ఎ.ఎస్. మూర్తి కుంచె అగిపోయింది

అటు సినీరంగంలోను ఇటు పత్రికారంగంలో చిత్రకారులుగా విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ఎ.ఎస్.మూర్తి 1940లో పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరులో పార్వతమ్మ – రాజలింగం దంపతులుకు జన్మించారు. వీరి పూర్తి పేరు అడ్డుగుల సత్యనారాయణమూర్తి. చిత్రకళ పై అభిరుచితో చదువుకు స్వస్తి చెప్పి 1957లో మద్రాసు కు వచ్చారు. మూడేళ్లు ప్రముఖ చిత్రకారులు కేతా సాంబమూర్తి వద్ద శిష్యరికం చేసి మెళకువలు నేర్చుకొన్నారు.

తర్వాత ప్రముఖ చిత్రకారులు కె. గంగాధర్, ఎం. రామారావులతో కలిసి వారి పేర్లలోని మొదటి అక్షరాలతో ‘సరాగం’ అనే చిత్ర కళా సంస్థను స్థాపించారు. అదే పేరుతో అనేక కథల పుస్తకాలకు ముఖచిత్రాలు, కథలకు ఇలస్ట్రేషన్స్, సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. 1965 నుండి ఎ.ఎస్.మూర్తి పేరుతో ఒక సంస్థను స్థాపించి పబ్లిసిటీ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు 250 పైగా పనిచేశారు. వీరు ఆంధ్రపత్రిక, ప్రభ, యువ, నీలిమ, ప్రియదత్త పత్రికల్లో కథలకు వేలసంఖ్యలో ఇలస్ట్రేషన్ వేశారు. ఇంకా బొమ్మరిల్లు, బుజ్జాయి, ఆటవిడుపు డిటెక్టివ్ నవలకు ముఖచిత్రాలు వేశారు. ఇవికాక క్యాలండర్ పెయింటింగ్స్, అనేక రూపచిత్రాలు వేశారు. తమిళనాడు ఆర్డు అండ్ క్రాఫ్ట్ ఇంప్రూవ్ మెంట్ అసోషియేషన్లో ఆరు సంవత్సరాలు వరుసగా వీరి చిత్రాలు ప్రదర్శించారు. 2017 లో అదే సంస్థ ‘చిత్రకళారత్న’ బిరుదుతో సత్కరించింది. 2016లో గుంటూరుకు చెందిన క్రియేటివ్ ఆర్టు సంస్థ ‘చిత్రకిరీటి బిరుదుతో సత్కరించింది. 2018లో పాలకొల్లు లో వపా – బాపు ఆర్ట్ ఆకాడమి ‘చిత్రకళాద్రష్ట’ బిరుదుతో సత్కరించింది.

ప్రస్తుత తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుండి 2016 లో తమిళనాడు ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ సంస్థ నుండి ‘చిత్రకళా రత్న ‘ అవార్డ్ ను అందుకున్నారు.

79 యేళ్ళ వయసులోనూ ఈ నెల 13 న చెన్నై లో జరిగిన చిత్రకళా వర్క్ షాప్ లో పాల్గొన్న వీరు అక్టోబర్ 17 న  ఆకస్మిక మరణం చెందారు. వీరి మరణానికి 64కళలు పత్రిక నివాళులర్పిస్తుంది.

-సుంకర చలపతిరావు

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link