(జూన్ 1న శీలా వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా…)
బహుముఖ ప్రజ్ఞాశాలురు అరుదుగా ఉంటారు. అటువంటివారిలో శీలా వీర్రాజు ఒకరు. ఆయన చిత్రకళ, సాహిత్యం రంగాలలో అద్భుతంగా రాణించారు. ఓ పత్రికలో సబ్- ఎడిటర్ కమ్ ఆర్టిస్ట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1963 లో రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాదకుడుగా చేరారు. ఉద్యోగ జీవితంలో కొనసాగుతూనే తీరిక సమయాల్లో చిత్రాలు వేశారు. రాష్ట్రంలోనూ, రాష్టేతర ప్రాంతాలలోనూ ఉన్న పలు శిల్ప క్షేత్రాలను సందర్శించి చాలావాటిని తన రేఖల్లో బంధించారు. అలా వేసిన లేపాక్షి శిల్పాల స్కెచ్ లను 1970లో హైదరాబాదు, బెంగుళూరు, జర్మనీలోని గోటింజెన్ నగరంలోనూ ప్రదర్శించారు. 1990లో ఈ స్కెచ్లను ‘శిల్పరేఖ’ పేరుతో వెలువరించారు. 2009లో ‘శీలా వీర్రాజు చిత్రకారీయం’ పేరుతో నీటి, నూనెరంగుల (వాటర్, ఆయిల్ కలర్స్) చిత్రాల పుస్తకాన్ని తీసుకొచ్చారు.
వీర్రాజు రచనల్లో ఎక్కువగా సున్నితమైన, హృదయగతమైన అంశాలు అగుపిస్తాయి. సంఘటన ప్రధానంగా కొన్ని కనిపించినా మనస్తత్వ చిత్రణ ప్రధానంగా రూపొందిన రచనలే ఎక్కువ. సాహిత్యంలోనూ, నిజ జీవితంలోనూ ఆయన కథలు, నవలల ఇతివృత్తాల్లో ప్రధానంగా ప్రేమ, స్నేహం, సౌందర్యారాధన, సౌజన్యం, సౌశీల్యం వంటి అంశాలే ఎక్కువగా చోటుచేసుకొన్నాయి.
వ్యక్తుల మనస్తత్వాన్ని నిశితంగా పరిశీలించే ధోరణి, మనస్తత్వ చిత్రణ పట్ల ఆయనకున్న అభిలాష ఆయన రచనలన్నింటిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ‘వెలుగు రేఖలు’, ‘కాంతి పూలు’, ‘మైనా’, ‘కరుణించని దేవత’ వంటి నవలలు శీలా వీర్రాజుకి ఎంతో పేరును తెచ్చాయి. ‘కొడిగట్టిన సూర్యుడు’, ‘హృదయం దొరికింది’, ‘మళ్లీ వెలుగు’, ‘కిటికీ కన్ను’, ‘ఎర్రడబ్బా రైలు’, ‘శీలా వీర్రాజు కవిత్వం’ (6 కవితా సంపుటాల గ్రంథం) వంటి కవితా సంపుటాలు వీర్రాజు సాహిత్య సృజనకు నిదర్శనం. వీరి కథలూ పలు సంపుటాలుగా వచ్చాయి. ‘సమాధి’, ‘మబ్బు’, ‘శీలా వీర్రాజు కథలు’, ‘బండి చక్రం’, ‘రంగుటద్దాలు’, ‘పగా మైనస్ ద్వేషం’, ‘మనసులోని కుంచె’, ‘వాళ్ల మధ్య వంతెన’, ‘ఊరు వీడ్కోలు చెప్పింది’ వంటివి ఎంతో ప్రజాదరణ పొందాయి. ‘కలానికి అటూ ఇటూ’ వ్యాస సంకలనం ఆయనకి మంచి పేరు తెచ్చింది.
‘కొడిగట్టిన సూర్యుడు’ కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ మొట్టమొదటి అవార్డు, ‘మైనా’ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఉత్తమ నవల పురస్కారం, డా॥ బోయి భీమన్న వచన కవితా పురస్కారం, న్యూఢిల్లీ తెలుగు సాహితీ సమితి జీవన సాఫల్య పురస్కారం, ఆవంత్స సోమసుందర్ ట్రస్టు పురస్కారాలు వంటివెన్నో అందుకున్నారు. అంతటి ఘనత పొందిన 83 ఏళ్ళ శీలా వీర్రాజు 2022 జూన్ నెల 1వ తేదీన గుండెపోటుతో హైదరాబాదులో మరణించారు. ఆయన సాహిత్యానికీ, చిత్ర కళాసీమకూ చేసిన కృషిని ఎన్నటికీ మరువలేము.
–రేగుళ్ళ మల్లికార్జునరావు, సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ, ఏ.పీ.
—————————————————————————————————————-
హైదరాబాద్ లో ప్రథమ వర్ధంతి: శీలా వీర్రాజు ప్రథమ వర్ధంతి మే 28 న ఆదివారం హైదరాబాద్ లోని తాజ్ హొటల్ జరిగింది. ఈ సభలో వారి గురించి వచ్చిన వ్యాసాలసంకలనం నదిప్రయాణం, మైనా హిందీ అనువాదం గ్రంథాల ఆవిష్కరణ ఆత్మీయ మిత్రులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో శివా రెడ్డి, సుధామ, ఆచార్య ఎన్. గోపి, నందిని సిద్ధారెడ్డి, శీలా వీర్రాజు గారి సహచరి శీలా సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు.
Seelaavi first death anniversary at Hyderabad.