బతికినంత కాలం రంగస్థలమే ఊపిరిగా జీవించారు. ఉన్నా లేకున్నా దర్జాగా బతికారు. ఎవరేమనుకున్నా చెదరని చిరునవ్వుతోనే ఉన్నారు. ఆతిథ్యం ఇవ్వడం లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఎందరికో నటనలో ఓనమాలు దిద్దించి నటనకే కొత్త భాష్యం చెప్పి చూపించి అందరికీ మాష్టారు అయ్యారు. ఆయన కోరుకున్నట్లుగానే షూటింగ్ సెట్ లోనే కనుమూశారు…ఆ మాష్టారు మరెవరో కాదు… డి.ఎస్.దీక్షిత్ గారు. ఇవాళ వారి జయంతి.
దీక్షిత్ గారికి నేను అంటే చాలా ఇష్టం. మా అమ్మ అంటే అభిమానం. మా అమ్మ ను వారు చూడలేదు. నేను రాసే రాతలు, మాట్లాడే మాటలు ఆయనకు నచ్చి, ప్రతి వేదిక పై “మంచి కొడుకును సమాజానికి ఇచ్చారమ్మ” అంటూ మా అమ్మ ను గుర్తు చేసుకునే వారు.
దీక్షిత్ గారిని ఎప్పుడు ఎక్కడ చూసినా ముచ్చటగా ఎంతో నీట్ గా, దర్జాగా కనిపిస్తారు అదే నవ్వు తో! ఆయనకు ఎన్నో కష్టాలు వున్నాయి. ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు. మరెన్నో ఆటు పోట్లు. అయినా ఆయన్ని చూస్తే ఎవరూ అనుకోరు. అలా ఉండేవారు. జేబులో డబ్బులు లేకపోయినా, పది మందిని ఆహ్వానించి పెద్ద ఎత్తున అప్పు చేసి మరీ ఆతిధ్యం ఇవ్వడంలో ఏమాత్రం వెనకాడరు. వారి శ్రీమతి చిత్రలేఖ గారు అంతే! ఇంటికి వెళ్లారంటే భోజనం చేసి తీరాల్సిందే.
ఇప్పుడు ఇద్దరూ లేరు. ముందు అర్జెంట్ పని ఉన్నట్లుగా చిత్రలేఖగారు వెళ్ళి పోయారు. ఆ తరువాత దీక్షిత్ గారు కూడా. దీక్షిత్ గారి జ్ఞాపకాలు నా దగ్గర బోలెడు ఉన్నాయి. కానీ, ఒక్కటి మీతో పంచుకుంటాను. నేను భోజన ప్రేమికుడ్ని కాను. ఏది ఉంటే అది టక టక తినేసి పక్కకు జరిగే రకం. దీక్షిత్ గారి పరిచయం నాలో మార్పు తీసుకొచ్చింది. తినేది కొంచెం అయినా ఇష్టంగా ప్రేమగా తినాలి అని దీక్షిత్ గారు నేర్పించారు. భోజనానికి ముందు, తినేటప్పుడు, తిన్నాక ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి ఆయన దగ్గరుండి నేర్పించారు. నాకు బ్రాహ్మణ భోజనం తినే విధానం తెలియచేశారు. అరటి ఆకు లో ఎలా తినాలి, ముందు దేంతో మొదలు పెట్టాలి, ఎలా కలుపుకోవాలి, ఎలా ముగించాలి, ఆకు ఎలా మడవాలి…ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన భోజనం తినే విధానం చూస్తే చాలా ముచ్చట గా ఉంటుంది. ఆయన తినడం కన్నా ఇతరులకు వడ్డించి తినిపించడం చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి పని ఒక పధ్ధతి ప్రకారం చేస్తారు. ఆత్మీయంగా ప్రేమగా పలకరిస్తారు. ఆయన సంపూర్ణ సాంప్రదాయ బ్రాహ్మణ అగ్రహార కుటుంబం అయినా నన్ను ఎప్పుడూ విడిగా చూడలేదు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని “నాన్నా, అది కాదు నాన్న” అంటూ ఎంతో ప్రేమ చూపించే వారు. దీక్షిత్ గారి జయంతి రోజు చిన్న జ్ఞాపకం చేసుకునే అవకాశం, మీతో పంచుకునే అదృష్టం కలిగింది.
దీక్షిత్ గారి లేని లోటు నాకే కాదు, ఎందరో కళాకారులకు, ముఖ్యంగా ప్రయోగాలు లేకుండా బోసిపోతున్న రంగస్థలానికి, నాటక రంగానికి ఎన్నటికీ తీరనిదే. రంగస్థలానికి ఎంతో సేవ చేశారు. నాటక రంగానికి ఒక దిక్సూచి లా నిలిచారు. ఎందరో సినీ కళాకారులకు నటన నేర్పించారు. ఎన్నో ప్రయోగాలు చేశారు. నంది నాటకోత్సవాలకు జీవం పోశారు. దీక్షిత్ గారి స్థానం ఎప్పటికీ చెదరదు. దీక్షిత్ గారికి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి
- డాక్టర్ మహ్మద్ రఫీ