110 తెలుగు అసోసియేషన్ల ఆధ్వర్యంలో (సెప్టెంబర్ 22, 23 తేదీలతో) అంతర్జాల వేదికగా..
__________________________________________________________________________
విజయవాడ కె.ఎల్. యూనివర్సిటి లో “విశ్వగానగంధర్వ” లైవ్ కార్యక్రమం…
__________________________________________________________________________
తన బహుముఖప్రజ్ఞతో సినీ ప్రేక్షకులకులను అలరించారు…
____________________________________________________________________
భాషా సంస్కృతులను పరిరక్షించడమే ఆయనకు నిజమైన నివాళి
విఖ్యాత నేపథ్య గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయి అని, ఆయన గానం ఎంతోమంది జీవితాల్లో ఓ భాగంగా మారిపోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన స్వభావం తననెంతో ఆకట్టుకునేదని, ఆయనలోని వినమత్ర ఆదర్శనీయమని పేర్కొన్నారు “విశ్వగానగంధర్వ” సమ్మేళనంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
పిల్లలకు సంగీతంలో మెళకువలను నేర్పిస్తూ, వారి ప్రతిభకు సానపెడుతూ, వేలాది స్వరాలను వెలుగులోకి తెచ్చిన బాలు కృషిని తెలుగుజాతి, సంగీత ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన సంస్కారాన్ని పిల్లలకు తల్లిదండ్రులు అలవాటు చేయాలని, పిల్లల్లో సంస్కార బీజాలను నాటేందుకు బాలు ప్రయత్నించారని చెప్పారు. ఎస్సీ బాలు ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 42 దేశాలు, భారత్ లోని వివిధ రాష్ట్రాల్లోని 110 తెలుగు అసోసియేషన్ల ఆధ్వర్యంలో గురువారం ‘విశ్వ గానగంధర్వ – 2021 అంతర్జాతీయ సంగీత సమ్మేశనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆన్ లైన్ ద్వారా వెంకయ్య ప్రసంగించారు. కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి పాటలు పాడే బాలు ప్రతిభ అపురూపమైనదని, గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా తన బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆనందాన్ని పంచారని కొనియాడారు. బాలు తండ్రి సాంబమూర్తి. భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఎంతగానో తపించేవారని, సాంబమూర్తి భిక్షాటన పూర్వక త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేస్తే, బాలు నెల్లూరులోని తమ ఇంటిని వేద పాఠశాలకు సమర్పించారని తెలిపారు. ఆయన తెలుగు ఉచ్చారణ ఎంతో ఆనందాన్నిచ్చేదని, మన భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడమే బాలుకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఐదున్నర దశాబ్దాలపాటు అమృత గానంతో ప్రజలను అలరించిన బాలు కరోనాతో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం విచారకరమన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ బాలుపై ప్రత్యేకంగా రూపొందించిన “విశ్వగానగంధర్వ” లిరికల్ వీడియో గీతాన్ని వెంకయ్యనాయుడు విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని కైలాష్ ఖేర్ ఆలపించారు.
ఇంకా మీరునట్టు..
పాటేదో అన్నట్టు…
మేమంతా వింటున్నట్టు.. ! అంటూ రాజేష్ సంగీత దర్శకత్వంలో కైలాష్ ఖేర్ మరియు రవి కుమార్ పాడిన పాటలో బాలుగారిని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీగీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ నటుడు తనికెళ్ళ భరణి, సంగీత దర్శకులు మాధపెద్ది సురేష్, కోటీ , వంశీ రామరాజు, విజయభాస్కర్, జయహో భారతి శ్రీనివాసరెడ్డి, గోళ్ళ నారాయణరావు, వరప్రసాద్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ తెలుగు స్వరాల నీరాజనం
విజయవాడ కె.ఎల్. యూనివర్సిటి వేదికగా బాలు సెప్టెంబర్ 25 న మొదటి వర్థంతి సందర్భంగా విశ్వగాన గంధర్వ-2021 ప్రపంచ తెలుగు స్వరాల నీరాజనం పేరుతో రెండు రోజులపాటు అంతర్జాతీయ సంగీత సమ్మేళనం నిర్వహించారు. కె.ఎల్.యు., తానా, వేదగంగోత్రి, జిజ్ఞాస సాంస్కృతిక సంస్థ, రవి మెలోడీస్, అంధ్రా అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ లాంటి అనేక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాలతో, యువ గాయనీ గాయకులు పాడిన బాలుగారి పాటలతో యూనివర్సిటి ఆడిటోరియం మారుమోగిపోయింది. ఈ కార్యక్రమలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మశ్రీ బాలసుబ్రమణ్యంగారి మెమోరియల్ పురస్కారాలు అందజేశారు.
-కళాసాగర్