రంగుల్లో ఒదిగిన సామాన్యత : ‘శీలావీ’ చిత్రాలు

శీలా వీర్రాజు కళా శీలం అంత్యంత మౌలికమైనది. అది స్వయం ప్రేరితమైనది. స్వీయ ఔన్నత్యంతో విస్తరించినది. అది పేరు ప్రఖ్యాతులతో నిమిత్తం లేకుండా కడు బాధ్యతతో జీవితకాలం కొనసాగినది. ఎక్కడ క్లేశం లేకుండా రస రమ్యంగా రూపు దాల్చినది. అది పెదవర్గానికి అంకితమైనది.

కళను సామాన్యీకరించిన శీలా వీర్రాజు గారు తమ 85వ ఏట మనలోకాన్ని వదిలి వెళ్ళారు. వారు పరలోకంలో ఉన్నా ఇహలోకం నుంచి వేల వేల వందనాలు తెలుపుకుంటూ రెండు మూడు విషయాలు, జూన్ 1 న వారి ద్వితీయ వర్థంతి సందర్భంగా… కందుకూరి రమేష్ బాబు గారి వ్యాసం…

రచయితగా శీలా వీర్రాజు గారి గురించి తెలియని సాహిత్యాభిమాని గానీ విమర్శకులు గానీ ఉండరు. కానీ, వారి చిత్రకళ గురించే అభిమానులు, విమర్శకులు ఇకా లోతుగా పరిశీలించవలసే ఉన్నది. రాసి చర్చించవలసి ఉన్నది. వారి కళా దృక్పథం, వస్తు వైవిధ్యం, రంగుల మేళవింపు, రూప నైరూప్య అధివాస్తవిక చిత్రాల ప్రత్యేకతలు, చిత్రించడానికి వారు అనుసరించిన వివిధ మాధ్యమాలు, వీటన్నిటికన్నా మిన్న వారి చిత్రాల్లో కాల దోషం పట్టని మానవత. ఆ మానవత్వాన్ని తట్టిలేపే హృదయాన్ని చిత్రకళలో వారేలా ఎప్పటికీ నిలిచిపోయేలా చేశారు? ఇవన్నీ మనం తరచి చూడవలసే ఉన్నది. చూడటమే కాదు, ముఖ్యంగా నేటి తరం కళాభిమానులకు, యువతరానికి తెలియజేయవలసినది ఎంతో ఉన్నది. ఆ ప్రయత్నంలో చంద్రుడికో నూలుపోగు మాదిరిగా ఆ కళాకారుడికి నీరాజనాలు అర్పిస్తూ రాస్తున్న వ్యాసం ఇది.

శీలా వీర్రాజు గారు గంభీరంగా కానవచ్చేవారు. కానీ వారు ఎంత సున్నిత మనస్కులో, మరెంత బాధ్యతాయుతమైన వారో తమ నిశితమైన చూపుతో జీవితాన్ని చిత్రకళలోకి ఒడిసిపట్టి సాక్షాత్కరింప జేసిన తీరు చెప్పకనే చెబుతుంది. మన కళ్ళెదుట ఉన్న సామాన్య జీవితాన్ని ఎంతో రమణీయంగా వారు చిత్రించి ఊరుకోవడమే కాదు, వాటిని ప్రదర్శనకు పెట్టడంతోనే సరిపోయిందనుకోకుండా మూడు మోనోగ్రాములుగా వాటిని సంకలన పరిచి వీక్షకులకు ఎంతో మేలు చేసిన కీర్తిశేషులు, నిరాడంబర మూర్తిమంతులు, జనసామాన్య చిత్రకళా కోవిదులు శ్రీ శీలా వీర్రాజు గారు. కళను సామాన్యీకరించిన శీలా వీర్రాజు గారు తమ 85వ ఏట మనలోకాన్ని వదిలి వెళ్ళారు. వారు పరలోకంలో ఉన్నా ఇహలోకం నుంచి వారికి వేల వేల వందనాలు తెలుపుకుంటూ రెండు మూడు విషయాలు.

చిత్రకారులుగా శీలా వీర్రాజు గారు ఎంచుకున్న వస్తువుల్లో పేదవారిగా అందరూ భావించే జన సామాన్యులే ప్రధానం. ఐతే, ఆ ప్రజల దుస్థితి కన్నా వారి సామాజిక ఔన్నత్యం ప్రధానంగా అనేక చిత్రాలు రచించడం వారి ప్రత్యేకత. చిత్రాల్లో నిరుపేదలు ప్రధానమైనా ఆయన వారి దయనీయ స్థితిని చెప్పలేదు. దానికి భిన్నంగా వారి సంతోషాలు, సంబురాలు, ఆనందాలను పండు వెన్నల వలే పరిచారు.

నిర్భాగ్యులుగా ఉన్న వారి ఆర్థిక స్థితులు, దారిద్ర్యం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు మటుకు ఎంతో శక్తివంతమైన చిత్రాలు రచించారు. అందులో ఆర్ద్రత, వేదన సరి సమానంగా ఉన్న కారణంగా అవి మన అంతరంగాలను తడిమి బాధ్యతను గుర్తు చేస్తాయి తప్పా వాటిని చూసి తప్పుకునేలా చేయవు. ‘బడుగు జీవుల’ను చిత్రించేటప్పుడు వారి కళ్ళలో తెల్లదనం ప్రస్పుటంగా వాడటం కూడా వారి ప్రత్యేకత. దాంతో ఆ చిత్రంలోని తల్లులూ పిల్లలూ మనల్ని వెంటాడుతూనే ఉంటారంటే అతిశయోక్తి కాదు.
ఇలా చిత్రించడానికి వారి పుట్టుక, పెరుగుదల, వికాసం పరిశీలించవలసిందే గానీ, వాటి వెనకాల కారణాలు ఏమైనప్పటికీ ఆయన మన సాంఘక జీవనం సాఫీగా సాగడానికి ప్రధాన కారకులైన వివిధ వృత్తి దారులను, వారి సేవలను, నైపుణ్యాలను ఎంతో గౌరవంగా, అభిమానంతో, మరెంతో ఆత్మీయంగా చిత్రించారు. స్త్రీపురుషులు వివిధ పనుల్లో ఉన్నప్పుడే కాదు, వారు విశ్రాంతిలో ఉన్న ఘడియలనూ వారు చిత్రించారు. అలాగే దైనందిన జీవితంలో ఆట పాటల్లో నిమగ్నమైన వారిని, అది పిల్లలు కావొచ్చు, పెద్దలు కావొచ్చు ఆ తీరును కూడా ఎంతో భావుకతతో చిత్రించారు.

ఒక్కమాటలో వారి చిత్రాలు సహృదయతకు ప్రతిబింబాలు. సామాన్యతకు నిలువుటద్దాలు. అవి మన కళ్ళెదుటే ఉన్న సామాన్య జీవితంలోని కళా కౌశలాన్ని ఎంతో శ్రద్దగా చూపే సులోచనాలు.
వారి కళా శీలం అంత్యంత మౌలికమైనది. అది స్వయం ప్రేరితమైనది. స్వీయ ఔన్నత్యంతో విస్తరించినది. అది పేరు ప్రఖ్యాతులతో నిమిత్తం లేకుండా కడు బాధ్యతతో జీవితకాలం కొనసాగినది. ఎక్కడ క్లేశం లేకుండా రస రమ్యంగా రూపు దాల్చినది. అది పెదవర్గానికి అంకితమైనది.

ఎంతో శ్రమకోర్చి ముద్రించిన వారి కళా సంపుటాలు చూస్తుంటే, అందలి బొమ్మలు మళ్ళీ మళ్ళీ చూస్తే నిజంగా చెప్పరానంత ఆశ్చర్యం కలుగుతోంది. తెలుగు చిత్రకారుల్లో ఎవరూ చూడని విధంగా, వేయని రీతిలో వారు స్త్రీలను స్పుటంగా, ఎత్తుగా, నిండుగా చిత్రించిన వైనం విస్మయానికి గురిచేస్తున్నది. సామాన్యమైన జీవన ఘడియల్లో నిమగ్నమైన ఆ గ్రామీణ మహిళల మోములో ఎంత శాంతి! దానంతట అది ప్రత్యేకమైతే, అంతకన్నా ముఖ్యం వారి ఒడ్డూ పొడవు. స్త్రీలను ఇంతటి అజానుబాహువులుగా తమ కళలో నిలిపిన వారు మరొకరు కానరారు.
అంతేకాదు, వారు చిత్రించిన ‘సుఖ నిద్ర’లో ఉన్న స్త్రీ చిత్రం గానీ, ‘సాయంకాలపు తీరిక వేళ’లో కానవచ్చే మగువ చిత్రం గానీ, ‘గతసృతుల’ను తలుచుకుంటున్న పడతి గానీ, ‘దీర్ఘాలోచనలో ఉన్న స్త్రీ’ చిత్రం గానీ, ‘మనసు గాయానికి ప్రకృతిలో స్వాంతన’ పొందే మగువ వంటివి ఎంతో ప్రత్యేకమైన చిత్రాలు గానీ అవన్నీ మహిళల ఏకాంత లోకాలకు శీలా వీర్రాజు గారు ఇచ్చిన ప్రాముఖ్యతను ఎంతో గొప్పగా తెలియజెబుతాయి.
‘బస్సు కోసం నిరీక్షణ’ వంటి చిత్రాలు శీలా వీర్రాజు గారికి ప్రజల రోజువారీ జీవితం సౌకర్యంగా సాగాలన్న ఆలోచనకు అద్దం పట్టెదే.

బహుశా శీలా వీర్రాజు మనసులో మహిళలకున్న స్థానం మహోన్నతం అని వారు ఎంచుకున్న ఈ రూప విశిష్టత, వస్తు వైవిధ్యతా ప్రబలంగా నిరూపిస్తున్నది.
కాగా, జానపద శైలిలో కాపు రాజయ్య గారు బెస్త, యాదవ వంటి కొన్నికుల వృత్తుల్లోని మహిళలు, మీనాల వంటి వారి కన్నులు, పొడవాటి ముక్కులు, అందమైన గదవలతో ముదురైన రంగుల్లో చూడముచ్చటగా చిత్రించారు. శీలా వీర్రాజు గారు రాజయ్య గారి కన్నా అధికంగా అనేక వ్యావృత్తుల్లో నిమగ్నమైన మహిళలను ఏంతో వైవిధ్యంగా చిత్రించారు. అలాగే రోజు వారీ కృత్యాలను కూడా ఎంతో ఆసక్తిగా చిత్రించారు. ఉదాహరణకు వంట పనిలో ఉన్న మహిళను, చిన్న పిల్లవాడికి తలంటు పోస్తున్న నానమ్మను, ఇలాంటి చిత్రాలెన్నో అక్కడి పరిసర ప్రపంచంలో కానవచ్చే అనేక వివరాలతో గీశారు. ఆలాగే తీరికగా ఉన్నప్పుడు ఆడుకునే ఆట పాటలతో వారు జీవితంలోని శోభాయమానమైన ఘడియలను ఎంతో లలిత లలితంగా చిత్రించడమూ విశేషం. అందుకు మంచి ఉదాహరణ నానమ్మ మనవరాలుతో ఉన్న ‘తారంగం తారంగం’ చిత్రం. అలాగే, ఇద్దరు యువతుల ‘వామనగుంటలాట’. బాలికల ‘ ఒప్పుల కుప్ప’, ‘చెమ్మ చెక్క’.

‘మమకారం’, ‘అలసిన వేళ’, ‘గుడికి’ వంటి చిత్రాలు వారి ప్రేమను, దయను, భక్తీకరుణరస హృదయాన్ని ఆవిష్కరించగా ‘పేదరాలు’, ‘శ్రమజీవులు’, ‘చితికిన రైతు’, ‘దిక్కు తోచని రైతన్న’, ‘ఆశలుడిగిన అన్నదాత’ వంటివి ప్రాపంచపు దృక్పథంలో వారెటువైపు మొగ్గినారూ అన్నది తెలియజేస్తాయి. ‘కట్టెల అడతి’, ‘కష్ట ఫలం’ వంటి చిత్రాలు వారి నిశిత పరిశీలనా దృష్టినే కాకా అటువంటి చిత్రాలను రచించేటప్పుడు వారు ఎంచుకున్న శైలిని, దాన్ని వారు ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకున్న తీరును పట్టిస్తాయి. ‘ఇంటింటా ఒకనాడు’, ‘విసుర్రాయి’, ‘దంపుళ్ళ దృశ్యం’ వంటివి ఆధునికత మాటున వెనక తట్టు పట్టిన ఒకనాటి సామూహిక పని పాటలను చిత్రక పడతాయి. అవి గత జీవితపు తీరుబాటును, అందలి సమిష్టి జీవన సౌందర్యాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తాయి.


శీలా వీర్రాజు గారు నీటి వర్ణాలు, తైల వర్ణాలతో చిత్రించడమే గాక రేఖా చిత్రాలు వందలు, వేలుగా చిత్రించి వెళ్ళారు. అందులో ముఖ్యంగా ‘లేపాక్షి’ ఆలయాన్ని చిత్రించిన తీరు మనకు మిగిల్చిన గొప్ప సంపద అనే చెప్పాలి. లేపాక్షి బయల్పడిన తొలి నాళ్ళలోనే వారు చిత్రించిన ఆ రేఖా చిత్రాలు విదేశాల్లో ప్రదర్శన గావింపబడటం ఒక విశేషమైతే అనంతర కాలంలో వారు ‘శిల్పరేఖ’ పేరుతో వాటన్నిటినీ ఒక పుస్తకంగా తేవడం కూడా మరో విశేషం. ఈ మోనోగ్రామ్ తెలుగువారికి గొప్ప బహుమానం.

వారి ప్రత్యేకత ఇంతటితోనే ముగియదు. చాలా స్వల్ప సంఖ్యలో సంపుటాల్లో దాగిన వారి నైరూప్య చిత్రాలు, అధివాస్తవిక ధోరణితో వేసిన బొమ్మలు ఇంకా ఎన్ని ఉన్నవో తెలియదు. వాటన్నిటినీ పరిశీలిస్తే వారి ప్రయోగాత్మకత ఇంకెలా వర్దిల్లినదో మనకు తెలుస్తుంది. మచ్చుకు ‘రంగుల కల’, ‘రంగులు రాగాలు’, ‘వర్ష నగరి’, ‘రాగాల పందిరి’, ‘వర్ష ప్రకృతి’, ‘వర్ణమయ ప్రకృతి’ వంటి అపురూప చిత్రాలు ఎంత భావస్పోరకమో అంత గంభీరం. చూసిన కొద్దీ కొత్త అర్థాలు గోచరించే ఇలాంటి చిత్రాలతో వారు మన మనసులు దోచుకుంటారు. మెదడుకు పని చెబుతారు.
‘చంద్రోదయం’, ‘శిశిరం’ వంటి చిత్రాలే కాదు, ‘సూర్య ప్రతాపం’, ‘పుష్ప విలాసం’ వంటి అరుదైన చిత్రాలతో శీలా వీర్రాజు గారు రసరమ్య చిత్ర కళా ఖండాలను మనకు అందించి వారు నిశ్శబ్దంగా సెలవు తీసుకున్నారు. చేయవలసినంత కళా సేవ చేసి వెళ్ళారు.

ఆ మహానుభావుడి చిత్ర విశేషాలను తరచి చూస్తూ అనుభూతి చెందడంతో వారు సర్వదా చిరంజీవిగా మనమధ్యే ఉంటారు. అందుకు తమంతట తాము శ్రమకోర్చి అందుబాటులో ఉంచిన మూడు సంపుటాలు తక్కువేమీ కాదు. వారే ఒక పుస్తకానికి శీర్షిక పెట్టినట్టు తమ ‘చిత్రకారీయం’ అజరామరం.

-కందుకూరి రమేష్ బాబు

2 thoughts on “రంగుల్లో ఒదిగిన సామాన్యత : ‘శీలావీ’ చిత్రాలు

  1. శీలా వీర్రాజు గారి గురించి ఆయన రెండో వర్ధంతి సందర్భంగా చక్కగా విపులంగా తెలియజేశారు.. కళలని ఆదరించటం ఆచరించటం ఎంత ముఖ్యమో మనల్ని వదిలి వెళ్లిన కళాకారులను గురించి కూడా గుర్తుంచుకోవడం గుర్తు చేయడం అంతే ముఖ్యము.. లేకపోతే కళ అనేది కనుమరుగై పోతుంది..
    మీకు కృతజ్ఞతలు కళాసాగర్ గారు

  2. Very Purposeful review of S.Veera Raju Garu
    His paintings depict the common scenes which we come across daily in the villages. His eye for the suffering of ladies took a strong place in all his paintings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap