శ్రీ టి.వి.కృష్ణ సుబ్బారావు (53) గారు, నివాసం శ్రీరామ్ నగర్, నల్లపాడు రోడ్, గుంటూరు.
వీరు ఉద్యోగరీత్యా మెడికల్ కాలేజ్ లో మోడలర్ గా చేస్తూ, వైద్య విద్యార్ధులకు నమూనా అవయవాలను చేసి అందిస్తారు. ప్రవృత్తి పరంగా చిత్ర, శిల్పకళను ఎంచుకున్నారు.
సుబ్బారావు గారు ఆంధ్ర ప్రదేశ్ నుండి డ్రాయింగ్ లోయ్యర్, హైయ్యర్., తమిళనాడు ప్రభుత్వం నుండి కూడా ఫ్రీ హ్యాండ్ అవుట్ లైన్ మోడల్ డ్రాయింగ్ లోయ్యర్, హైయ్యర్., మోడలింగ్ లో లోయ్యర్, హైయ్యర్ పూర్తి చేసారు. కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ మైసూరులో బి.ఎఫ్.ఎ. పూర్తి చేసారు.
ఒకపక్కన కుంచెతో చిత్రాలను, మరో పక్క ఉలితో శిల్పాలను సజీవంగా తీర్చిదిద్దడంలో దిట్ట సుబ్బారావు గారు.
అంతేకాదు మట్టిముద్దయినా, కాంస్య లోహమైనా, మరో పదార్ధమైనా సుబ్బారావు గారి చేతులో అది సజీవ ప్రతిమగా మారాల్సిందే.
చిన్నప్పుడు తన గురువు బెల్లకొండ సుబ్బారావు గారి వద్ద శిల్పకళను నేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో, ఎలా చేస్తే జీవం ఉట్టిపడుతూ, అందరికీ నచ్చుతాయోనన్న ఆలోచనతోను, పట్టుదలతోను, నిరంతరం కృషితోను 1990 సంవత్సరం నుండి అందమైన విగ్రహాలను రూపొందిస్తున్నారు. నల్లపాడులో గల స్వగృహ ప్రాంగణంలో కాంస్యం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లతో రూపొందించిన శిల్పాలు దర్శనమిస్తాయి. రోజూ ఆ దారిన వెళ్లే ప్రతివారూ చూడకుండా వెళ్లరూ అనడం అతిశయోక్తికాదు.
గుంటూరు నగరంలో ఉన్న కూడలిలో విగ్రహాలలో సగానికి పైగానే సుబ్బారావు గారు రూపొందించినవే. నాలుగు రోడ్ల కూడలిలో, పార్కుల్లోను, ప్రత్యేక స్థలాలోను, అధికార కార్యాలయాలలో నాయకులు, సంఘ సంస్కర్తలు, మహనీయుల విగ్రహాలను దర్శనమిస్తాయి. గుంటూరులోనే కాకుండా పాత గుంటూరు, నాగార్జున సాగర్, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో వీరి విగ్రహాలను స్థాపించారు.
ముఖ్యంగా మహాకవి తిక్కన, స్వామి వివేకానంద, గాంధీజీ, గౌతమ పుత్ర శాతకర్ని, టంగుటూరు ప్రకాశం పంతులు, గౌతమబద్ధ, యన్.టి.రామారావు, కవిరాజు త్రిపురనేని రామస్వామి, న్యాయదేవత, ఆచార్య నాగార్జున, బి.ఆర్.అంబేద్కర్, కాసు బ్రహ్మానంద రెడ్డి ఇలా చెప్పుకుంటూ వెళ్లితే వందల సంఖ్యలోనే ఉన్నాయి. అలాగే అదే సంఖ్యలో, ముఖ్యంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారం, లలికకళా సమైఖ్య సాంస్కృతిక సంస్థ నుండి ఉగాది సత్కారం, గోల్డ్ స్టార్ ఆఫ్ ఇండియా సంస్థ నుండి శిల్పకళ ఎక్సెలెన్స అవార్డ్ ఇవికాక ఎందరో ప్రముఖులచే సన్మానాలూ జరిగాయి.
ఈ క్రమములో ఆర్థికంగా బాగానే సంతృప్తిగా వుందని చెబుతూ, ఎప్పటికైనా ఈ రంగంలో నా ప్రత్యేకతను చాటుకొనే శిల్పాలను రూపొందిచాలనే ఆశయమైతే ఉందన్నారు. మూడు-నాలుగు సార్లు ప్రదర్శనలను ఏర్పాటు చేసారు. మరియు అనేక అవార్డులనూ అందుకున్నారు.
చివరిగా “నేటి యువత శిల్ప, చిత్రకళను నేర్చుకుంటే మంచి జీవనోపాధే. అయితే నేర్చుకోవడంలోను, సృజనాత్మకమైన బొమ్మలను తయారు చేయడంలో నిర్లక్ష్యంగాని, బద్దకంగాని ఉండరాదు. ఈ ప్రక్రియలో తపస్సులా చేస్తేనే అందరికీ నచ్చుతాయని, మనం బతకాలి, కళను బతికించాలని” వివరించారు టి.వి.కృష్ణ సుబ్బారావు గారు.
డా. దార్ల నాగేశ్వర రావు