు వస్తుందా అంటే రెండూ అంటారు. ఒకటి లేనిది మరొకటి లేదు. ఎన్ని ప్రయోగాలు, ఎన్ని మాధ్యమాలు, అటు చిత్రకళ, ఇటు శిల్ప కళ రెండూ రెండు కళ్ళు వారికి. చిత్రకళలో కూడా వారు చిత్రించిన సహజ చిత్రాలు, నైరూప్య చిత్రాలు, కుడ్య చిత్రాలు పలు జాతీయ – అంతర్జాతీయ ప్రదర్శనలలో అమ్ముడుపోయాయి.
టాంక్ బండ్ పైన నెలకొల్పిన చారిత్రిక మూర్తుల విగ్రహాలు, అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిష్టించిన మహాత్ముని విగ్రహం వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తొమ్మిది పదుల వయసులో కూడా తన దగ్గరికి వచ్చిన వారితో ఆప్యాయంగా ఫిలాసఫీ ఆఫ్ ఆర్ట్స్, ఈస్తటిక్స్ గురించి అనర్గళంగా చెప్పగలగడం ఈ తరం కళాకారులకు శ్రవణానందకరం అత్యంత ప్రయోజనకరం కూడాను. గరిక, సువర్ణ, మరకత, మణిమయా, తుప్పు తునక కాదేది శిల్పి కనర్హం అన్నట్లు పట్నాయక్ గారు శత మాధ్యమాలలో శిల్పం చెక్కగల సృజనాత్మక శిల్పకళద్రష్ఠ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఇటీవల ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య వారు విశాఖలో జరిగిన చిత్ర ప్రదర్శనలో పట్నాయక్ గారిని సత్కరించి వారి భాషణాన్ని మరొకసారి నేటి కళాకారులకు వినిపించారు.

-కళాసాగర్

SA:

View Comments (8)