విజయానికి అర్థం చెప్పిన పుస్తకం – సెల్పీ ఆఫ్ సక్సెస్

బుర్రా వెంకటేశం… ఒక తెలుగు అఖిలభారత సర్వీసు అధికారి. .. తీరికలేని విధులు… బాధ్యతలు… అన్నీ నిర్వహిస్తూనే ‘Selfie of Success’ (విజయానికి స్వీయ చిత్రం) పేరిట ఆంగ్లంలో ఒక పుస్తకాన్ని రచించారు. అమెజాన్ ద్వారా ఈ పుస్తకాన్ని విక్రయిస్తుండగా అది విశే షాదరణ పొందుతోంది. కొత్త రచయితల పుస్తకాల విక్రయంలో అగ్రస్థానంలో నిలిచింది. మిలిందా గేట్స్ వంటి ప్రముఖ రచయితల పుస్తకాల కంటే ఎక్కువ రేటింగు పొందింది. అసాధారణ విజయాలకు వెంకటేశం జీవిత కథే ఒక ఉదాహరణ. ఆయన ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఐఏఎస్ కాగలిగారు. పూర్వ వరంగల్ (ప్రస్తుతం జనగామ) జిల్లా కేశవాపూర్లో పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఏడేళ్ల వయస్సు లోనే తండ్రి నారాయణను కోల్పోయారు. తల్లి గౌరమ్మ నీడన పెరిగారు. ఆయన చదువు తెలుగులో సాగినా ఆంగ్లంలోనూ ప్రావీణ్యం సాధించారు. 1985లో తెలుగు సాహిత్యం సబ్జెక్టుగా సివిల్స్ పరీక్ష రాసి రాష్ట్రంలో మొదటి ర్యాంకుతో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వెంకటేశానికి పుస్తకాలంటే చాలా ఇష్టం. తీరిక వేళల్లో ఆయన పుస్తక పఠనం చేస్తారు. దాదాపు 30 దేశాల్లో పర్యటించారు. మానవ జీవితాలు, వారి మనోగతాలు, సామాజిక పరిస్థితులను ఆయన అధ్యయనం చేశారు. అసాధారణ వ్యక్తుల జీవితాలను విశ్లేషిస్తూ ఆయన ‘విజయంతో స్వీయచిత్రం’ పుస్తకాన్ని రచించారు. విజయం అంటే సంపద, పదవి, ఎదుగుదల, శ్రేయస్సు, కీర్తి, లక్ష్యం చేరడమే గాదు. ఎన్నో కోణాలున్నాయని విశ్లేషించారు. ‘విజయాన్ని చేరుకోవడం ఎలా? దాని పాఠ్యాంశాలు, దాని సారాంశం, దుష్ప్రభావాలు, విజయ సంతకం అనే ఐదు విభాగాలుగా ఇది సాగుతుంది. మహాత్మా గాంధీ, థామస్ అల్వా ఎడిసన్, మదర్ థెరెసా, అడాల్ఫ్ హిట్లర్, జేఆర్డీ టాటా, బిల్ గేట్స్, పబ్స్, ఎస్కోబార్, జాక్ మా, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, డేవిడ్ సర్నోఫ్, షేక్స్పియర్, మైఖేల్ జాక్సన్, గోవింద్ ఫాల్కే మేరీకోం, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులైన రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు జీవన యానాలను జోడించారు.
విజయానికి అర్థం చెప్పాలనే: వెంకటేశం
“ప్రస్తుత సమాజానికి ఉపయోగపడేలా, మార్గదర్శకం అయ్యేలా ఒక పుస్తకం రాయాలనే తపన మొదటి నుంచి ఉన్నా, అది ఇన్ని రోజులకు కార్యరూపం దాల్చిందంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి లక్ష్యం గెలుపే. దీనికి అసలైన అర్ధం తెలపాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాసారు. గెలుపు అంటే ఏమిటి? ఎందుకు? ఎలా? గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది, గెలిస్తే చాలా? ప్రపంచంలో గొప్ప వ్యక్తుల విజయాలు, వాటి పర్యవసానాలు. ఒకరు గెలవడం వెనక ఎంత మంది ఓడిపోతున్నారు అనేది వివరించారు. ఆయనకు స్పూర్తి నిచ్చిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఈ పుస్తకాన్ని అంకితమిచ్చారు. ఇది ప్రతీ ఒక్కరు కొని చదవాల్సిన పుస్తకం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులు, అన్నివర్గాలు, రంగాల వారికి మార్గదర్శకం. త్వరలోనే దీని తెలుగు అనువాదం, ఎమెస్కో వారు ప్రచురించనున్నారు. దీని పై వచ్చే ఆదాయాన్ని ఇబ్బందుల్లో ఉన్న వయోవృద్దుల సంక్షేమానికి వెచ్చించాలని నిర్ణయించుకోవడం మంచి ఆలోచన.

– బి.ఎం.పి. సింగ్

SA: