
మధుసూదన్ మామిడి గారు అందిస్తున్న సక్సెస్స్ స్టోరీలు వారం-వారం మీ కోసం…
కాకినాడలో పుట్టి, హైదరాబాదు లో ఎన్నో సంగీత కచేరీలు చేసి, టెలివిజన్, రేడియో రంగాలలో పలు కార్యక్రమాలు నిర్వహించి, ప్రస్తుతము భర్తతో అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో వుంటూ, తెలుగు సినిమా పాటలు, లలిత గీతాల గాయనిగా, రేడియో జాకీగా, పలు సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, అక్కడ జరుగుతున్న వందలాది తెలుగు కార్యక్రమాలకు వాఖ్యాతగా రాణిస్తూ, పలు పురస్కారాలు పొందుతుంది శ్రీమతి ఆకునూరి శారద. ఆమె జీవిత ప్రయాణం ఈరోజు మీకోసం.
శారద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా కేంద్రంలో రమాదేవి – మృత్యుంజయ రావు దంపతుల సంతానంగా జన్మించింది. శారదకు ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు వున్నారు. శారద చదువంతా బాపట్లలో, తిరుపతిలో సాగింది.
శారద మూడేళ్ళ వయసులోనే సంగీతంపై ఆసక్తి కలిగింది. ఆమె ఆసక్తిని గమనించి, తల్లిదండ్రులు ప్రోత్సహించారు. విద్యార్థి దశ నుండే పాటల పాల్గొన్నది, రాష్ట్రస్థాయిలో బహుమతులు గెలుచుకున్నది. చదువుల్లోనే కాకుండా వ్యాసరచనలలో, నృత్యంలో కూడా బహుమతులు గెలుచుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. హైదారాబాద్ లో ఎన్నో సంగీత కచేరీలు చేసింది.
టివీ రంగంతో అనుబంధం:
హైదారాబాద్, దూరదర్శన్ లో కొంతకాలం వ్యాఖ్యాతగా పనిచేసింది.. శారద ఏఎంఎస్ కాలేజీలో కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆపరేటర్ గా పనిచేస్తూనే, లోకల్ సిటి కేబుల్ లో ఉద్యోగవార్తలు, న్యూస్ రీడర్, గేమ్ షో హోస్ట్ గా, యాంకర్ గా పనిచేసింది. ఈటీవీ లో సరిమగలు, జెమిని టీవీలో నవరాగం వంటి టివీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దూరదర్శన్ లో టెలి స్కూలు కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలుతో పాటు ఎంతో మంది తెలుగు సినీ నటులు, సంగీత దర్శకులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించింది.
రేడియో రంగంతో అనుభందం:
ఆలిండియా రేడియో యువవాణి లో ఎన్నో ‘లలిత గీతాలు’ పాడింది. కొన్ని ‘రేడియో నాటికలలో’ పాల్గొని తన స్వరం వినిపించింది.
అమెరికాలో శారద ఘనతలు:
1997లో అమెరికా దేశంలోని హ్యూస్టన్ నగరంలో పనిచేసే శ్రీనివాస్ తో వివాహం జరిగి, హైదారాబాద్ నుండి భర్తతో అమెరికాకు వెళ్లింది.
🔹హ్యూస్టన్ నగరంలో తెలుగు కల్చరల్ అసోసియేషన్ చేరారు, ఆ తరువాత దానికి రెండుసార్లు అధ్యక్షురాలిగా పనిచేసారు.
🔹హ్యూస్టన్ లో ‘తెలుగు రేడియో జాకిగా’ శ్రోతలను అలనాటి ఆపాతమధురాలతో పాటు, పొడుపు కథలు, పద్యాలు వినిపించింది.
🔹హ్యూస్టన్ లో తెలుగు సంస్కృతికి అద్దం పట్టే సంక్రాంతి, ఉగాది పండుగలతో పాటు, వాగ్గేయకారోత్సవం, సిద్ధేంద్రయోగి జయంతోత్సవం, వనభోజనాలు వంటి కార్యక్రమాలు రూపొందించింది.
🔹అమెరికాలో జరిగిన సంగీత విభావరిలో నేపథ్య గాయకులు సుశీల, జమునా రాణి, రామకృష్ణ, మనో, శ్రీకృష్ణ మల్లికార్జున్, హేమచంద్ర మొదలగు వారితో కలిసి పాడింది.
🔹హ్యూస్టన్ నగరంలోని తెలుగు భవన్ కు “బోర్డ్ ఆఫ్ డైరెక్టర్” గా సేవలు అందిస్తున్నది.
🔹అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా వుంటూ ఎ.ఎన్.ఆర్. సంబందించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
🔹అమెరికాలోని 25 నగరాలలో జరిగిన ఘంటసాల ఆరాధనోత్సవాలు, బాలు సంగీతోత్సవాలు లో ప్రధాన గాయనిగా పాల్గొని, ఆ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చేసింది.

పుస్తక ప్రచురణలు:
“నేల మీది జాబిలి నింగిలోని సిరిమల్లె” పేరుతో అక్కినేని శతగీతలహరి పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది. దీనిపై వచ్చే ఆదాయాన్ని వృద్ధ కళాకారులకు అందేలా చేసింది.
సంగీత దర్శకులు కె.వి. మహదేవన్ శత జయంతి సందర్భంగా *సరిలేరు నీకెవ్వరు – మహదేవన్ ఆణిముత్యాలు పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకంపై వచ్చిన ఆదాయాన్ని ‘వికలాంగుల ఫౌండేషన్’ కు వికలాంగులకు సహాయార్థం ఇచ్చింది.
పురస్కారాలు:
🔹అమెరికాలోని తెలుగు టైమ్స్ పత్రిక వారిచే తొమ్మిది మంది ప్రముఖులలో ఒకరిగా గుర్తించబడింది.
🔹తానా కమ్యూనిటి సర్వీసెస్ పురస్కారాన్ని అక్కినేని గారి చేతుల మీదుగా అందుకుంది.
వంశీ గారిచే ఉగాది పురస్కారం పొందింది.
🔹చెన్నైలో ఆంధ్రా కల్చరల్ క్లబ్ వారి పురస్కారాన్ని కె.విశ్వనాథ్ గారి చేతుల మీదుగా అందుకుంది.
🔹వేగేశ్న ఫౌండేషన్ వారి నుండి గానరత్న అవార్డు.
🔹వాస్తవం మీడియా నుండి అమెరికా గాన కోకిల అవార్డు.
🔹హైదారాబాద్ లోని ప్రాగ్నిక ఫౌండేషన్ వారి నుండి గంధర్వ రస వర్షిణి బిరుదు.
మొదలగునవి.
ఇది హైదారాబాద్ లోనే కాకుండా, అమెరికా దేశంలో కూడా గాయనిగా, రేడియో జాకీగా, వ్యాఖ్యాతగా పలు సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తి కలిగిస్తున్న శ్రీమతి ఆకునూరి శారద గారి విజయగాథ.
–మధుసూదన్ మామిడి
కరీంనగర్ (సెల్ నం. 8309709642)