ఆలయ శిల్పకళా ‘సిరి ‘ – ఆనందాచారి

ఆనందాచారి వేలు శిల్ప, చిత్రకళా రంగాల్లోనే కాకుండా ఆలయ నిర్మాణలోనూ అనేక ప్రయోగాలు చేసి విఖ్యాతి పొందారు. వేలు పేరు చూస్తే ఆంధేతరుడను కొంటారు. కాని ఆయన నూరు పైసల ఆంధ్రులు. చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో ఒక శిల్ప కుటుంబంలో 1952 జూన్ 1 న జన్మించారు. వీరి పూర్తి పేరు ఆనందాచారి వేలు. స్థానికంగా పాఠశాల విద్య చదివి, తిరుపతి దేవస్థానంకు చెందిన శిల్పకళాశాలలో నాల్గు సంవత్సరాలు శిల్ప విద్యనభ్యసించి 1975లో ప్రధమ శ్రేణిలో డిప్లమో తీసుకున్నారు. 1983లో గుంటూరులోని శ్రామిక విద్యాపీఠంలో డ్రాయింగ్, పెయింటింగ్, బ్లూప్రింట్ మేకింగ్లలో శిక్షణ పొందారు. 1985లో బి.ఎ., 1988లో డ్రాయింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత హైద్రాబాద్ ఎండోమెంటు బోర్డు శిల్పకళా విద్యాశాఖలో శిల్ప అధ్యాపకుడిగా అడుగుపెట్టి, సహాయ స్థపతి, ఉప స్థపతి లాంటి పదవులందుకొని, 2010లో పదవీ విరమణ తర్వాత 2011 లో స్థపతి సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. 2013-14 లో శ్రీశైల దేవస్థానం స్థపతి సలహాదారుడిగా పనిచేసారు. 2016 నుండి యాదాద్రి దేవాలయ నిర్మాణంలో పనిచేస్తూ.. 2018 లో అడిషనల్ స్థపతిగా భాద్యతలు పొంది, 2019 లో స్థపతి సలహాదారుడిగా నియమించబడి సుమారు 300 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.

1975 నుండి చిత్ర, శిల్పకళాఖండాలు తయారుచేసి పోటీలకు ప్రదర్శనకు పంపి, అనేక అవార్డుల్ని అందుకొన్నారు. 1975లో పిట్స్బర్గ్ లో నిర్మించిన దేవాలయ నిర్మాణం లో శిల్పకళా పర్యవేక్షకునిగా వ్యవ హరించారు. 2002లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రయత్నం చేసి 25 గంటల్లో 101 మెడిషన్ వర్ణ చిత్రాలు చిత్రించి Limca Book of Records, గ్లోబల్ ఇండియా రికార్డులతో పాటు మరో వంద రికార్డులు అందుకున్నారు. చిత్రకళల్ని గురించి పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. జపాన్, ఒసాకలలో వీరి చిత్రాలు ప్రదర్శింపబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండుసార్లు ఉగాది పురస్కారాలు అందుకొన్నారు. శిల్పకళా బ్రహ్మ, శిల్పకళా శిరోమణి వంటి బిరుదులు అందుకున్నారు. 2018లో తెలుగు యూనివర్శిటి ప్రతిభా పురస్కారం (రూ. 50,000 నగదు) అందుకున్నారు. 2019లో విశ్వకర్మ లెజెండ్ అవార్డ్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో అందుకున్నారు. ఆరుపదుల వయసు దాటినా అలుపెరుగని కళాసృజన చేస్తున్న ఆనందాచారి వేలు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది 64కళలు.కాం పత్రిక.

-కళాసాగర్

SA: