ఉర్దూ కవితా సాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ గజల్. 10 వ శతాబ్దంలో ఇరాన్ లో ఆవిర్భవించి భారతదేశానికి దిగుమతి అయిందని చెబుతారు.
సాధారణంగా స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికి, ప్రణయ, భగ్నప్రణయ భావాలను ఆవిష్కరించటానికి గజల్ ను వాడేవారు.
మన సినారె, దాశరథి గారు తెలుగులోకి ఇంచుమించు గజల్ సంప్రదాయాన్ని వాళ్ల కవితా రూపాల్లో పరిచయం చేశారు. కేవలం – రొమాంటిక్ – మెలంఖలీ- రసాలతో
మెదిలే గజల్ ని సమాజశ్రేయస్సుకు ఉపయుక్తమయ్యే కవితా వస్తువులను కూడా ఉపయోగించి మంచి ఫలితాలను రాబట్టారు. సినిమాలలో కూడా కొన్ని సందర్భాల్లో వారు ఈ ప్రక్రియ ఉపయోగించారు.
సౌభాగ్యవతి శ్యామల కూడా ఆలోచింపజేసే కవితా వస్తు ప్రయోగం చేశారు తన సరికొత్త గజళ్ల ద్వారా. అక్షరప్రజ్ఞ, ఒకించుక సంగీత స్పృహ ఉండడం గజల్ రాయడానికి ముఖ్యాంశాలు. అవి శ్యామలకు బాగా ఉపయుక్తమయ్యాయి. చదువుతున్నప్పుడు నా వెన్ను చరిచి ఒకసారి ఒళ్లు దగ్గర పెట్టుకు మరీ చదివించిన కొన్ని పంక్తులు….
‘ఎండలోన నిలిచి అలా నీడ నెందుకిస్తుందో
విప్పారిన పూలకళ్ల వృక్షాన్ని చదవాలి’
‘చదువంటే అ ఆ లు గుణింతాలు కావు శ్యామా
మరణించినా బతికే ఆ ధర్మాన్ని చదవాలి’
‘లక్షలు వెనకేస్తే చాలా? లక్ష్యం లేనపుడు
ఒకరికి నీడవ్వని బతుకది బతుకనుకోను’
‘చుట్టూ చీకటి ఉందా? నిజమే కాదనను
ఒంటరినైతే ఏమిటి, మిణుగురులా వెలగాలి’
ఇలాగని, కేవలం స్లోగన్లకే పరిమితం కాలేదు శ్యామల గజల్ ప్రక్రియ – గజల్ వెన్నెముకైన ప్రణయాగ్రత, ప్రకృతి పరిమళం, మట్టి సొబగు అన్నీ ప్రసరించాయి ఆవిడ కలం నుంచి. కాస్త చవి చూపిస్తాను.
“పొంగుతున్న ఊహలను కొంగున కట్టెయ్యలేను
మించుతున్న ఆశలను దోసిట పట్టెయ్యలేను
‘అక్షరాల పూలమొగ్గలు కోసుకొచ్చా ఇప్పుడే
తీపి తీపి పదాలెన్నో ఏరుకొచ్చా ఇప్పుడే
ఏ కవితా ప్రక్రియకైనా కాగితం మీద మనసుకు తోచిన, కలానికొచ్చిన భావాలను గుప్పించడం కాదు లక్షణం, ఆలోచింపజేసి అవలంబింపచేసే ప్రేరణ కలిగించడమే అన్న ఆశయంతో సాగిన యీ గజళ్ల రచన గాయనీ గాయకుల గళం నుంచి వెలువడ్డప్పుడు ఇంకా ఫలవంతమౌతుంది. “గజల్ ” అనగానే….. సహజంగానే అందులో అత్తరువాసన, మాండలీన్ ధ్వనీ లీలగా అనిపిస్తాయ్! కానీ ‘శ్యామంతిక’లలో వాటితో పాటుగా పారిజాతాల పరిమళం…. కన్నీటి కాటువాసన…. మట్టిరంగూ వగైరాలు కూడా పుష్కలంగానే వున్నాయి. జీవితంలోని సమస్త పార్శ్వాలనీ సమర్థవంతంగా స్పృశిస్తూ, సొగసుగానే కాకుండా….. నాజూగ్గా కూడా అల్లిన గజళ్ళు ఇవి. తన అనుభూతుల కుంచె తో ప్రతీ పేజీలోనూ గీసిన భావగర్భితమైన బొమ్మలు ఈ పుస్తకానికి మరింత సొగసు తెచ్చాయి. ఇంత మంచి పుస్తకాన్ని పాటకులకందించిన శ్యామల గారు అభినందనీయులు.
-యస్.పి. బాలు