
రెండు సున్నాల మధ్య ఒక నిలువుగీత. ఇది వడ్డాది పాపయ్య గారి సంతకం. దీని అర్ధం ఏమిటని అడగ్గా , ” ముందు సున్నా, వెనక సున్నా, మధ్య నేనున్నా” అని సమాధానం ఇచ్చారు. కొంచెం అర్ధమయ్యేలా చెప్పండి అంటే, నిన్న గురించి మరిచిపో, రేపు గురించి ఆలోచించకు, నేడు అంతా నీదే, నిముషం వృధా చెయ్యకు, అన్నారు ఆ మహాచిత్రకారుడు.
సంతకాలలో సందేశాలుంటాయని కొందరు కళాకారులు , చిత్రకారులు , ముఖ్యంగా కార్టూనిస్టులు ఎప్పట్నుంచో చెబుతూ వస్తున్నారు.’ స్వాతి ‘పత్రిక లో బొమ్మలు గీసి పాఠకులను మెప్పించిన ” జె…” గారినడిగాను, ‘జె ‘ అక్షరం పక్కన, ఆ మూడు చుక్కల గురించి. తన భార్య, కూతురు, కొడుకు, అన్నారు. తను గీసే బొమ్మలు, ఆ ముగ్గురి కోసమే కదా, అందుకే ఆ మూడు చుక్కలు అని నవ్వి , పనిలో నిమగ్నమై పోయారు. వీణ బాలచందర్ గురించి తెలియనివాళ్ళెవ్వరు. ఆయన సంతకం లో వీణ కనిపిస్తుంది. మన సి. నారాయణ రెడ్డి గారి కలం పేరు ‘సినారె’, అంటే, సినిమా సీనరీ పాటల రచయిత అని క్లుప్తంగా చెప్పుకున్నారు. వారి సంతకం లో, ఆకు, కాయ, తీగ కనిపిస్తాయి. పాటకి రాగం, తాళం, పల్లవీ ల లాగా!
కుంచె పేరు:
మన కార్టూనిస్టుల సంతకాల మాట కొస్తే, చాలామందివి కలం పేర్లే. వాటినే, “కుంచె” పేర్లు అంటాం.
మొట్టమొదటి తెలుగు కార్టూనిస్టు తలిసెట్టి రామారావు గారు తనకి కుంచె పేరు పెట్టుకోలేదు. బొమ్మలు గీసి పూర్తి సంతకం జోడించారు. వారి తర్వాత తెలుగు బొమ్మల జగత్తులో స్వైర విహారం చేసిన సత్తిరాజు లక్ష్మినారాయణ గారు తమ ముద్దుపేరు నే, కుంచెపేరు, “బాపు” గ పాఠకలోకానికి పరిచయం చేసుకున్నారు. బొమ్మకి ప్రతిరూపం, బాపు, అనే ఆ రెండక్షరాల సంతకం, గుండె ఊయలలూపించింది. బాపూ గారి రేఖా విన్యాసాల ప్రస్ధానంతో పాటు ఆ సంతకం పలు రూపాంతరాలు చెంది, ఆఖరికి రెండు గీతల ముక్కగా మిగిలింది. ఈ ముక్కలో మీ పేరు కనిపించడం లేదే అనడిగితే, నా బొమ్మల్లో కనిపించడం లేదా అని చిద్విలాసంగ నవ్వారు బాపు. అర్ధమైపోయింది. ఆయన బొమ్మల్ని అనుకరించేవాళ్ళు, ఆయన గారి సంతకాన్ని కూడా ప్రేమగా తమ సంతకాల్లో దాచుకున్నారు, అందు చేత బాపు తమ సంతకాన్ని అలా బుల్లి ముక్కలు చేసారేమో అనిపిస్తుంది.
తెలుగు కార్టూనిస్టుల సంతకాల రకాలు, గల గల రంగుల గాజుల వైవిధ్యాలూలా, లెక్కలేనన్నివున్నాయి. ప్రస్తుతం ఇంగ్లీషు సంతకంతో కొనసాగుతున్న నేను, తొలిదశలో తెలుగు సంతకం తోనే కార్టూన్లు ప్రారంభించాను. నా సమకాలీకులు బాబు, చంద్ర, మోహన్, బాలీ, శంకూ, రామక్రిష్న , గోపీ, ఏవీఎం, మల్లిక్, సుధామ, శంకర్, శ్రీధర్, వర్చస్వీ, సుభానీ, నర్సిం, సురేంద్ర, రాజు, విజయ్, నాగిశెట్టి, రవి ప్రసాద్, ఇంకా అనేకులు తెలుగూ, ఇంగ్లీషు సంతకాలతో ఇంటా బైటా, రచ్చలు గెలిచి పేర్లు సంపాదించుకున్న తెలుగు వెలుగులు.

ఇంగ్లీషు సంతకంతో మాత్రమే తరచూ కనిపించే కార్టూనిస్టులు క్రిష్ణ, మోహన్ కుమార్, అరుణ్, బన్ను, ఆనంద్, బాపు (kaladhar Bapu), జె.ఎస్ఆ.ర్ లు.
ఇంగ్లీషు, తెలుగు కలిపి సంతకం చేసే వాళ్ళలో, విజయ్ పురం ది ప్రత్యేక బాణీ.
కేవలం, తెలుగు సంతకంతోనే స్ధిరపడిన వాళ్ళని, వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చునేమో. ఆ తెగలో, బాచి, శ్రీధర ఎప్పటికీ మరిచిపోలేం. వీరిద్దరి తెలుగు భాషాభిమానం కొనియాడదగ్గది. తెలుగులో ఇంగ్లీషు అక్షరాల సంతకదార్లూ వున్నారు. టీవీ, బీవీఎస్, వెంటనే గుర్తొస్తారు.
ఇంటిపేర్లతో :
సరే, సంతకాల వైవిధ్యాలు ఎలావున్నాయో చూద్దాం. ఉదాహరణకి… ఇంటిపేర్లు – కాటూరి, గోలి, అత్తలూరి, కోలపల్లి, రావెళ్ళ, నూతి, వెంటపల్లి, పూతేటి, పుక్కళ్ళ, పిస్క ఇనిషీయల్స్ తో పేర్లు- T.R. బాబు, కె సీ లలిత, ఎమ్మై కిషన్, ఎన్. ధీరజ, పూర్తిపేర్లు – రామక్రిష్న, మృత్యుంజయ్, ఆకుండి సాయిరాం, సీతారామప్రసాద్, రాగతి పండరి, పద్మ, వాగ్దేవి,పైడి శ్రీనివాస్, గుత్తుల శ్రీనివాసరావు, వడ్డేపల్లి వెంకటేష్, గోపి బూరుగు, భూపతి తునికి, చిన్నన్న కెంచు, రమ నెల్లుట్ల, సగం పేర్లు -జయదేవ్, సాంబు, శేఖర్, గుప్త, హరి, జయ, కాశ్యప్, మాధవ్, పేరు కాని పేర్లు – రుక్మిణి, జంట పేర్లు – మురళి రమణ, వింత పేర్లు- టింగు, విన్నూత్నమైన పేర్లు – సరసి, బొమ్మన్, పెట్టిన పేర్లు- బాలి, శంకు, పెట్టుకున్న పేర్లు – న్యూటన్, మాంటిక్రిస్టో, తన్నీరు, ఓనావా, దొరశ్రీ పొట్టి పేర్లు – రాంపా, ఉలి, జెన్నా, కుచి, క్రివ్, మూవీ, జేశ్రీ, చప్ర, దాస్, వేణు, ప్రింట్ పేర్లు – ఆనంద్, అక్షర పేర్లు- వి వి వి, బీ వీ ఎస్, టీ. వీ., ఏకాక్షర పేర్లు- K, శ్రీ, సింబల్ పేర్లు – కన్నాజి రావ్ ,….ఇలా ఎన్నో, ఎన్నెన్నో.
కార్టూనిస్టు స్వతహాగా కొంటెబొమ్మల మేధావి. తన సంతకంలో తనగురించి ఏదో చెప్పాలనుకుంటాడు. ఈ విషయంలో నేను గ్రాఫాలజీ గురించి ప్రస్తావించను గానీ, కార్టూనిస్టు తన వ్యక్తిత్వాన్ని మాత్రం స్ఫష్ఠం గా స్ఫురించే ప్రయత్నం చేసి చూపిస్తాడు. సంతకం చూస్తే ఫలానా ఇతడు కార్టునిస్టు అని రుజువవ్వాలి. అంతే కాదు, సంతకం చూస్తే పాఠకుడికి కార్టూనిస్టు సత్తా కూడా తెలియాలి. కార్టూనూ, వ్యాఖ్యా (దస్తూరి) ,రెంటినీ కలిపి చూస్తే అది ఎవరి రచనో, రౌతును బట్టి గుర్రం లా తేలిపోవాల్సిందే. ఇది సాధించి చూపించారు పూజ్య బాపూ గారు.నిజానికి ఆయన సంతకమే అక్కర్లేని ఏకైక తెలుగు కార్టూనిస్టు!
లవ్ సింబల్:
బాపూ ఎత్తుకు ఎదగడం దుస్సాధ్యం. అయితే, వేరే ఎదైనా ప్రయోగాలు చేయాలనిపించి, సంతకంతో “లవ్” సింబల్ జోడించాలని నేనూ, బాబూ, శంకూ, విడివిడిగా, దాదాపు ఏక కాలంలో నిర్ణయించుకున్నాము. ఒకవిధంగా మాకు స్ఫూర్తిదాయకులు కాటూరి గారు. ‘క’ అక్షర దీర్ఘానికి ‘జ్యోతి’ తిలకం దిద్దారు. ఆయన సంతకం ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుంది. లవ్ సింబల్ తో మిత్రులు, రామక్రిష్ణ, వర్చస్వీ, శేఖర్, మృత్యుంజయ్, పుక్కళ్ళ, గోపాలకృష్ణ, సంబంగి, కృష్ణ, నియంత లు మాతో జతకట్టారు. “లవ్ ” సింబల్ తో పాఠకులనాకర్షించి వారి మనసులో తిష్ట్ఠ వేసుకోవాలన్నదే, మా ధ్యేయం.
గీత, చుక్కలు:
సంతకం కింద గీత గీసి చుక్కలు పెట్టే కార్టూనిస్టులు చాలామందే వున్నారు. ఆ గీతా-చుక్కల వెరైటీని పరిశీలిస్తే, ఎవరి స్టయిలు వాళ్ళది అని చెప్పాల్సిందే. బాచీ, లేపాక్షి, సాయిరాం ఆకుండి, భూపతి, నూతి, జగన్నాధ్, గాలిసెట్టి, శర్మ, గాంధీ, పూతేటి , రామశేషు, M. రాము, గిరి, షేక్ సుభాని, ఉలి, అంబాటి చంటిబాబు, హరి వెంకట్, ప్రసాద్ బుంగ లది ఒక కేటగరీ.
కందికట్ల, గీత పక్కన చుక్కలకి బదులు రెండు బుల్లి గీతలు, ప్రభాకర్ గీతకింద పువ్వు, రవి శర్మ ముగ్గు గీత, శ్రీధర – రకారంతో కుంచె ఇలా రకరకాలుగా సంతకాలు చేస్తారు. శ్రీధర లాగానే వినోద్, నాగిసెట్టి, నిరంజన్ సంతకాలలో కుంచె కనిపిస్తుంది. వీళ్ళది మరో కేటగరీ. చక్రవర్తి, అన్వైండ్, రీవైండ్, స్టార్! హరగోపాల్ గీత గీయడు చుక్కలు మాత్రం పెడతాడు, నాథ్ కూడా. వేముల, గీత, చుక్కలతో పాటు ఒక పువ్వు అలంకరణ కూడా చేస్తాడు. రావెళ్ళ ది, రంగరాజు దీ, రెండు పువ్వులు, పేరు కిరువైపులా.
ఇమోజీలు:
సంతకంలో, కళ్ళూ, నవ్వు నోరూ, ఇమోజీ లని సమ్యుక్తం చేసి ప్రత్యేకత చాటుకున్న, సాయిరాం, సరసి, నాగ్రాజ్, అర్జున్, రామశేషు, వర్మ, కమల్, లాల్, సునీల, అత్తలూరి, ప్రేమ, అరవింద్, రవిప్రసాద్ లది మరో స్పెషల్ గ్రూపు.
విడి అక్షరాల సంతకాల ప్రముఖులు, కళాసాగర్, పెండేల, రామారావు , కలిమిశ్రీ, కామేష్, ఈడూరి, పైడి శ్రీనివాస్, జాకీర్, కిరణ్, ప్రసిద్ధ ….. ఇంకా చాలామంది. వీళ్ళల్లో ప్రసాద్ కాజా, పేరులో చిన్న మలుపు పెట్టాడు. క్రివ్ పేరులో బాణం. బ్నిం సంతకం లో కుర్చీ కనిపిస్తుంది, రెండు చుక్కలూ ఉన్నాయి, ఒక చుక్క రాతా, మరో చుక్క గీత కామోసు.. ఇది బ్నిం ప్రత్యేకం. రామప్రసాద్ ది గీత, చుక్కలు, ఇమోజీ లు కలిపిన సంతకం!
ఇక హరిక్రిష్ణ, నెమలి పింఛం! సాయిక్రిష్ణ పిల్లన గ్రోవిల తో సాక్షాత్కరిస్తారు.
లోకో భిన్న రుచి లా, కార్టూనిస్టులూ భిన్న భిన్న రుచుల నవ్వుల విందులు వడ్డించేవాళ్ళే కదా. ఇందుకు వాళ్ళ సంతకాలే సాక్షి!
ఇన్ని వైశిష్ఠ్యాలతో కూడుకుని మన తెలుగు కార్టూనిస్టులు శోభిల్లుతున్నారంటే, అందుకు కారకులు హాస్య రసికులైన మన తెలుగు పత్రికా సంపాదకులు, మన అశేష తెలుగు పాఠకులూ !! అందరికీ నా జోహార్లు.
తెలుగు కార్టూన్ వర్ధిల్లు గాక.
–డా. జయదేవ్
(ఈ వ్యాసం రాయమని ప్రేరేపించింది, కార్టూనిస్టు మిత్రుడు శ్రీధర (నెల్లూరు), వారికి ధన్యవాదాలు. వ్యాసం రాసే సమయానికి, నా మదిలో మెదిలిన కార్టూనిస్టు మిత్రుల పేర్లు మాత్రమే పేర్కొనగలిగాను. తక్కిన మిత్ర్రులు మన్నించగలరని ఆశిస్తాను. సంతకాలు సేకరించి ఈ వ్యాసానికి సొగసు గూర్చిన కార్టూనిస్టు మిత్రుడు కళాసాగర్ కి ప్రత్యేక కృతజ్ణతలు. )
Nice and very special article sir .Thanks to Dr Jayadev sir for giving such an intresting article on our telugu cartoonists
Really fantastic findings by Jayadev garu.. All our cartoonist friends must feel proud for it.. Thank you Kalasagar garu..
If cartoon is. a coin,this side Bapu mark the other Jayadev spark !These sides breeded cartoonists in Telugu Cartoonists herd! and the art of cartooning shining and shining ! Sri Jayadev always shows an innovative way in all ways!And this signature nature is one such!డాక్టర్ జయదేవ బాబు గారికి నెల్లూరు శ్రీధర్ గారికీ 64 కళల ఫలాలు పoచుకున్న కళాసాగర్ గారికీ కార్టూనిస్టు మిత్రావళికీ వoదనాలచoదనాలు హాస్యానoదoగా !రాoపా
రాంపా గారిది ప్రత్యేక సంతకం. వారి రచనా శైలీ, వ్యంగ్యం, హాస్యం, కూడా అదే ప్రత్యేకతలతో కూడుకొన్నవే.
నా వ్యాసం మీది స్పందనకు, రాంపా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నామీద వారు చూపే అనురాగానికి సర్వదా క్రుతజ్నుడిని.
బ్నిం (బి ఎన్ మూర్తి), శేషు, కాటూరి వేంకటేశ్వర రావు, ఎం ఐ కిషన్, ఎమ్వీ ఆర్, శ్రీవల్లి, వేణు, భగవాన్, శ్యాం మోహన్, శంకర్ సాగర్ తదితరుల సంతకాలు కూడా సేకరించండి