శ్రీధర్ అనగానే మనకు ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ గుర్తుకువస్తారు. కాని ఆయన కంటే ముందు తెలుగు కార్టూన్ రంగంలో మరో కార్టూనిస్ట్ శ్రీధర్ పేరుతో వున్నారు. శ్రీధర్(సీనియర్) పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పూర్తిపేరు పి. శ్రీధర్ కుమార్. పుట్టింది శేషయ్య, రామసుబ్బయ్య దంపతులకు 1945 సం. నెల్లూరులో. బి.ఏ.తో పాటు, డ్రాయింగ్ మరియు పెయింటింగ్ లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ పొందారు. నెల్లూరు కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు.
శ్రీధర్ ఆరవయేట నుండి బొమ్మలు గీయడం ప్రారంభించారు. పదమూడేళ్ళ వయసులో అప్పటి ముఖ్యమంత్రి గా ఉన్న డా. బెజవాడ గోపాలరెడ్డి గారి చిత్రం గీసి వారికి బహుకరించి, వారి మన్ననలను పొందారు. వాటర్ మరియు ఆయిల్ పెయింటింగ్ లు వేశారు. 1959 నుండి కార్టూన్లు గీయడం మొదలుపెట్టారు. తొలుత నెల్లూరులో స్థానిక వారపత్రికలో ‘పొలిటికల్ కార్టూనిస్ట్ ‘గా పనిచేశారు.
తరువాత 1961 నుండి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, యువ మొదలైన పత్రికలలో వందలాది కార్టూన్లు గీశారు. ముఖ్యంగా శివలెంక శంబూప్రసాద్ గారు వీరి కార్టూన్లను చూసి ఎంతో ప్రోత్సహించారు. చిన్న పెద్ద పత్రికలలో సుమారు పన్నెండు వేల వరకు కార్టూన్లు గీశారు. వీరు ప్రస్తుతం నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.
కార్టూన్ కళలో రాణించాలంటే ” మంచి హాస్యంతో కూడిన వ్యంగ్య భావం, చక్కటి బొమ్మలతో కార్టూన్ ఎఫ్ఫెక్టివ్ గా వుండాలి. బొమ్మలు, అక్షరాలు కంపోజింగ్ బావుండాలి. అందుకే కార్టూనిస్ట్ స్వహతాగా ఆర్టిస్ట్ అయివుండటం ఎంతో అవసరం ” అంటారు శ్రీధర్ గారు. అందుకేనేమో శ్రీధర్ గారి కార్టూన్లలో బొమ్మలు అంత బావుంటాయి.
-కళాసాగర్
చాలా బాగుంది సర్
Very good cartoonist
శ్రీధర్ గారి కార్టూన్లు చాలా బాగున్నాయి. బొమ్మలు కూడా వైవిధ్యంగా ఉన్నాయి. శ్రీధర్ గారికి అభినందనలు..
చాలా బాగా ఉందండీ పరిచయం.. చక్కటి తెలుగు గీతలతో ఉండే బొమ్మలు ఎంతో బావుంటాయి.. ఆయన మళ్ళీ పెన్సిల్ బ్రష్షు, పట్టుకుని కార్టూన్లు గీయాలని కోరుకుంటున్నాను.
– నాగిశెట్టి