మాంగ్ కే సాథ్ తుమ్హారా..

(దివికేగిన ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే సంస్మరణ వ్యాసం)

“ఆగే భీ జానే న తూ, పీచే భీ జానే న తూ, జో భీ హై, బస్ యహి ఏక్ పల్ హై” (వఖ్త్), “ఆవో హుజూర్ తుమ్ కో సితారోం మే లే చలో, దిల్ జూమ్ జాయే అయిసే బహారోం మే లే చలో” (కిస్మత్), “ఏ హై రేషమీ జుల్ఫోం కా అంధేరా న ఘబరాయియే, జహాఁ తక్ మెహక్ హై మేరే గేసువోం కీ” (మేరే సనమ్), “దమ్ మారో దమ్, మిఠ్ జాయే గమ్ బోలో శుభ్ షామ్ హరే కృష్ణ హరే రామ్” (హరే కృష్ణ హరే రామ్), “సీషే సే పీ యా పైమానే సే పీ, యా మేరీ ఆంఖోం కే మైఖానేసే సే పీ” (ఫూల్ అవుర్ పత్తర్), “ఏ మేరా దిల్ యార్ కా దీవానా , దీవానా దీవానా ప్యార్ కా పర్వానా” (డాన్), “ఝుమ్కా గిరా రే బరేలీ కే బాజార్ మే” (మేరా సాయా), “పరదే మే రహనే దో పరదా నా వుఠావో, పరదా జో వుఠ్ గయాతో భేద్ ఖుల్ జాయేగా” (షికార్), “ఓ మేరె సోనా రే సోనా రే సోనా రే, దే దూంగి జాన్ జుదా మత్ హోనా రే” (తీస్రీ మంజిల్), “షోక్ నజర్ కి బిజలియాన్, దిల్ పే మేరే గిరాయే జా” (ఓ కౌన్ థీ)…. ఈ పాటలు విన్నవారికి, వింటున్నవారికి, ఆ గొంతు యెవరిదో యిట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే, ఆ గొంతు యెంతో వినూత్నమైనది, విస్పష్టమైనది కూడా. మాధుర్యంతోబాటు మంచి విరుపులతో సంగీత అభిమానులను విశేషంగా ఆకర్షించే ఆ గళం హిందీ నేపథ్య గాయని ఆశా భోస్లే ది. బాలీవుడ్ సినీ చరిత్రలో ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పిన గాయనిగా, అటు భారతరత్న లతా మంగేష్కర్ సోదరిగా పేరు గడించిన ఆశాభోస్లే ఈరోజు (11-04-2026) ఉదయం ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె సంస్మరణార్థం ఆశా జీవన గమనంలో కొన్ని విశేషాలుమీకోసం.

బాధించిన బాల్యం: ఆశా భోస్లే జన్మించింది మహారాష్ట్ర లోని సాంగ్లి పట్టణంలో. తండ్రి దీనానాధ్ మంగేష్కర్ గొప్ప శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. మంచి రంగస్థల నటుడు కూడా. తల్లి శేవంతి గృహిణి. దీనానాధ్ కు నలుగురు సంతానం. లతా మంగేష్కర్, మీనా మంగేష్కర్ ఆశా కు అక్కలు కాగా, హృదయనాథ్ మంగేష్కర్ తమ్ముడు. అందరితోబాటు ఆశా కూడా చిన్నతనం నుంచే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది. నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా వేస్తుండేది. తనకు తొమ్మిదేళ్ళ వయసున్నప్పుడు తండ్రి కాలం చెయ్యడంతో, ఇల్లు గడవడం కష్టమై అక్కలతోబాటు రంగస్థల నాటకాల్లో పాత్రలు వెయ్యడం, పాటలు పాడడం వృత్తిగా ఎంచుకోవలసి వచ్చింది. వారికి సంరక్షకుడిగా ఉంటున్న మాస్టర్ వినాయక్ సలహా మేరకు వారి మకాం బొంబాయికి మారింది. ఆశా కు పదేళ్ళ వయసులోనే ఒక మరాఠీ సినిమాకు పాడే అవకాశం వచ్చింది. ‘మజ బల్’ అనే చిత్రంలో దత్తా దవజేకర్ సంగీత దర్శకత్వంలో ఆమె “చలా చలా నవ బాలా” అనే పాట పాడింది. హిందీ చిత్ర సీమకు ఆశా పరిచయమైన చిత్రం ‘చునరియా’ (1948). హన్స్ రాజ్ బెహల్ సంగీత దర్శకత్వంలో గీతా దత్, జోహరాబాయి తో కలిసి “సావన్ అయారే” అనే పాటను ఆశా తొలిసారి పాడింది. అప్పటికే అక్క లతా
మంగేష్కర్ మంచి గాయనిగా పేరుతెచ్చుకోవడంతో మంగేష్కర్ కుటుంబం ఆర్ధికంగా నిలదొక్కుకుంది. అప్పట్లో గణపతిరావు భోస్లే అనే వ్యక్తి లతా మంగేష్కర్ కు వ్యక్తిగత కార్యదర్శిగా ఉండేవాడు. పదహారేళ్ళ తెలియని వయసులో వున్న ఆశాను ముప్పై ఏళ్ళ గణపతిరావు ఉచ్చులోకి దించి ఆమెతో ఉడాయించాడు. అక్క లతామంగేష్కర్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది. దాంతో మంగేష్కర్ కుటుంబానికి ఆశా దూరమయ్యింది. ఆశాకు హిందీ సినిమాల్లో గాయనిగా అవకాశాలు రాసాగాయి. కాలం గడుస్తుండగానే ఆమెకు హేమంత్, వర్ష అనే ఇద్దరు పిల్లలు కలిగారు. భర్త డబ్బు మనిషి. ఎక్కువ డబ్బు సంపాదించమని ఆశాపై ఒత్తిడి తెచ్చేవాడు. మూడవ సంతానం ఆనంద్ గర్భంలో వుండగా గణపతిరావు భోస్లే, ఆశాను ఇంటినుంచి గెంటివేశాడు. తెగిన గాలిపటంలా ఆశా పిల్లలతో పుట్టింటికి చేరింది. పెద్దమనసుతో లతాజీ ఆమెను అక్కున చేర్చుకుంది.

గాయనిగా సుస్థిర స్థానంలో… ఆశాకు అక్క లతాజీ ఆశీస్సులతో బాటు, ప్రత్యేక శైలి కలిగిన మధుర కంఠం ఉండడంతో సినిమాల్లో మంచి అవకాశాలు రాసాగాయి. యాభై దశకంలో అగ్రశ్రేణి గాయనీ మణులు గీతా దత్, శంషాద్ బేగం పాడని పాటలు ఆశాకు వరంగా మారి, ఆ పాటలు ఆశాకు దక్కాయి. అయితే ఆమె గాయనిగా నిలదొక్కుకుంటున్న రోజుల్లో వ్యాంప్ లకు, క్యాబరే డ్యాన్సర్లకు ఆశాజీ పాటలు పాడేది. ఆమెకు 1956లో వచ్చిన ‘CID’ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అందులో సంగీత దర్శకుడు ఒ.పి. నయ్యర్ “లేకే పెహలా పెహలా ప్యార్” అనే పాటను మహమ్మద్ రఫీ, షంషాద్ బేగమ్ తోబాటు ఆశా భోస్లే చేత పాడించారు. 1957లో దిలీప్ కుమార్, వైజయంతిమాల నటించిన బి.ఆర్. చోప్రా సినిమా ‘నయా దౌర్’ లో ఒ.పి. నయ్యర్ హీరోయిన్ పాటలన్నీ ఆశా భోస్లే చేత పాడించారు. “ఏక్ దివానా ఆతే జాతే హమ్ సే ఛేడ్ కరే” సోలో పాటతోబాటు రఫీ తో ఆలపించిన “సాథీ హాథ్ బడానా, ఏక్ అకేలా ఠక్ జాయేగా మిల్ కర్ బోఝ్ వుఠానా”, “మాంగ్ కే సాథ్ తుమ్హారా మైనే మాంగ్ లియా సంసార్”, “హో ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ” పాటలు ఆశాజీ కి మంచి పేరుతెచ్చి పెట్టాయి. ఒ.పి. నయ్యర్ సంగీత దర్శకత్వంలో ఆశా భోస్లే కు హిట్ల తరవాత హిట్లు ఎన్నో వచ్చాయి. హౌరా బ్రిడ్జి (1958) లో “ఆయ్ మెహరబాన్ బైటియే జాన్-ఎ-జాన్”, కాశ్మీర్ కి కలి (1964) లో “దీవాన హువా బాదల్, సావన్ కి ఘటా ఛాయీ”, “ఇషారోం ఇషారోం మే దిల్ లేనే వాలే”, “బాలమా ఖులీ హవా మే మహ్ కి హుయీ ఫిజా మే”, కిస్మత్ లో “ఆవో హుజూర్ తుమ్ కో సితారోం మే లే చలో” వంటి అద్భుతమైన పాటలు లతాజీని కాదని ఆశా భోస్లే చేత నయ్యర్ పాడించి మురిపించాడు. నయ్యర్ తో ఆశా పాడిన చివరి సినిమా 1974 లో వచ్చిన ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే. అందులో నయ్యర్ ఆశా చేత l“చైన్ సే హమ్ కో కభీ అపనే జీనే నా దియా” సోలో తోబాటు మరో ఐదు పాటలు lపాడించారు. అవికూడా అద్భుతమైన హిట్లు గా నిలిచాయి.

బర్మన్ లతో బంధం… సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ ఆశా లోని అద్భుత టాలెంట్ ను గుర్తించారు. ఆమెకు మంచి అవకాశాలు కలిపించారు. 1958లో వచ్చిన కాలా పాని సినిమాలో “నజర్ లగీ రాజా తోరే బంగళే పర్”, “ దిల్ లగాకే కదర్ గయే ప్యారే”, “జబ్ నామ్-ఎ-మోహబ్బత్ లేకే కిసీ” వంటి సోలో పాటలు, రఫీ తో కొన్ని డ్యూయట్లు పాడించి విజయవంతం చేశారు. ఈ సినిమాలో లతాజీ ఒక్క పాట కూడా పాడకపోవడం విశేషం. 1959 లో వచ్చిన సుజాత సినిమాలో “కాళీ ఘటా చాయే”, “తుమ్ జియో హజారో సాల్” వంటి సోలో పాటలు పాడించి హిట్ చేశారు. అలాగే కాలా బజార్ (1960)లో బర్మన్ దాదా ఆశా చేత “సచ్ హుయే సపనే తేరే ఝూమ్ లే మో మన్ మేరె”, “సంభాలో అపనా దిల్ దీవాలో” అనే రెండు సోలో పాటలు, మన్నాడే తో ఒక డ్యూయట్ పాడించారు. ఇవి కాకుండా బర్మన్ దాదా జాగ్ ఉఠా ఇన్సాన్, తీన్ దేవియా వంటి సినిమాల్లో ఆశా చేత మంచి పాటలు పాడించి ఆమెను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అరవయ్యో దశకం మధ్యలో సచిన్ తనయుడు రాహుల్ దేవ్ బర్మన్ ఆశా భోస్లే ను ఆకాశానికి ఎత్తేంతగా అవకాశాలు కల్పించి ఆమె చేత వందలకొద్దీ పాటలు పాడించాడు. వారిద్దరి కాంబినేషన్ 1966 లో వచ్చిన తీస్రీ మంజిల్ తో మొదలైంది. ఆ సినిమాలో రఫీతో కలిసి పాడిన “ఓ మేరె సోనారే సోనారే సొనారే”, “ఓ హసీనా జుల్ఫోం వాలే జానే జహాఁ”, “ఆ జా జా మై హూ ప్యార్ తేరా” పాటలు నేటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే వుంటాయి. ఆశా భోస్లే కు రాహుల్ దేవ్ బర్మన్ తో పరిచయం అతడు పదవ తరగతి చదువుతున్నప్పటినుంచే వుంది. సంగీతం మీద వున్న అభిరుచితో చదువు కూడా మానేసి సంగీత దర్శకుడిగా మారాడు రాహుల్. ది ట్రైన్ (1970)లో రాహుల్ తో కలిసి ఆశా ఆలపించిన “ఓ మేరి జాన్ మై నే కహా”, “చయ్యారే సయ్యా” పాటలు వేటికవే ప్రత్యేకం. కారవాన్ (1971) లో “పియా తూ అబ్ తో ఆజా”, సీతా అవుర్ గీతా (1971) లో కిషోర్ కుమార్ తో పాడిన “ఓ సాథీ చల్” పాట, అపనా దేశ్ (1972) లో “ఆజా ఓ మేరె రాజా”, జవాని దివానీ (1972) లో “నహి నహి అబ్ నహి”, హమ్ కిసీ సే కమ్ నహీ (1977) లో “హై అగర్ దుష్మన్ దుష్మన్ (టైటిల్ పాట)“, “మిల్ గయా, హమ్ కో సాథీ మిల్ గయా” వంటి పాటలు ఆశా భోస్లే తప్ప వేరెవరూ పాడలేరు అన్నంతగా పాడించారు రాహువ్ దేవ్ బర్మన్. ఆశా చేత రాహుల్ దేవ్ బర్మన్ ఎన్నో అద్భుతమైన క్యాబరే పాటలు, రాక్, డిస్కో పాటలు, గజళ్ళు, ఖవ్వాలీలు వాటితోబాటు కొన్ని అద్భుతమైన క్లాసికల్ పాటలు పాడించారు. ముఖ్యంగా యువతను ఉర్రూతలూగించిన “దమ్ మారో దమ్” (హరే రామ హరే కృష్ణ), “దునియా మే” (అపనా దేశ్), “చురాలియా తో తుమ్ నే” (యాదోం కి బారాత్) పాటలు రాహుల్-ఆశా కాంబినేషన్ లోనివే.

రాహుల్ బర్మన్ (పంచమ్)తో జతకట్టి…తొలి వివాహం విచ్చిన్నమైన నేపథ్యంలో ఆశా ఒంటరిగానే ఉండిపోయింది. పెద్ద కుమారుడు హేమంత్ పైలెట్ గా ఉంటూ సంగీత దర్శకుడిగా మారాడు. కూతురు వర్ష సన్ డే అబ్జర్వర్ పత్రికకు కాలమిస్ట్ గా పనిచేస్తూ pఆత్మహత్యకు పాల్పడింది. చిన్న pకుమారుడు ఆనంద్ ఆశా బిజినెస్ వ్యవహారాలూ చూసుకుంటూ ఉండేవాడు. రాహుల్ అప్పటికే తొలి భార్య రీటా పటేల్ తో విడాకులు తీసుకొని వున్నాడు. రాహుల్ ఆశా భోస్లే కంటే వయసులో చిన్నవాడే. కానీ, వారిద్దరిమధ్య సంగీత పరంగానే కాకుండా, అభిరుచులు కూడా కలవడంతో 1980లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రాహుల్ కు లండన్ లో గుండె ఆపరేషన్ జరిగింది. ధూమపానం, మద్యం తీసుకునే అలవాట్లను రాహుల్ మానలేకపోయాడు. 1994 జనవరి 4 న రాహుల్ హార్ట్ అటాక్ తో బాధపడుతూ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు. అంతకు ముందే రాహుల్ అద్భుత సంగీతాన్ని అందించిన సూపర్ హిట్ మూవీ ‘1942: ఎ లవ్ స్టోరీ’ సినిమా విడుదలైంది. రాహుల్ మరణించేదాకా ఆశా అతనితోనే కలిసే వుంది.

మరిన్ని విశేషాలు… ఆశా భోస్లే అనేక మంది సంగీత దర్శకుల వద్ద పని చేసింది. ఖయ్యాం నిర్దేశకత్వంలో దర్ద్, ఫిర్ సులభ్ హోగీ, ఉమ్రావ్ జాన్ సినిమాలలో పాటలు పాడింది. ఆమెను ఒ.పి. నయ్యర్ కంటే ముందుగా ప్రోత్సహించింది రవి. అతని దర్శకత్వంలో “చందమామ దూర్ హై”(వచన్) అనే లాలి పాట నేటికీ సుపరిచితమే. దిల్లీ కా థగ్ సినిమాలో కిషోర్ కుమార్ తో కలిసి పాడిన “CAT క్యాట్… క్యాట్ మానె బిల్లి” వంటి పాటలతోనూ, ఘరానా, గృహస్తి, కాజల్ వంటి భక్తిరస సినిమాల్లో పాటలతోనూ ఆశాజీ కి మంచి భవిష్యత్తు ప్రసాదించాడు. ఇళయరాజా కూడా ఆశా భోస్లే గాత్రానికి ప్రభావితమై ‘మూన్డ్రామ్ పిరై’, ‘హే రామ్’ వంటి సినిమాలలో పాడించారు. ఎ.ఆర్. రహమాన్ కూడా ఆశా చేత పాడించిన సందర్భాలున్నాయి. “రంగీలా రే“ (రంగీలా), “ముఝే రంగ్ దే” (తక్షక్), “రాధా కైసే న జలే” (లగాన్) పాటలు వాటిలో కొన్ని. శంకర్ జైకిషన్ సారధ్యంలో అందాజ్ వంటి సినిమాల్లో మంచి పాటలు పాడింది. ఇక మదన్ మోహన్, లక్ష్మి కాంత్ ప్యారేలాల్, కళ్యాన్ జి ఆనంద్ జి, జయదేవ్, అను మల్లిక్ వంటి సంగీత దర్శకుల వద్ద కూడా ఆశా ఎన్నో మంచి పాటలు పాడింది. ఎన్నో ప్రైవేట్ ఆల్బంల్లో మంచి మంచి గజళ్ళు, భక్తీ గీతాలు పాడింది. ప్రపంచమంతా చుట్టి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది.

ఆశా భోస్లే ఇంతవరకు ఏడు సార్లు ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్ బహుమతులు అందుకుంది. పద్దెనిమిది సార్లు వాటికోసం నామినేషన్ పొందింది. 1979 తరవాత తనను ఉత్తమ గాయని స్థానానికి నామినేట్ చేయవద్దని, నూతన గాయనీమణులను ప్రోత్సహించమనిl ఫిలింఫేర్ బహుమతుల కమిటీకి అభ్యర్ధన పంపింది. అయితే 1996 లో రంగీలా సినిమాలో పాడినందుకు ప్రత్యేక బహుమతిని ఫిలింఫేర్ కమిటీ ఆమెకు బహూకరించింది. 2001లో ఫిలింఫేర్ వారు ఆశాజీ కి జీవిత సాఫల్య పురస్కారాన్ని బహూకరించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా ఉమ్రావ్ జాన్, ఇజాజత్ సినిమాలో పాటలకు భారత ప్రభుత్వం బహుమతి అందజేసింది. ఇక ఇతర బహుమతుల్లో గ్రామీ అవార్డ్ కూడా వుంది. గ్రామీ అవార్డు కు నామినేట్ చేయబడిన తొలి భారతీయ గాయనీమణి ఆశా భోస్లే కావడం మన అదృష్టం. భారత ప్రభుత్వం చే 2000 సంవత్సరంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను, 2008లో పద్మ విభూషణ్ అవార్డును ఆశాజీ అందుకుంది.

ఆశా భోస్లే పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఆమె హిందీలో వెయ్యి సినిమాలకు పైగా పాటలు పాడారు. మొత్తం మీద ఆశాజీ పన్నెండు వేలకు పైగా పాటలు పాడారు.

ఆశా గుల్జార్ తో పాటలు రాయించి, రాహ్హుల్ దేవ్ బర్మన్ తో కంపోజ్ చేయించి ఒక ప్రైవేట్ ఆల్బమ్ విడుదల చేయాలనుకుంది. కానీ అది సాధ్యపడలేదు. ఒకసారి రాహుల్, ఆశాజీ కలిసి జేమ్స్ బాండ్ సినిమా చూస్తుండగా, పంచమ్ కు మూడ్ వచ్చి గుల్జార్ చేత పాటలు రాయించి ఆశాకు 54 వ జన్మదిన కానుకగా విడుదల చేశాడు.

హాలీవుడ్ గాయకులు బాయ్ జార్జి, మైఖేల్ స్టిపే, నేల్లీ ఫుర్తాడో, కోడె రెడ్ తో కలిసి వెస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఆశా భోస్లే ఒక సమూహాన్ని తయారు చేసి ‘ది వే యు డ్రీమ్’ వంటి అంతర్జాతీయ ఆల్బమ్ లను రూపొందించి విడుద చేసింది.

ఆశాజీ భోజన ప్రియురాలు. దుబాయ్, బెహ్రైన్, అబుధబి, ఖతార్, కువాయిట్, బర్మింగ్ హామ్ మాంచెస్టర్ నగరాల్లో ఆశాభోస్లే రెస్టారెంట్లు నడుపుతోంది. ఈ రెస్టారెంట్లలో ఎప్పుడూ లతాజీ, ఆశాజీ పాటలు బ్యాక్ గ్రౌండ్ లో వినపడుతూ వుంటాయి.

92 ఏళ్ల నిండు జీవితాన్ని గడిపిన ఆశాభోంస్లే మరణానికి విచారం ప్రకటిస్తూ ఆమెకు సద్గతులు కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం.

ఆచారం షణ్ముఖాచారి

Share via
Copy link
Powered by Social Snap