విఖ్యాత గాయకుడు కే.ఎల్. సైగల్ ‘షాజహాన్’ చిత్రంలో పాడేందుకు స్టూడియోకు వెళుతున్నాడు. అదే స్టుడియోలో మరో పాట పాడేందుకు శంషాద్ బేగం కూడా అక్కడికి వచ్చింది. ఇద్దరూ ఎదురు పడ్డారు. సైగల్ షంషాద్ బేగంని చూశాడు. రికార్డింగ్ రూమ్ కి వెళ్లిపోయాడు. ఆమె శంషాద్ బేగం అని సైగల్ కి తెలియదు. ఆ మాటకొస్తే చాలామంది కళాకారులకి ఆమె ఎవరో తెలియదు. కారణం, సినిమాల్లో పాటలు పాడాలంటే బురఖా ధరించాలని, ఎక్కడా ఫోటోలు దిగరాదని ఆమె తండ్రి విధించిన షరతు! రికార్డింగ్ పూర్తి అయ్యాక ఆ మ్యూజిక్ డైరెక్టర్ షంషాద్ బేగంని సైగల్ కి పరిచయం చేశాడు. సైగల్ క్షమాపణ కోరుతూ “అమ్మా! నువ్వు పాటలు బాగా పాడుతావు. భగవంతుని ఆశీస్సులు నీకుంటాయి. నువ్వు ఎలా ఉంటావో ఇంత కాలం నాకు తెలియకపోవడం నా దురదృష్టం” అంటూ ఆశీర్వదించాడు. సైగల్ నటించిన దేవదాసు సినిమా శంషాద్ బేగం ఎన్నిసార్లు చూసిందో లెఖ్క లేదు. ఆమెకు సైగల్ అంటే వీరాభిమానం. మరో నైటింగేల్ గా భాసిల్లిన శంషాద్ బేగం గుర్ ఇంచి కొన్ని విశేషాలు.
*లాహోరులో తొలి అడుగులు *
6,000 కు పైగా పాటలు పాడి, టాకీ యుగంలో తొలితరం నేపథ్య గాయనిగా సినిమా రంగంలో ప్రవేశించి గొప్పపేరు తెచ్చుకొన్నశంషాద్ బేగం అమృతసర్ లో 14-04-1919న మియాహుస్సేన్ బక్ష్ కూతురుగా పుట్టింది. 1924లో లాహోర్ స్కూల్ లో చదువుతున్నప్పుడు ప్రార్థనాగీతం అందరితో కలిసి పాడుతుంటే, ప్రత్యేకంగా వినిపించే ఆమె కంఠాన్ని గుర్తించి ప్రోత్సహించిన హెడ్మాస్టర్ తన మొదటి గురువని సగర్వంగా చెప్పుకున్న శంషాద్ బేగం సంగీతంలో ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. తండ్రికి తను స్టూడియోల్లో పాటలు పాడటం ఇష్టం లేకపోయినా, మేనమామ సహకారంతో తండ్రిని ఒప్పించి, 14 వ ఏటనే ‘జీనాఫోన్’ అనే ప్రఖ్యాత కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకొని శంషాద్ బేగం చాలా లలిత గీతాలు పాడింది. అవి రికార్డులుగా విడుదలయ్యాయి. అప్పట్లో పాటకు 15 రూపాయలు యిచ్చేవారు. కాంట్రాక్టు ముగియగానే ఆ కంపెనీ షంషాద్ బేగంకి 5,000 భారీ పారితోషికాన్నికూడా ఇచ్చింది. ఈ సమయంలోనే గణపత్ లాల్ బట్టో అనే వకీలుతో ప్రేమలోపడి 1934లో శంషాద్ అతన్ని పెళ్లి చేసుకొంది. టాకీ చిత్రాలు ప్రారంభమైన తొలిరోజుల్లో ప్లేబ్యాక్ పాటలు ఎక్కువగా ఉండక పోవడంతో ప్రైవేటు రికార్డులకే శంషాద్ గళం పరిమితమైంది. “ ఏక్ బార్ ఫిర్ కహో జరా” అనే ప్రైవేటు పాటకు చాల మంచి పేరు వచ్చింది. పెషావర్, లాహోర్ రేడియో స్టేషన్ లలో కూడా శంషాద్ బేగం కొంత కాలం పని చేసింది. ఆ రోజుల్లో లాహోర్ సిటీ ఫిలిం ఇండస్ట్రీకి కీలకంగా వుండేది. దల్ సుఖ్ పంఛోలి లాహోర్ లో పెద్ద చిత్ర నిర్మాణ సంస్థకు యజమాని. సినిమాల్లో నేపథ్యగాన ప్రక్రియ బొంబాయిలో మొదలైనా, దాని ప్రభావం లాహోర్ కి విస్తరించని కారణంచేత ఆ సంస్థ షంషాద్ బేగంతో లాహోర్ లోనే ‘ఖజాంచి’, ‘ఖందాన్’, ‘పగ్లీ’, ‘షుక్రియా’ (1941-42) సినిమాలకు పాటలు పాడించింది. ‘యమ్లా జాట్’ చిత్రంలో పాడిన “ఛీఛీ విచ్ పా కే ఛల్లా” పాట శంషాద్ బేగంకు మంచి పేరు తెచ్చింది. పంఛోలి ఆర్ట్స్ కి శంషాద్ బేగం మొదటి ప్లేబాక్ గాయనిగా గుర్తింపు తెచ్చింది. ఉర్రూతలూగించిన “సావన్ కే నజారే హై“ (ఖజాంచి) పాట శంషాద్ ను బొంబాయి కి చేర్చింది. దర్శక నిర్మాత మెహబూబ్ ఖాన్ ఆహ్వానంతో బొంబాయి చేరిన శంషాద్ ‘తఖ్ దీర్’ చిత్రంలో చిత్రరంగ ప్రవేశం చేసిన నర్గిస్ కి ప్లేబ్యాక్ పాడి మంచి గాయనిగా గుర్తింపు పొందింది.
సంగీత దర్శకుల అదృష్ట దేవత
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొంతకాలం లాహోరులో వున్నప్పుడు మాస్టర్ గులాం హైదర్ శంషాద్ బేగంకి సినిమాల్లో పాటలు పాడటంలో శిక్షణ ఇచ్చాడు. ప్రముఖ సారంగి విద్వాంసుడు ఉస్తాద్ హుస్సేన్ బక్ష్ వాలే ఆమెను తన శిష్యురాలిగా చేర్చుకున్నాడు. హైదర్ తో బొంబాయి తిరిగివచ్చిన తరవాత పూనాలో నవయుగ చిత్రపట్ సంస్థ వారి ‘పన్నా’ చిత్రానికి శంషాద్ బేగం పాటలు పాడింది. చిత్రరంగం బొంబాయిలో అభివృద్ధి చెందడంతో శంషాద్ బేగం బొంబాయిలో స్థిరపడింది. 1943లో కె. ఆసిఫ్ నిర్మించిన ‘ఫూల్’ చిత్రానికి ఎక్కువ పాటలు శంషాద్ బేగం పాడింది. గొంతు విప్పి మనోజ్ఞంగా పాడే శంషాద్ పాటలుంటే ఆ చిత్ర సంగీత దర్శకునికి మంచి పేరు వస్తుందనే నానుడి బొంబాయిలో గట్టిగావినపడిన రోజుల్లో నౌషాద్, సజ్జాద్ హుస్సేన్, సి.రామచంద్ర, అనిల్ బిస్వాస్, ఓ.పి.నయ్యర్, చిత్రగుప్త వంటి దర్శకులు శంషాద్ బేగంతో పాడించడం మొదలెట్టారు. శంషాద్ తో పాడించడం ఒక అదృష్టంగా భావించిన రోజులు లేకపోలేదు. మహబూబ్ ఖాన్ సినిమాల్లో ఎక్కువ పాటలు పాడడమే కాకుండా ఒక్క ‘మదర్ ఇండియా’ లోనే 4 పాటలు, నౌషాద్ కి 20 చిత్రాలలో శంషాద్ మంచి పాటలు పాడింది. ఆన్, జాదూ, షాజహాన్, అనోఖి అదా వంటి చిత్రాల్లో శంషాద్ బేగం పాడిన పాటలు మణిపూసలు. 1950లో వచ్చిన నౌషాద్ చిత్రం ‘బాబుల్’లో “చోడ్ బాబుల్ కా ఘర్” పాట ఈరోజుకీ పెద్ద హిట్టే! సి. రామచంద్ర చిత్రంలో శంషాద్ వినిపించిన “మేరీ జాన్ సండే కే సండే” అనే వెస్ట్రన్ పాట కూడా ఒక సంచలనమే!! గురుదత్ తన సినిమా సందర్భానికి అనుగుణంగా శంషాద్ బేగంతో కొన్ని విలక్షణమైన పాటలు పాడించాడు. విశేష మేమంటే తన భార్య గీతాదత్ కూడా మంచి గాయనే. కానీ ఎవరు పాడాల్సిన పాట వాళ్లు పాడితేనే దానికి పరమార్ధం అనేది గురుదత్ పధ్ధతి. తన సహచర గాయనీమణులు నూర్జహాన్ బేగం, సురయ్యా, ముబారక్ బేగం లతో స్నేహంగా మెలగిన శంషాద్ భావితరం గాయనీమణులు లతా మంగేష్కర్, గీతాదత్, ఆషాభోస్లే లకు కూడా మార్గదర్శిగా నిలిచింది.
శంషాద్ కి కోరస్ పాడిన లతా మంగేష్కర్
లతా మంగేష్కర్ మొదట్లో శంషాద్ బేగం పాటకు కోరస్ పాడింది. తరవాత ‘అందాజ్’ చిత్రానికి “దార్ కా మోహబ్బత్ కర్ లే” అనే పాటను ఇద్దరూ కలిసి పాడారు. వీరే పాడిన “ప్యార్ కే జహా కి” (పతంగా), “బచ్పన్ కే దిన్” (దీదార్) పాటలు చాలా పాపులర్ అయ్యాయి. లతా మంగేష్కర్ శంషాద్ గురించి చెబుతూ “ఆ నైటింగేల్ స్వరం ఎంత మధురంగా వుంటుందో… ఆమె వాత్సల్యం కూడా అంతే మధురంగా వుంటుంది. కంటికి కనుపించని గాన కోకిల శంషాద్” అని ప్రశంసించారు. శంషాద్ బేగంని ముఖ్యులందరూ “అప్పా” అని ఆత్మీయంగా పిలిచేవారు.
*ఎంతడిగినా ఇస్తాను *
ఒకానొక ఇంటర్వ్యూ లో శంషాద్ బేగం మాట్లాడుతూ “నా పాటల విజయంతో సంగీత దర్శకుడు గులాం హైదర్ పారితోషికం పెరిగింది. హైదర్ వద్ద నా పారితోషికం కూడా పెంచమని కోరాను. పంచోలిని కలవమన్నాడు. నాకు అప్పుడు పాటకు 100 రూపాయలు ఇచ్చేవారు. పంచోలిని కలిస్తే ఎంత కావాలని అడిగారు. పాటకి 700 ఇస్తారా అని అడిగాను. వెంటనే “సరే” అని పంచోలి, ‘ నువ్వు రెండువేలు అడిగినా ఇచ్చేవాడినే. ఎందుకంటే నా వ్యాపార లాభాలు నీతోనే ముడిపడి వున్నాయి’ అన్నాడని చెప్పారు.
రెండు సార్లు రికార్డింగ్.. రెండు పారితోషికాలు
ఆ రోజుల్లో సినిమాలకు పాటలు పాడడం ఇప్పుడంత సులభం కాదు. సింగల్ ట్రాక్ లో పాడాలి. ప్రతి పాటని రెండు సార్లు రికార్డింగ్ చేసేవారు. ఒకటి సినిమా చిత్రీకరణ కోసం .. మరొకటి రికార్డింగ్ కంపెనీ వారికోసం. పగలు షూటింగ్ జరిగితే సాయంకాలం పాటల రికార్డింగ్ జరిగేది. రోజంతా కష్టపడినా 4 పాటలకన్నా రికార్డింగ్ పూర్తి అయ్య్టేది కాదు. అందుకే ఎక్కువ పాటలు పాడే అవకాశం గాయకులకి రాలేదు. అయితే గాయకులకు రెండు విడతల పారితోషికాలు లభించేవి. శంషాద్ ని కొందరు సంగీత దర్శకులు తాము నిలదొక్కుకొనే వరకే ఉపయోగించుకొన్నారు. ఒకసారి స్థిరపడ్డాక ఇతర గాయనీమణులతో ఎక్కువ పాటలు పాడించుకొన్నారు. మదన్ మోహన్ తొలుత శంషాద్ తో పాడించి తరవాత లతాకి అవకాశాలు ఇచ్చాడు. నయ్యర్ కూడా ఆస్మాన్, CID, ఆర్ పార్ వంటి చిత్రాల్లో శంషాద్ తో పాడించి, పేరొచ్చాక ఆశాకి అవకాశాలు ఇచ్చాడు. అందుకు శంషాద్ ఎప్పుడూ అసూయ పడలేదు.
దక్షిణాదిన…
దక్షిణాదిన జెమిని సంస్థ తీసిన ‘నిషాన్’ (1949) చిత్రంలో శంషాద్ చేత ఎస్. రాజేశ్వరరావు “జయ్యో జయ్యో సిపాయియో” పాట పాడించారు. స్వయంగా గాయని అయిన పి. భానుమతికి శంషాద్ పాడడం విశేషం. ప్రముఖ నిర్మాత, దర్శకుడు తారాచంద్ బరజాత్యా తన ‘బహార్’ చిత్రంలో పాడటానికి శంషాద్ ని మద్రాస్ రావలసిందిగా కోరారు. పని ఒత్తిడిలో శంషాద్ రాలేకపోతే, తనే బొంబాయి వెళ్లి “దిల్ కా ఖరార్ లేకే ఆజారే ఆజా పరదేశియా”; “దునియాకో లూట్ మారో” పాటల్ని రికార్డింగ్ చేయించుకొచ్చారు.
*శంషాద్ బాధ పడిన సందర్భం *
ముఖ్యంగా రెండు సందర్భాల్లో శంషాద్ బేగం బాధ పడింది. తను ఆరాధ్య దైవంగా కొలిచే కె. యల్. సైగల్ తో కలిసి పాడలేకపోవడం మొదటిది. షాజహాన్ చిత్రంలో ఇద్దరూ విడి విడిగా పాటలు పాడారు. కానీ కలిసి యుగళగీతం పాడలేదు. రెండోది సి.ఐ.డి చిత్రంలో శ్రోతలకు ఇష్టమైన పాట “ఓ లేకే పెహలా పెహలా ప్యార్”. ఓ.పి. నయ్యర్ ఈ పాట హ్యాపీ వెర్షన్ ని శంషాద్ తో పాడించి పాథోస్ వెర్షన్ ని ఆశాతో పాడించడం శంషాద్ కి బాధ కలిగించింది. కానీ ఎక్కడా తన బాధను వ్యక్తపరచలేదు. అందుకే ఆమె “అప్పా”అయ్యింది. భర్త గణపత్ లాల్ 1955లో ఒక ప్రమాదంలో మరణించిన తరవాత కూతురు ఉషారాత్రా వద్ద కాలం గడిపిన శంషాద్ పాటలు పాడడం తగ్గించివేసింది. శంషాద్ బేగం పాటలు వినడమే కాని ఆమె ఎలావుంటారో చాల మందికి తెలియకపోవడంచేత ఆమె ఫోటోలు కూడా పరిమితంగానే వున్నాయి.
జాజి సిగలో జాబిలమ్మ
2009 లో శంషాద్ బేగం ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో ఆమెను సత్కరించింది. 40 దశకంలో అత్యధిక పారితోషికాన్నిఅందుకున్న గాయనీమణిగా చలామణి ఐన శంషాద్ బేగం హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తమిళ భాషల్లో 6,000 కు పైగా పాటలు పాడింది. ఆమె పాడిన పాటలు కొని రీ-మిక్స్ అవుతూ వున్నాయి. నౌషాద్ ఒక్కడే చివరిదాకా శంషాద్ బేగం ని మరువకుండా అవకాశాలు ఇస్తూ వచ్చారు. శంషాద్ గాత్రం “చర్చి బెల్”లా ఉంటుందని ఓ.పి. నయ్యర్ కితాబిచ్చాడు. ఎస్.డి. బర్మన్ హిందీలో తన మొదటి చిత్రం ‘షికారి’ (1946) లో శంషాద్ తో “కుచ్ రాగ్ బాదల్ రహీ” పాట పాడించాడు. అమీన్ సయాని రేడియో సిలోన్ ద్వారా నిర్వహించిన ‘బినాకా గీత మాలా’లో శంషాద్ కు మొదటి 10 గొప్పపాటల్లో స్థానం లభించింది. 1953 లో ‘నఘమా” చిత్రంలో “కహే జాదూ కియా ఆ”(షౌకత్ దెల్వి); 1954లో ‘ఆర్ పార్’ చిత్రంలో “కభీ ఆర్ కభీ పార్ లగా తేరీ నజర్”(ఒ.పి. నయ్యర్); 1957లో ‘నయా దౌర్’ చిత్రంలో “రేష్మీ సల్వార్ కుదాతా జాలికా”(ఒ.పి. నయ్యర్); 1958లో ‘హౌరా బ్రిడ్జి’ చిత్రంలో “ఇత్ కి దుక్కి పాన్ కా ఇక్కా సునోజీ ఏ కలకత్తా హై” (ఒ.పి. నయ్యర్); 1959లో ‘మిస్టర్ కార్టూన్’ చిత్రంలో “మై మై మై కార్టూన్” (ఒ.పి. నయ్యర్); 1969లో ‘కిస్మత్’ చిత్రంలో “కజరా మోహబ్బత్ వాలా”(ఒ.పి. నయ్యర్) పాటలు జనరంజకమైన పాటలుగా శ్రోతల ఆదరణకు నోచుకున్నాయి. శంషాద్ బేగం పాడిన మంచి పాటలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత. వాటిల్లో కొన్ని…… భూజ్ మేరా క్యా నాం రే(సి.ఐ.డి-ఒ.పి. నయ్యర్); చాంద్నీ ఆయీ బన్ కే(దులారీ-నౌషాద్); అబ్ తో జీ హోనే లగా (మిస్టర్ & మిసెస్ 1955-(ఒ.పి. నయ్యర్); అప్నా బనాలే హాయ్ (మా కే ఆంసూ- సర్దార్ మాలిక్); ఆయే దిల్ న ముఝే యాద్ దిలా(సావన్ ఆయేరే-ఖేమ్ చంద్ ప్రకాష్); దేఖ్ చాంద్ కి వోర్(ఆగ్-రాం గంగూలి); మేరీ జాన్ మొహబ్బత్ కరో(సయ్యా-సజ్జద్ హుస్సేన్); మేరె బన్నె కి బాత్ న పూఛో(ఘరానా-రవి); కోయీ ఆనే కోయీ హై దిల్(చోటే నవాబ్-ఆర్.డి. బర్మన్); జావో సిధారో హి రాధా కే శ్యాం(ఆర్జూ-అనిల్ బిస్వాస్); హమ్ సే న దిల్ కొ లగానా ముసాఫిర్(ఆంఖే-మదన్ మోహన్); హటో జావో పారే మత్ ఛేడో(నిషానా-ఖుర్షిద్ అన్వర్); గాడీ వాలే దుపట్టా ఉడా జాయేరే(పూంజీ-గులాం హైదర్); చైలా దే జా నిషానీ(బాజార్-శ్యాం సుందర్); చలీ చలీ కైసీ హవా యే(బ్లఫ్ మాస్టర్-కల్యాణ్ జి, ఆనంద్ జి); బోగి బోగి బోగి(హమ్ లోగ్ –రోషన్); బాగో(మే కబూతర్ కలే(ముడ్ ముడ్ కే న దేఖ్ ముడ్ ముడ్ కే-హన్స్ రాజ్ బెహల్).
హీరా నందని గార్డెన్స్, పోవై, బొంబాయిలో కూతురు ఉషారాత్రా ఇంటిలో తనువు చాలించిన శంషాద్ బేగం గాత్రం అజరామరం… సంగీతం ఉన్నంత కాలం ఆ గాత్రం వీనుల విందు చేస్తూనే వుంటుంది.
ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)