
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు శేఖర్ కమ్ముల. ఈ సందర్భంగా ’25 ఇయర్స్ అఫ్ శేఖర్ కమ్ముల’ సెలబ్రేటింగ్ ది సోల్ అఫ్ స్టొరీ టెల్లింగ్ పోస్టర్ ని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసి ఆయన్ని అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శేఖర్ కమ్ముల ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేశారు.
టీనేజీలో ఒక్కసారి చిరంజీవి గారిని దగ్గరగా చూశాను. ‘ఈయనతో సినిమా తీయాలి’ అనే ఫీలింగ్. అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఇయర్స్. ‘lets celebrate’ అని మా team అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవిగారే. కొన్ని తరాలకు స్పూర్తి నిచ్చిన ఆయన. ‘chase your dreams, success మనల్ని follow అయి తీరుతుంది’ అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవి గారే. so, నా 25 years journey celebration అంటే ఆయన presenceలోనే చేసుకోవాలి అనిపించింది. Thank You Sir. ఈ momentsలోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు’ అని శేఖర్ కమ్ముల రాసుకొచ్చారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శేఖర్ కమ్ముల తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత. డాలర్ డ్రీమ్స్ అనే చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. మొదటి సినిమా అయినా ఇది పలు చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితమైంది. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలకు దర్శకుడు. ఆరు నంది పురస్కారాలు అందుకున్నాడు.
వ్యక్తిగతం: శేఖర్ 1972, ఫిబ్రవరి 4 న ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్లో జన్మించాడు. సికింద్రాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాడు. సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్సులో పీజీ కోసం వెళ్ళాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగంలో పనిచేసిన తర్వాత వాషింగ్టన్‌లోని హోవార్డ్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాడు.
సినీ యాత్ర: దర్శకుడిగా ఆయన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్. ఇది తెలుగు, ఇంగ్లీషులో రూపొందించబడింది. 100 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించలేదు కానీ ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది. అంతే కాకుండా ఇది పలు చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది. ఈ సినిమాను ఆయన మొదటగా పవన్ కల్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసినా ఆయనను ఎప్పుడూ సంప్రదించలేదు. తర్వాత ఈ సినిమాను అప్పటికి మూడు సినిమాల అనుభవం ఉన్న రాజా, కొత్త ముఖం కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలుగా తీశారు. సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి.
పాతికేళ్ళు – పది సినిమాలు:
‘ఆనంద్, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’, ‘లీడర్’, ‘ఫిదా’ ‘లవ్ స్టోరీ’ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ తో అలరించడానికి రెడీ అయ్యారు. జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.