శంకర్-జైకిషన్ జోడీలో అగ్రజుడు

బాలీవుడ్ చిత్రసీమలోని సంగీత విభాగంలో అద్వితీయమైన సంస్కరణలతో అజరామరమైన పాటలకు ఊపిరులూది, హిందీ సినీ సంగీతాన్ని కీర్తిశిఖరాలకు చేర్చిన అద్భుత జంటగా శంకర్-జైకిషన్ ల పేరును ముందుగా చెప్పుకోవాలి. 1949 నుంచి 1971 వరకు ఈ జంట అందించిన సంగీతం కొత్తబాటలను పరచింది. ముఖ్యంగా 1950-60 దశకంలో ఈ జంట అందించిన సంగీతానికి ఎల్లలు లేవనడంలో సందేహం లేదు. జైకిషన్ మధ్యలో కాలంచేసినా శంకర్ మాత్రం ఈ జంట పేరుతోనే కొన్ని సినిమాలకు సంగీతం అందిస్తూవచ్చారు. 26 ఏప్రిల్ శంకర్ వర్ధంతి. ఈ సందర్భంగా శంకర్-జైకిషన్ జంటను… అందులోనూ ముఖ్యంగా శంకర్ గురించి కొన్ని విశేషాలను మీముందుంచుతున్నాను.

శంకర్ అసలు పేరు శంకర్ సింగ్ రామ్ సింగ్ రఘువంశీ. శంకర్ పూర్వీకులు పంజాబ్ కు చెందినవారు. 15 అక్టోబర్ 1922 న శంకర్ హైదరాబాద్ నగరంలో జన్మించారు. ఆయన పెరిగింది కూడా హైదరాబాద్ నగరంలోనే. హైస్కూలు చదువు పూర్తి చేశాక బాబా నాసిర్ ఖాన్ వద్ద శంకర్ తొలుత తబలా వాయించడం నేర్చుకున్నాడు. అతడు మంచి డాన్సర్ కూడా. చాలా కాలం ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ బృందంలో తబలా వాయిస్తూ అతనికి అనుంగు శిష్యుడుగా మెలిగాడు. 1945లో బొంబాయి వెళ్ళి మొదట హేమవతి & శంకర్ నారాయణ్ నృత్య నాటక బృందంలో కొంతకాలం పనిచేసి తరవాత పృధ్వీరాజ్ కపూర్ థియేటర్ లో వాద్యకారుడుగా చేరాడు. అక్కడే పియానో, ఆకార్డియన్, సితార్ వంటి పన్నెండుకు పైగా వివిధ వాద్యాలను ఉపయోగించడంలో తర్ఫీదు పొందాడు. పృధ్వీ థియేటర్ ప్రదర్శించే నాటకాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ మంచిపేరు తెచ్చుకున్నాడు. అక్కడ పనిచేస్తూనే సంగీత దర్శకుడు హసన్ లాల్ భగత్ రామ్ వద్ద సహాయకుడుగా పనిచేశాడు. సొంతగా సంగీత దర్శకత్వం వహించాలని ఒక దర్శకుని కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడే శంకర్ కు జైకిషన్ తటస్థించాడు. అప్పట్లో శంకర్ తరచూ గుజరాతీ దర్శకుడు చంద్రవదన్ భట్ వద్దకు వెళ్తూ వుండేవాడు. తను సినిమా నిర్మించేటప్పుడు తప్పకుండా శంకర్ ని సంగీత దర్శకుడుగా పరిచయం చేస్తానని చంద్రవదన్ శంకర్ కు అభయమిచ్చాడు. శంకర్ కు జైకిషన్ చంద్రవదన్ భట్ వద్ద పరిచయమైన జైకిషన్ హార్మోనియం బాగా వాయిస్తాడని శంకర్ కు తెలిసింది. జైకిషన్ ను శంకర్ పృధ్వీ థియేటర్ కు తీసుకెళ్లి హార్మోనియం ప్లేయర్ గా పృధ్వీరాజ్ కపూర్ కు పరిచయం చేశాడు. శంకర్ ను బాగా అభిమానించే పృధ్వీరాజ్ కపూర్ మరో మాటలేకుండా జైకిషన్ కు పృధ్వీ థియేటర్ సంగీత విభాగంలో స్థానం కల్పించారు. వీరిద్దరికీ మంచి స్నేహం పెరిగి కలిసికట్టుగా పృధ్వీ థియేటర్ నాటకాలకు సంగీతం సమకూర్చేవారు. వీరిని ‘రామ్-లక్ష్మణ్ కి జోడీ’ అంటూ అందరూ ప్రశంసిస్తూవుండేవారు. పృధ్వీరాజ్ కపూర్ తనయుడు రాజ్ కపూర్ తో వీరిద్దరికీ పరిచయం యేర్పడింది. అప్పుడు రాజ్ కపూర్ దర్శకుడు కేదార్ శర్మకు సహాయకుడుగా పనిచేస్తూ దర్శకునిగా కానీ, నటుడుగా కానీ రాణించాలని ప్రయత్నిస్తూ వుండేవాడు. 1948 లో రాజ్ కపూర్ నిర్మాతగా మారి ‘’ఆగ్’ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆ చిత్రానికి రామ్ గంగూలీ సంగీత దర్శకుడు. తనకున్న పరిచయంతో రాజ్ కపూర్ శంకర్ జైకిషన్ లను ‘ఆగ్’ చిత్రంలో రామ్ గంగూలీకి సహాయ సంగీత దర్శకులుగా ప్రవేశపెట్టాడు.

‘బర్సార్’ సినిమాతో శంకర్ కు జంటగా జైకిషన్…

రాజకపూర్ శంకర్ ప్రతిభను గమనించి తన రెండవ చిత్రం ‘బర్సాత్’ (1949) కు శంకర్ ని సంగీత దర్శకునిగా ఎంపిక చేశాడు. దీనికి ముందు రాజ్ కపూర్ బర్సాత్ చిత్రానికి కూడా రామ్ గంగూలీనే సంగీత దర్శకుడుగా తీసుకున్నాడు. రాజ్ కపూర్ స్వయంగా సంగీతకారుడు. ఒకానొక పాటకు ట్యూన్ కట్టే విషయంలో రాజ్ కపూర్ రామ్ గంగూలీతో విభేదించాడు. అలా విభేదాలు ముదిరిన నేపథ్యంలో రాజ్ కపూర్ రామ్ గంగూలీని తప్పించి ఆ స్థానంలో శంకర్ ను సంగీత దర్శకుడుగా నియమించాడు. శంకర్ రాజ్ కపూర్ ను ఒప్పించి జైకిషన్ ని కూడా తనతో చేర్చుకొని శంకర్ జైకిషన్ ద్వయంగా ఆ సినిమాకు అద్భుత సంగీతాన్ని అందించారు. అలా బర్సాత్ చిత్రంతో ఇద్దరూ సంగీత దర్శకులుగా పరిచయమయ్యారు. శైలేంద్ర, హస్రత్ జైపురి లు గేయరచయితలుగా శంకర్ జైకిషన్ లు సంగీత దర్శకులుగా ఆ సినిమాలో తమ ప్రతిభను ధారవోసి సంగీతాన్ని అజరామరం చేశారు. అప్పట్లో లతా మంగేష్కర్ సినిమా అవకాశాలకోసం చాలా కష్టపడుతూ వుండేది. అటువంటి పరిస్థితుల్లో ‘బర్సాత్’లో శంకర్ ఆమెతో ఏకంగా 8 పాటలు పాడించడం విశేషం. జైకిషన్ కన్నా శంకర్ క్లాసికల్ సంగీతం మీద పట్టున్నవాడు. అంతే కాదు పన్నెండు వాద్యాలను అద్భుతంగా వాయించగల నేర్పరి కూడా. ఆరోజుల్లోనే శంకర్ 60 మంది వాద్య కళాకారులతో అతిపెద్ద వాద్య బృందాన్ని తయారు చేసి పాశ్చాత్య సంగీతపు రుచిని హిందీ సినీ ప్రియులకు అందించి రికార్డు నెలకొల్పాడు. అయితే శంకర్ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. చాలా గంభీరంగా వుండేవాడు. జైకిషన్ మాత్రం కలుపుగోలుగా వుంటూ, ప్రేమ గీతాలకు మంచి పదును పెట్టేవాడు. వీరిద్దరిలో అంతిమ నిర్ణయం శంకర్ దే. శంకర్ మద్యపానానికి దూరంగా వుండేవాడు. ఉదయం 7 గంటలకు స్టూడియోకి వెళితే తిరిగి ఇల్లు చేరడం రాత్రి 12 గంటలు దాటాకే. జైకిషన్ మాత్రం నిర్మాతలతో, దర్శకులతో, హీరోలతో తిరుగుతూ, క్లబ్ లకు, పబ్బులకు వెళుతూ స్టూడియోకి వస్తూ పోతూ వుండేవాడు. అయితే పని నిర్వహణలో మాత్రం శంకర్ కు ధీటుగానే వుండేవాడు. బర్సాత్ సినిమాకు వచ్చిన లాభాలతో రాజ్ కపూర్ ఆర్.కె. స్టూడియోని నిర్మించగలిగాడు. ‘బర్సాత్’ చిత్రంలోని మొత్తం 10 పాటలు సూపర్ హిట్లయ్యాయి. అప్పుడప్పుడే గాయనిగా స్థిరపడుతున్న లతాజీ ఆలపించిన ‘జియా బేకరార్ హై’, ‘బర్సాత్ మే హమ్ సే మిలే’, ‘అబ్ మేరా కౌన్ సహారా’, ‘ఛోడ్ గయే బాలమ్’ పాటలు నేటికీ నిత్య నూతనంగా వినిపిస్తూ, సంగీతాభిమానులను రంజింపజేస్తూనే వున్నాయి. ప్లానెట్ బాలీవుడ్ సంస్థ ఎంపిక చేసిన అత్యద్భుత సౌండ్ ట్రాక్ జాబితాలో ‘బర్సాత్’ చిత్ర సౌండ్ ట్రాక్ ప్రధమస్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. బర్సాత్ ఇచ్చిన విజయంతో 1949-59 మధ్యకాలంలో శంకర్ జైకిషన్ ను కలుపుకొని అవారా, బాదల్, కాలీఘటా, మయూర్ పంఖ్, శ్రీ 420, బసంత్ బహార్, న్యూ దిల్లీ, కట్ పుత్లి, అనారి, చోరీ చోరి, దాగ్, యాహుది, బూట్ పాలిష్, చోటి బెహన్, లవ్ మ్యారేజ్, ఉజాలా వంటి విజయవంతమైన సినిమాలకు జనరంజకమైన సంగీతాన్ని సమకూర్చి ‘శంకర్ జైకిషన్’ గా ప్రసిద్ధిగాంచారు. శంకర్ జైకిషన్ బృందంలో శైలేంద్ర, హస్రత్ జైపురి గేయరచయితలుగా, లతా మంగేష్కర్, ఆశా భోస్లే, మహమ్మద్ రఫీ, ముఖేష్, మన్నా దే ముఖ్య గాయనీ గాయకులుగా విజయపరంపర కొనసాగించారు. వీరికి దత్తారాం, సెబాస్టియన్ లు సహాయకులుగా సేవలందించారు. దత్తారాం రిథమ్ శాఖను పర్యవేక్షిస్తుండగా, సెబాస్టియన్ శంకర్ జైకిషన్ లు స్వరపరచే పాటలకు నోటేషన్లు రాసి సంగీత బృందానికి ఇచ్చి సాధన చేయించేవాడు. తదనంతర కాలంలో దత్తారాం కూడా సంగీత దర్శకుడయ్యాడు. శంకర్ జైకిషన్ లు సంగీత దర్శకులుగా అవతారమెత్తిన కొత్తల్లో హిందీ చిత్రరంగంలో నౌషాద్, సి. రామచంద్ర, రోషన్, ఎస్.డి. బర్మన్, వసంత్ దేశాయ్, ఓ.పి. నయ్యర్, సలీల్ చౌదరి, మదన్ మోహన్ వంటి నిష్ణాతులైన సంగీత దర్శకులు స్థిరపడి వున్నారు. వారినుంచి సహజంగానే శంకర్ జైకిషన్ లకు మంచి పోటీ ఎదురైంది. అయితే ఆ పోటీని తట్టుకొనినిలచి అద్భుతమైన సంగీతాన్ని ఈ ద్వయం అందించింది. వీరిద్దరూ ఆర్.కె ఫిలిమ్స్ సంస్థకు ఆస్థాన సంగీతకారులుగా మెలిగారు. సమయం దొరికినప్పుడల్లా శంకర్ జైకిషన్ ల చేత మంచి మంచి ట్యూన్లు రికార్డు చేయించి ఒక ‘మ్యూజిక్ బ్యాంక్’ ను రాజ్ కపూర్ పదిలపరిచేవాడు. జైకిషన్ మరణాంతరం ఆ ట్యూన్లను లక్ష్మీకాంత్ ప్యారేలాల్ (బాబీ, సత్యం శివం సుందరం, ప్రేమ్ రోగ్), రవీంద్ర జైన్ (రామ్ తేరీ గంగా మైలీ) కు ఇచ్చి వాటిని మెరుగు పరచి మంచి సంగీతాన్ని రాజ్ కపూర్ రాబట్టాడు. అయితే వాటి క్రెడిట్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్, రవీంద్ర జైన్ లకే కట్టబెట్టడం రాజ్ కపూర్ గొప్పతనం. మహమ్మద్ రఫీ గాత్రమంటే శంకర్ జైకిషన్ లకు ఎంతో ఇష్టం.

Shankar Jaikishan

హిందీ సినిమా సంగీతానికి కొత్త ఒరవడి…

శంకర్ జైకిషన్ రాకతో హిందీ సినిమా సంగీతానికి కొత్త ఒరవడి చేకూరింది. వీరు ఒకవైపు సంప్రదాయ సంగీతానికి పట్టం కడుతూనే, పాశ్చాత్య వాద్యశైలిని జోడిస్తూ అద్బుత ప్రయోగాలు చేశారు. శంకర్ జైకిషన్ ల ఆర్కెస్ట్రాలో దాదాపు అరవైమంది వాద్య కళాకారులు వుండేవారు. అందుకే వారు అందించిన నేపథ్య సంగీతం కొత్త పుంతలు తొక్కింది. కొన్ని సందర్భాలలో వందమందికి పైగా వాద్యకారులను ఉపయోగించిన సంఘటనలు చాలా వున్నాయి. ప్రతి పాటకు సన్నివేశ నేపథ్యాన్ని అడిగి తెలుసుకొని, దర్శక నిర్మాతలతో చర్చించి ట్యూన్లు కట్టడంచేత, శంకర్ జైకిషన్ ల పాటలు సినిమాలో ఒక భాగమై నిలిచేవి… అంతేగానీ ఇరికించిన పాటల్లా ధ్వనించేవి కావు. ప్రతి చరణానికి ముందు వచ్చే ఇంటర్లూడ్స్ శంకర్ జైకిషన్ సంగీతంలో ప్రత్యేకంగా అనిపిస్తాయి. అలాగని వీరు హిందూస్తానీ సంప్రదాయ సంగీత రీతులను విస్మరించలేదు. ఉదాహరణకు ‘మేరే హుజూర్’ చిత్రంలో ‘ఝనక్ ఝనక్ తోరి బాజే పాయలియా’; ‘జానే అంజానే’ చిత్రంలో ‘చమ్ చమ్ బాజే రే పాయలియా’; ‘లవ్ ఇన్ టోక్యో’ చిత్రంలో ‘కోయి మత్ వాలా ఆయా మేరే ద్వారే’; ‘లాల్ పత్తర్’ చిత్రంలో ‘సూనీ సూనీ సన్స్ కె సితార్ పర్’; ’మయూర్ పంఖ్’ చిత్రంలో ‘యే బర్కా బహార్ సౌతనియా కె ద్వార్’ మొదలైన పాటల్ని చెప్పుకోవచ్చు. 1966లో లేఖ్ టాండన్ నిర్మించిన ‘ఆమ్రపాలి’ సినిమాకు శంకర్ జైకిషన్ పూర్తి స్థాయి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ సమకూర్చారు. ఇందులో ఐదు పాటలుండగా అన్నీ పాటల్ని లతా మంగేష్కర్ ఆలపించారు. వాటిలో ‘జావోరే జోగి తుమ్ జావోరే’, ‘నీల్ గగన్ కి ఛావ్ మే’, ‘నాచో గావో నాచో, ధూమ్ మచావో నాచో’, ‘తడప్ యే దిన్ రాత్ కి’ అద్భుతమైన సెమీ క్లాసికల్ పాటలు కాగా, వాటికి వైజయంతిమాల నర్తించిన నృత్యరీతులు అద్భుతాలే. సినిమా ఆశించినంత విజయవంతం కాకపోవడంతో ఈ పాటల జిలుగులు ఎక్కువగా మెరవలేదు. శంకర్ జైకిషన్ లు ఎక్కువగా భైరవి రాగంలో పాటలు స్వరపరచేందుకు మొగ్గు చూపేవారు. సాధారణంగా విషాద ఛాయలు వుండే పాటలు మంద్ర స్థాయిలో నడుస్తుంటాయి. కానీ శంకర్ జైకిషన్ లు వాటిని కూడా వేగమైన టెంపోతో నడిపించి హిట్ చెయ్యడం విశేషం. ఉదాహరణకు ‘బర్సాత్’ చిత్రంలో ‘జిందగీ మే హర్దమ్ రోతా హి రహా’, ‘అనారి’లో ‘తేరా జనా దిల్ కె అర్మానో’, ‘దాగ్’ సినిమాలో ‘ఆయ్ మేరే దిల్ కహీ అవుర్ చల్’, ‘పతిత’ చిత్రంలో ‘ఆంధే జహాకే ఆంధే రాస్తే’ పాటలు మచ్చుకు కొన్ని మాత్రమే! వీరి ప్రయోగాలు భలేగా వుంటాయి. ఉదాహరణకు ‘ఆవారా’ సినిమాలో టైటిల్ సాంగ్ లో హార్మోనియం వాయించి దానికి పియానోతో ఆకార్డియన్ ధ్వని కల్పించడం గొప్ప ప్రయోగంగా చెప్పుకోవాలి.

ఎవరి శైలి వారిదే… కానీ ఇద్దరిదీ ఒకటే!

శంకర్ జైకిషన్ లది ఒక టీం వర్క్. శంకర్ తనదైన శైలిలో పాటలకు మట్లు కడితే జైకిషన్ మరో శైలిలో వాటికి మెరుగులు దిద్దేవారు. వీరిద్దరూ ఎవరికి వారే వేరువేరుగా పాటలకు మట్లు కట్టేవారు. శంకర్ ఎక్కువగా శైలేంద్ర రాసే గీతాలకు స్వరాలు అల్లితే, జైకిషన్ హస్రత్ జైపురి కలం నుండి జాలువారే పాటలకు పనిచెప్పేవాడు. అయితే హస్రత్ రాసిన పాటలకు శంకర్ మట్లుకట్టిన సంఘటనలు, శైలేంద్ర గీతాలకు జైకిషన్ స్వరాలు అల్లిన సంఘటనలు లేకపోలేదు. ఈ జంటలో శంకర్ సీనియర్ కనుక జైకిషన్ స్వరపరచిన పాటలకు కూడా ఆర్కెస్రైజేషన్ శంకరే చేపట్టేవాడు. వీరిద్దరి మధ్య ఒక రహస్య అంగీకారం వుండేది. ఏ పాట ఎవరు స్వరపరచింది బయటకు తెలియనిచ్చేవారు కాదు. జైకిషన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చడంలో నేర్పరి. అలాగే శృంగార పాటలు స్వరపరచడంలో జైకిషన్ మేధావి. ‘గబన్’ చిత్రం లో ‘ఎహసాన్ మేరే దిల్ పే తుమ్హారా హై దోస్తోం’ జైకిషన్ బ్రాండ్ సాంగ్. శంకర్ ది స్ట్రెయిట్ లైన్ గా వుండే స్వర అల్లిక. శ్రీ 420 లో ‘మేరా జూతా హై జపానీ’, అవారా సినిమాలో టైటిల్ పాట ఈ కోవలోనివే. జైకిషన్ అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన సినిమాలలో ‘సంగమ్’, ‘మేరా నామ్ జోకర్’ సినిమాలను ఉదహరించవచ్చు. పాటల రికార్డింగ్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇద్దరిదీ ఒకే మాట…ఒకే బాట. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జైకిషన్ చొరవ తీసుకునేవాడని, ఆర్ధిక లావాదేవీలు కూడా ఆయనే చూసేవాడనే అపప్రద బాలీవుడ్ సర్కిళ్లలో వుంది. కానీ అది నిజం కాదు. వీటిలో శంకర్ మాటే ఫైనల్ గా వుండేది. ఇండియాలో ’జాజ్’ మ్యూజిక్ కు శ్రీకారం చుట్టింది శంకర్ జైకిషన్ జంటే! వారు 1968లో విడుదల చేసిన ‘రాగా-జాజ్ స్టయిల్’ అనే అల్బమ్ భారతదేశంలో ప్రవేశపెట్టబడిన తొలి జాజ్ ఆల్బంరికార్డ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో వున్న 11 పాటలకు సంప్రదాయ రాగాలను వాడుతూ, సాక్సాఫోన్, ట్రంపెట్, సితార్, తబలా, బాస్ వంటి వాద్యాల సహకారంతో జాజ్ మ్యూజిక్ వెలువరించారు.

గుర్తింపు…

1954లో ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు ప్రవేశపెట్టిన తర్వాత శంకర్ జైకిషన్ జంట తొలిసారి 1957లో ‘చోరి చోరి’ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ బహుమతి అందుకున్నారు. తర్వాత అనారి (1960), దిల్ అప్నా అవుర్ ప్రీత్ పరాయీ (1961), ప్రొఫెసర్ (1963), సూరజ్ (167), బ్రహ్మచారి (1969), పెహచాన్ (1971), మేరా నామ్ జోకర్ (1972), బేయిమాన్ (1973) చిత్రాలకు వారికి ఫిల్మ్ ఫేర్ బహుమతులు లభించాయి. మొత్తం మీద 9 సార్లు వారు ఉత్తమ సంగీత దర్శకులుగా ఫిల్మ్ ఫేర్ బహుమతులు అందుకున్నారు. వీటిలో చివరి మూడు బహుమతులు వరస సంవత్సరాలలో గెలుచుకోవడంతో ‘హ్యాట్ ట్రిక్’ సాధించినట్లయింది. ఈ ఫీట్ ను తర్వాతికాలంలో కూడా మరెవ్వరూ చేపట్టలేకపోయారు. ఇవి కాకుండా మరొక 11సార్లు ఈ ఫిల్మ్ ఫేర్ బహుమతుల కోసం నామినేట్ అయ్యారు. బినాకా గీత్ మాలా పోటీలో శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చిన పాటలు ఆరు పర్యాయాలు తొలి స్థానం సంపాదించాయి. ఇది ఒక రికార్డు. మేరే హుజూర్ (1968) చిత్రంలో ‘ఝనక్ ఝనక్ తోరీ బాజే పాయలియా’ పాటకు, లాల్ పత్తర్ (1971) చిత్రంలో ‘రే మన్ సుర్ మేగా’ పాటకు ‘సుర్-సింగార్’ సంస్థ బహుమతులు ప్రదానం చేసింది. బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ బ్రహ్మచారి (1968), అందాజ్ (1971) చిత్రాలకు శంకర్ జైకిషన్ లను ఉత్తమ సంగీత దర్శకులుగా ఎంపిక చేసింది. 1968లో శంకర్ జైకిషన్ లకు పద్మశ్రీ పురస్కారం లభించింది. తంతి తపాలా శాఖ శంకర్ జైకిషన్ ల స్మారక స్టాంపును విడుదల చేసింది.

వివాదంలో ‘SJ’ జంట…

చలనచిత్రసీమలో వదంతులు, ఈర్ష్యా ద్వేషాలు సహజమే. వాటికి శంకర్ జైకిషన్ లు కూడా మినహాయింపు కాదు. వీరి జోడీకి సినిమాలు ఎక్కువ కావడంతో శంకర్ జైకిషన్ ల మధ్య ఒక రహస్య అంగీకారం వుండేది. కొన్ని పాటలకు శంకర్, కొన్నిటికి జైకిషన్ స్వరాలు కూర్చుతూ పని విభజన చేసుకునేవారు. అయినా వారు ఎప్పుడూ ఈ సంగతి బయటకు పొక్కనీయలేదు. ఫిల్మ్ ఫేర్ పత్రికలో ఒకసారి జైకిషన్ కాలంరాస్తూ, సంగమ్ చిత్రంలోని ‘యే మేరా ప్రేమ్ పత్ర పఢ్ కర్’ పాటకు స్వరాలు తానే కూర్చానని చెప్పుకున్నాడు. సహజంగానే ఈ విషయం శంకర్ ను బాధించింది. అగ్నికి ఆజ్యం తోడయినట్లు 1966లో విడుదలైన ‘సూరజ్’ సినిమాలో శంకర్ శారద అనే గాయని ని పరిచయం చేసి ఆమెతో ‘తిత్లీ ఉడీ ఉడ్ జో చలీ’, ‘దేఖో మేరా దిల్ మచల్ గయా’ అనే రెండు పాటలు పాడించాడు. ఆ రెండు పాటలూ హిట్లే అయినా, జైకిషన్ కు శారద రావడం ఎందుకో ఇష్టంలేదు. శారదను శంకర్ ఎక్కువగా ప్రోత్సహించడం, జైకిషన్ లతాజీతో ఎక్కువ పాటలు పాడించాలని అనుకోవడంతో వీరిద్దరి మధ్య కొద్దిపాటి భేదాభిప్రాయాలు పొడచూపాయి. ఒకరకంగా లతాజీ కూడా శంకర్, రాజ్ కపూర్ లమీద కాస్త గుర్రుగా వుండేది. అందుకు కారణం ‘సంగమ్’ సినిమాలో తన ఇష్టాన్ని కాదని ‘మై క్యా కరూ రామ్ ముఝే బుడ్ఢా మిల్ గయా’ పాటను పాడించడం అందుకు ఒక కారణం. జైకిషన్ ను రాజకపూర్ కు పరిచయంచేసి ‘శంకర్ జైకిషన్’ జంట ఆవిర్భావానికి కారకుడైన శంకర్ అంటే జైకిషన్ కు చాలా అభిమానం. కానీ, శారద రాకను హర్షించలేక, శంకర్ కు ‘నో’ చెప్పలేక సతమతమవుతూ జైకిషన్ ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం ప్రారంభించాడు. శంకర్ జైకిషన్ ల మధ్య వున్న విభేదాలను పరిష్కరించేందుకు మహమ్మద్ రఫీ కూడా తనవంతు ప్రయత్నం చేశాడు. మోతాదుకు మించి మద్యం పుచ్చుకోవడం జైకిషన్ ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. లేకుంటే 42 ఏళ్లకే కాలేయం దెబ్బతిని చనిపోయేవాడు కాదు. పృధ్వీ థియేటర్ కు పని చేస్తున్నప్పటినుండి షమ్మీ కపూర్ జైకిషన్ కు ప్రాణస్నేహితుడు. జైకిషన్ మరణానికి తాగుడుకు బానిస కావడమే అని షమ్మీ ధృవీకరించాడు. అయితే శంకర్ మాత్రం యేనాడూ తమ మధ్య విభేదాలున్నాయని జైకిషన్ చనిపోయాక కూడా బయట పెట్టలేదు. అలా ‘శంకర్ జైకిషన్’ పేరుతోనే సినిమాలకు సంగీతం అందిస్తూ తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు. జైకిషన్ 12, సెప్టెంబర్ 1971 న అకాల మరణం పొందిన తర్వాత కూడా 1949లో యేర్పడిన తమ బ్రాండ్ నేమ్ ను ‘శంకర్ జైకిషన్’ గానే శంకర్ కొనసాగించారు. జైకిషన్ మరణానంతరం ఆ జంట పేరుకు తగినంత ఆదరణ లభించలేదు.

జైకిషన్ మరణంతో శంకర్

1971లో జైకిషన్ మరణించాక శంకర్ SJ పేరుతోనే ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేశాడు. తరవాత అదే పేరుతో ‘బేయిమాన్’ వంటి కొన్ని సినిమాలకు సంగీతం సమకూర్చాడు. అయితే అంత భారీ ఆర్కెస్ట్రా బృందాన్ని భరించేలేమని నిర్మాతలు చెప్పడంతో మునుపటి సంగీత సౌరభం శంకర్ అందించలేకపోయాడు. శంకర్ సంగీతం అందించిన నైనా, లాల్ పత్తర్, సీమా, వచన్, దో ఝూట్ వంటి సినిమాల సంగీతం అంతగా మెప్పు పొందలేదు. అయితే ‘సన్యాసి’ చిత్రానికి సమకూర్చిన సంగీతం బాక్సాఫీస్ హిట్టయింది. తర్వాత రాజ్ కపూర్ కూడా ‘బాబీ’ సినిమాకు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ను సంగీత దర్శకులుగా తీసుకున్నారు. శంకర్ కు కూడా సంగీత దర్శకత్వం మీద ఆసక్తి సన్నగిల్లింది. ఏప్రిల్ 26, 1987న శంకర్ గుండెపోటుతో చనిపోయాడు. శంకర్ కుటుంబీకులు ఎవరికీ తెలుపకుండా శంకర్ అంతిమ సంస్కారాలను ఆదేరోజు పూర్తిచేయడంతో సినీ పరిశ్రమ విస్తుపోయింది. రాజ్ కపూర్ కి కూడా మరుసటిరోజు ఈ వార్త తెలియడంతో ఆయన చాలా బాధపడ్డారు.

మరికొన్ని విశేషాలు…

ముందు చెప్పుకున్నట్లు రాజ్ కపూర్ శంకర్ జైకిషన్ ల చేత కొన్ని ట్యూన్లు రికార్డ్ చేయించి తన సంగీత భాండాగారంలో పదిలపరచుకునేవాడు. మేరా నామ్ జోకర్ సినిమాలో హిట్ సాంగ్ ‘జానే కహా గయే వో దిన్’ పాట ట్యూన్ జిస్ దేశ్ మే గంగా బెహతీ హై చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వినిపిస్తుంది. అలాగే బాబీ సినిమాలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వినిపించే గోవన్ పాట ‘నా మాంగూ సోనా చాందీ’ ట్యూన్ ను శంకర్ జైకిషన్ ఆవారా చిత్రంలో ‘దమ్ భర్ జో ఉధర్ ముహ్ ఫేరే ఓ చందా’ పాటకు ముందు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిట్ గా వినిపించారు. మయూర్ పంఖ్ సినిమా టైటిల్ మ్యూజిక్ ను ఉజాలా చిత్రంలో ‘మొరా నాదాన్ బాలమా’ అనే పాటలో వాడుకున్నారు. అలాగే శ్రీ 420 చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వినిపించే బిట్ ను అనారి చిత్రంలో ‘కిసీకి ముస్కురాతోమ్ పే’ పాటకు వాడుకున్నారు. జంగ్లీ సినిమాలో ’చాహే కోయి ముఝే జంగ్లీ కహే’ పాటకు ముందు వచ్చే ‘యాహూ’ అనే ఓపెనింగ్ బిట్లను శంకర్ ప్రయాగ్ రాజ్ చేత ఆలపింపచేశారు. అలాగే ‘కరూ మై క్యా సుకూ సుకూ’ పాటలో ‘సుకూ సుకూ’ అనేజ్ పదాలను పలికింది సంగీత దర్శకుడు శంకర్. శంకర్ జైకిషన్ లు కొందరు నిష్ణాతులైన వాద్యకారుల సేవలనుకూడా వినియోగించుకున్నారు. ‘సునో చోటి సి గుడియా కి’ పాటలో ఉస్తాద్ ఆలీ అక్బర్ ఖాన్ సరోద్ వాద్యం వినిపిస్తాడు. ‘మై పియా తేరీ’ పాటలో ఫ్లూట్ బిట్లను వాయించింది పన్నాలాల్ ఘోష్. ‘తేరా తీర్’ పాటలో ఎలక్ట్రిక్ గిటార్ వాయించింది హజారా సింగ్. ‘బేదర్ది బాలమా తుఝ్ కొ’ పాటలో సాక్సాఫోన్ వాయించింది మనోహరి. ప్రసిద్ధ సంప్రదాయ సంగీత విద్వాంసుడు భీంసేన్ జోషి చేత బసంత్ బహార్ సినిమాలో ‘కేతకి గులాబ్ జూహి చంపక్ బన్ ఫూలే’ అనే పాటను మన్నా దే తో కలిపి శంకర్ జైకిషన్ పాడించారు. బూట్ పాలిష్ చిత్రంలో లతా మంగేష్కర్ చేత ఒక్క పాటను కూడా పాడించలేదు. ఆమె స్థానంలో ఆశా భోస్లే పాడింది. శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చిన ఒకేఒక పౌరాణిక సినిమా ‘కృష్ణ కృష్ణ’. అందాజ్ చిత్రంలో ‘జిందగీ ఏక్ సఫర్ హై సుహానా ‘పాటను మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ఆశా భోస్లే ల చేత విడివిడిగా పాడించడం విశేషం. శంకర్ హైదరాబాదీ కావడంతో రాజ్ కపూర్ చిత్రం ‘శ్రీ 420’లో ‘రామయ్యా వస్తావయ్యా’ అనే తెలుగు మాటలు పల్లవిలో జొప్పించి తెలుగు భాష మీద తన మక్కువను వ్యక్తపరచారు. శంకర్ జైకిషన్ లకు నివాళులు అర్పిద్దాం.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap