శ్రీ కాటూరి రవి చంద్ర (31) గారు, కోకావారి స్ట్రీట్, నాజర్ పేట, తెనాలి.
కాటూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు. గత మూడు దశాబ్దాలుగా “సూర్య విగ్రహశాల” శిల్పకళలో ఏడో తరానికి చెందినవారు.
తొలిగా బుద్ధుని జీవితచరిత్రపై ఎనిమిది పేయింటింగ్స్ వేసి, వాటిని కాలచక్ర-2006 లో ప్రదర్శించారు. దీనితో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ‘పద్మభూషణ్’ కే.ఎల్. రావ్ వంటి ప్రముఖుల విగ్రహాలను రూపొందించే అవకాశం దక్కిందన్నారు.
రవి చంద్ర చెయ్యి పడితే వీటి పని అయిపోయింది, ఇక పనికిరావని ముద్రపడిన ఇనుప వస్తువులన్ని అందమైన కళాకృతులుగా రూపుదిద్దుకుంటాయి. ఇప్పుడు మీరు చూసే శిల్పాలన్నీ పాడైపోయిన కారు, బైక్ ఇతర ఐరన్ వస్తువుల ద్వారా రూపొందించినవే. గుంటూరు మాయాబజార్ పాడైపోయిన బైక్, కార్ లు అమ్ముతూ ఉంటారు. లోకల్ షాప్ వాళ్ళు వాటిని కొనుగోలు చేసి బాగున్న విడిభాగాలను వీళ్ళు అమ్ముతూ ఉంటారు. రవి గారు తెనాలి నుండి 30 కిలోమీటర్లు ప్రయాణ చేసి ఆ పాడై పోయిన వస్తువులను ఏరి(వాటిని చూడగానే తెలిసిపోతుంది ఏ శరీరానికి దీన్ని ఉపయోగించవచ్చని) నెలల తరబడి శ్రమించి ఇదిగో మనం చూస్తున్న ప్రాణులుగా ఒక్కో వస్తువుతో తీర్చిదిద్దుతారు.
తరతరాలుగా వస్తున్న శిల్పకళను తండ్రి శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి వారసత్వంగా అందిపుచ్చుకోవడమే కాకుండా, జే.ఎన్.టీ.యూలో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసారు. కోల్ కత్తా లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేయడం ద్వారా తన కళకు మరింత మెరుగులు దిద్దుకోవడం జరిగిందన్నారు రవి చంద్ర.
ప్రపంచ శిల్పకారుల్లో తనదైన ఓ ప్రత్యేకశైలి కోసం, తపనతో ఇనుప వ్యర్ధాలను అందమైన శిల్పాలుగా మలచడం మొదలు పెట్టి, ఎన్నో విగ్రహాలను తయారు చేసి, దేశ, విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచ కళాభిమానుల ప్రశంసలందుకుంటున్నారు ఈ యువశిల్పి రవి చంద్ర కాటూరి.ఇనుప వ్యర్ధాలతో శిల్పాలను చూస్తుంటే, ఈపాటికే ఓ పాట గుర్తుకొచ్చే వుంటుంది. అదేనండి “ఇనుములో హృదయం మొలిచెలే-మరమనిషి మన్మథుడై వచ్చాడు” రోబో లో రోబో పాత్ర చిట్టి పాడుతుంది. మాటలు, పాటలు, నడక వంటివి లేకున్నా ఇనుప వ్యర్ధాలతో తీర్చిదిద్దిన కళాకృతులు భారతదేశంతో సహా సింగపూర్, మలేషియా దేశాల్లోని కళాప్రియుల మనసును దోచుకుంటున్నాయి.
తాతలు, తండ్రుల నుంచి వస్తున్న నేపథ్యమే, రవి చంద్రకుసహజంగానే కళాభిరుచి అలవడింది. కాటూరి వెంకటేశ్వరరావు గారు చేస్తున్న శిల్పకళ పనిలో రవి చంద్ర కూడా సహకారములను అందించేవారు.
శిల్పకారుడిగా తనదంటూ ప్రత్యేకత ఉండాలన్న భావనతో, వాహనాల విడిభాగాలను కొనుగోలు చేస్తూ, వాటితో ఒక్కో విగ్రహాన్ని చేస్తూ వచ్చాడు. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ, అహమ్మదాబాద్, వంటి నగరాలలోనిర్వహించిన ప్రదర్శనలకు కళావిమర్శకుల నుంచి అభినందనలు రావడంతో మరింత ఉత్సాహాన్నిచ్చింది.
2011 సంవత్సరంనుండి ఇనుప వ్యర్ధాలతో విగ్రహ ప్రక్రియను ఆరంభించిన రవి చంద్ర, విషపురుగు తేలు, ఎద్దు, సింహం, గుర్రం, కాఫీ తాగుతున్న మనిషి, తనకుతానే వెల్డింగ్ చేసుకుంటున్న మరో మనిషి, నిలబడిన మహిళ, స్కూటర్ పై మనిషి, రాట్నం తిప్పుతున్న జాతిపిత, అక్షరాలు పూసిన చెట్టు, చెట్టుపై వాలిన మయూరం, మొదలగు విగ్రహాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత లభించినట్టయింది. ఈ ఖ్యాతిని స్థిరపరచుకోవడం కోసం మరింత విస్తరించడమే తన లక్ష్యమని చెప్పారు రవి చంద్ర.
మరో విశేషం ఏమంటే, ఫేస్ బుక్ ద్వారా ఫాలో అవుతున్న సింగపూర్ లోని “జ్ఞాని ఆర్ట్ గ్యాలరీ” నిర్వాహకులు చూసి, నేరుగా తెనాలి వచ్చి, రవి చంద్ర చేసిన కళాకృతులతో వివిధ దేశాలలో ప్రదర్శనలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక అడుగు నుండి ఎనిమిది అడుగుల ఎత్తులో చేసిన దాదాపుగా ముప్పై ఇనుప వ్యర్ధ శిల్పాల్లో సగానికి పైగా సింగపూర్ ఆర్ట్ గ్యాలరీ సేకరించిందని వివరించారు.
దేశ సాంస్కృతిక శాఖ, దండి స్మారక సమితి సంయుక్త ఆధ్వర్యంలో ముంబాయిలో ఏర్పాటు చేసిన “స్కల్పచర్ వర్క్ షాపు”లో రవిచంద్ర తయారు చేసిన రెండు విగ్రహాలు, ప్రముఖులతోపాటు మహాత్మగాంధీ ముని మనవడు తుషార్ గాంధీని ఆకట్టుకున్నాయి. ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మగాంధీతోపాటు మరో 79 మంది స్వాతంత్ర్యోద్యమ నాయకులు పాల్గొన్నారు. గాంధీతోపాటు ఆ 79 మంది విగ్రహాలను తయారు చేయించాలని నిర్వాహకులు నిశ్చయించారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న శిల్పులలో కేవలం 40 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఆ 40 మందిలో తెనాలి యువశిల్పి కాటూరి రవి చంద్ర ఒకరుండటం మరో విశేషమని చెప్పారు. ఆ వర్క్ షాపులో రవి చంద్ర “జగన్ లాల్ జోషి, రత్నాజీ బోరియా” సహజత్వంతో రూపొందించిన ప్రతిమలను చూసిన తుషార్ గాంధీ రవిచంద్రను అభినందించి, దండి స్మారక పురస్కారం ఇచ్చి, రూ.యాభై వేల నగదు బహుమతిని అందించారని ఎంతో సంతోషంగా చెప్పారు రవిచంద్ర.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మానవాళికి విశేష సేవ చేసిన సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు “హిపోక్రటిస్, కెప్లర్, నికోలస్, కోపర్నికస్, గెలీలియో, చార్లెస్ డార్విన్, ఐజక్ న్యూటన్, మోడల్, లామార్క్, ఐన్ స్టీన్, కార్ల్ మార్క్స మొదలగు కాంస్య విగ్రహాలను రూపొందించే అవకాశం, అదృష్ఠం ప్రముఖ శిల్పులు తండ్రి, కొడుకులకు దక్కింది. ఈ విగ్రహాలు బాపట్లకు చెందిన డాక్టర్ దొప్పలపూడి మల్లికార్జునరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన “చార్లెస్ డార్విన్ గార్డెన్ అండ్ సైన్స్ మ్యూజియం”లో ఉంచుతారని తెలిపారు.
వీరు దేశ, విదేశవ్యాప్తంగా ఇరవై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అదేస్థాయిలో అవార్డులను కూడా అందుకున్నారు.
చివరిగా భవిష్యత్తులో “అంతర్జాతీయ శిల్పి” గా గుర్తింపు పొందాలన్నదే కాటూరి రవి చంద్ర ఆశయమని చెప్పారు.
డా. దార్ల నాగేశ్వర రావు
Really great art, amazing works. your contact no. please.
Amazing art… Congrats…
nice works.