ఇంద్రగంటి జానకీబాలగారు ప్రముఖ రచయిత్రి, లలిత సంగీత గాయని. ఆవిడ ఎన్నో కథలు, నవలలు రచించారు. మనశ్శల్యాలు అనే కవితా సంపుటి కూడా రాశారు. ఆవిడ ఆంధ్రప్రదేశ్ ఆర్టిసీ సంస్థలో ఉద్యోగం చేశారు. విజయవాడ ఆకాశవాణిలో లలిత సంగీత కార్యక్రమంలో ఎన్నో పాటలు పాడారు.
జానకీబాల గారిది సంగీత కుటుంబం. అమ్మగారు లక్ష్మీ నరసమాంబ గారు సంగీతం టీచర్. వీణ వాయించేవారు. నాన్న సూరి రామచంద్రస్వామి గారు పాటలు పాడేవారు. చెల్లెలు వాణి గారు, తమ్ముడు కుమారస్వామి గారు అందరూ సంగీత ప్రియులే.
పుట్టింటి వారిది సంగీత కుటుంబం అయితే మెట్టినింటి వారిది సాహిత్య కుటుంబం. భర్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు కవి, పండితులు, విమర్శకులు. మామగారు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు ప్రఖ్యాత కవి పండితులు. దక్షారామం కావ్యకర్త. జానకీబాల గారు 12 నవలలు, ఎన్నో కథలు రాశారు.’కొమ్మ కొమ్మ కోకిలమ్మ ‘అనే పేరుతో సినీ నేపథ్య గాయనుల జీవిత చరిత్రను రాశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి జీవిత చరిత్రను ‘యశస్విని అనే పేరుతో రచించారు.
మార్గదర్శి దుర్గాబాయి దేశముఖ్ జీవిత చరిత్ర, కొన్ని పిల్లల పుస్తకాలు రచించారు.
ఈమె రచనలలో మధ్యతరగతి జీవిత చిత్రీకరణ అద్దంలో కనిపించినట్లు కనిపిస్తుంది. కనిపించే గతం’ నవల వార్త దిన పత్రికలో 2000 సంవత్సరంలో ధారావాహికంగా ప్రచురింపబడి అశేష పాఠకుల మన్ననలు పొందింది. గతించిన నాలుగు దశాబ్దాలుగా మధ్యతరగతి కుటుంబాల్లోని స్త్రీ పురుషుల జీవన విధానాల గురించి చిత్రిక పట్టిన రచనలు.
జానకీ బాల గారు సాహిత్య రంగంలో చేసిన విశేష కృషికి అనేక పురస్కారాలు పొందారు. నిగర్వి, నిరాడంబరులైన జానకీబాల గారిని కలవటానికి హైదరాబాదులో వాళ్ళ ఇంటికి వెళదాము రండి.
………………………………………………………
ప్రశ్న. మీరు కథకులు, లలిత సంగీత గాయనిగా ప్రసిద్ధి చెందారు. ఆకాశవాణి విజయవాడలో ఎన్నో పాటలు పాడారు. మీకు ఎవరి పాటలు ఇష్టం? వారిది ఒక పాట చెప్పండి.
జ. కృష్ణశాస్త్రి గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన పాట
రెల్లుపూల పాన్పు పైన
జల్లు జల్లుగా చల్లినారమ్మా
ఎవరో చల్లినారమ్మా
వెన్నెల చల్లినారమ్మా…
రెల్లి పూలు తెల్లగా ఉంటాయి వెన్నెల్లో మరింత తెల్లగా మెరిసిపోతుంటాయి. దీన్నే కవి మరింత అందంగా చెప్పాడు. దీనిలో ఎక్కడా పరుషమైన పదం లేదు. అన్నీ లలిత లలితమైన పదాలే. ఆయన పాటలన్నీ అలాగే ఉంటాయి. అందుకే నాకు వారి పాటలంటే ఇష్టం.
ప్రశ్న: మీది సంగీత కుటుంబమని విన్నాను మీ అమ్మగారి గురించి చెప్పండి.
జ. మా అమ్మ లక్ష్మీ నరసమాంబ గారు. వీణ వాయించేవారు. సంగీతం టీచర్ గా పని చేశారు. మా అమ్మ పిల్లలకు సంగీతం పాఠాలు నేర్పేది. నేను మా అమ్మ వీణ వాయిస్తుంటే చిన్నప్పటినుంచి తాళం వేసేదాన్ని.
ప్రశ్న: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు చిన్నప్పుడే మీకు సంగీతం ఒంట పట్టిందన్నమాట. సంగీత ప్రపంచంలోకి మీరు ఎలా వచ్చారు?
జ. నేను చిన్నప్పటి నుంచీ నేను పాడేదాన్ని. చదువుకున్నప్పటినుంచి స్కూల్లో జరిగే ఏ కార్యక్రమంలో నైనా నేనే పాడేదాన్ని. అందరూ నా పాటను మెచ్చుకునేవారు. పాటల పోటీల్లో నాకెప్పుడూ ప్రథమ బహుమతే.
ప్రశ్న: మీ అమ్మగారు సంగీతం టీచర్. మీరు పాటలు పాడేవారు. మీ ఇద్దరికీ ఇంట్లో ప్రోత్సాహం బాగా ఉండేదా? కొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలు పాఠ్యపుస్తకాలు తప్ప ఇంకా దేని వైపు మొగ్గు చూపినా ఇష్టపడరు కదా?
జ. మా నాన్నగారు సూరి రామచంద్ర శర్మ గారు కూడా పాటలు పాడుతారు కాబట్టి మా అమ్మను కానీ, నన్ను గానీ పాడవద్దు అని ఎప్పుడూ నిరాశపరచలేదు. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు పాటలకు డ్యాన్సులు కూడా చేసేదాన్ని.
ప్రశ్న: మీ జీవన సహచరులు శ్రీకాంత్ శర్మ గారు ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్, కవి. ఎన్నో కావ్యాలు రాశారు, పాటలు రాశారు. మీరు శర్మ గారి పాటలెన్నో పాడారు. వాటిలో మీకు ఇష్టమైన పాట ఏది?
జ. “వెన్నెలమ్మా వెన్నెల
విరజాజి పూవుల ఊయల
కన్నులందలి కలలుతొణికే కన్నెపిల్లల నవ్వులా
వెన్నెలమ్మా వెన్నెల”
ఈ పాట నాకు ఎంతో ఇష్టం. సరళమైన పదాలతో ఈ పాట పాడటానికి ఎంతో హాయిగా ఉంటుంది.
ప్రశ్న: మీరు సంగీత రహస్యం తెలిసిన గాయని. సంగీత కుటుంబంలో పుట్టారు. ఖాళీ ఉంటే చాలు మీ గొంతులో నుంచి పాట అప్రయత్నంగా రెక్క విప్పుకుంటుంది. ఇలా పాటలు పాడుతున్నప్పుడు మీరు మర్చిపోలేని అనుభవాలు ఏమన్నా ఉంటే చెప్పండి.
జ. ఒకరోజు రేడియో స్టేషన్ లో పాటల రికార్డింగ్ జరుగుతుంది. ఆ పాటలో శ్రీరంగం గోపాల రత్నం గారు ప్రధాన గాయని. నేను ఇంకొంతమంది కోరస్. పల్లవి “మానవులం మకుటధారులం”. ఒకసారి పాటలో పల్లవి అయిన తర్వాత ఇంటర్ ల్యూడ్ వచ్చాక అది పూర్తవగానే చరణం ఆమె ఎత్తుకోవాలి. అదే చరణాన్ని మేమంతా అనాలి. రికార్డింగ్ మొదలైంది. మరిచిపోయి ఆమెకు బదులు నేను చరణం ఎత్తుకున్నా. ఒక్కసారిగా భయపడిపోయాను నేను అలా చేసినందుకు. అంతా ఆగిపోయింది. ఆమె నవ్వుతూ “ఏం పర్వాలేదు మళ్లీ చేద్దాం అయినా మీరు చక్కగానే ఎత్తుకున్నారు జానకి బాలా” అన్నారు ఆవిడ. అప్పుడింక నేను అమ్మయ్య అనుకున్నాను. ఇది నేను జీవితంలో మర్చిపోలేని అనుభవం. ఆవిడ అంత పెద్ద స్థాయిలో ఉన్నా తోటి కళాకారిణులను గౌరవించే విధానాన్ని ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటాను.
ప్రశ్న: చాలామందికి పాట అంటేనే చిన్న చూపు. సినిమా పాటంటే మరీ చిన్నచూపు. కానీ సినిమాలో పాటకు ప్రాముఖ్యం ఎక్కువ. వివిధ రాగాల ఆధారంగా ఎన్నో పాటలు వచ్చాయి. వీటిమీద మీరు ప్రచురించిన “రాగ రంజితం” గురించి వివరిస్తారా?
జ. లలిత గీతాల రచనలు (text) కూడా దీనిలో ఉన్నాయి. కర్ణాటక సంగీత కళాకారులకు, ఔత్సాహిక లలిత సంగీత గాయకులకు ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందని అనుకుంటాను నేను.

ప్రశ్న: “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసఃఫణి” అంటారు. శిశువులను, పశువులను, పాములను కూడా సంగీతం అలరిస్తుంది అని అంటారు. మాలాంటి వాళ్ళం పాటలను విని ఆనందిస్తామే కానీ వాటి రాగాలు అవి మాకు తెలియదు. మీరు ఆ రాగాల గురించి పుస్తకం రాశారు కదా? ఆ పుస్తకం గురించి వివరాలు చెప్తారా?
జ.”రాగ రంజితం” సినిమా పాటల రాగాల గురించి రాసిన పుస్తకం. “చినుకు” మాస పత్రికలో నెల నెలా ధారావాహిక గా వచ్చాయి. ఈ పుస్తకాన్ని శాంతా వసంత ట్రస్టు తరఫున శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు ప్రచురించారు. చాలామంది సినిమా పాట అంటే చులకనగా చూస్తారు. కానీ సినిమా పాటకు కవితా పరిమళ మద్దిన కవులు చలన చిత్రసిమలో చాలామంది ఉన్నారు. ఆనాటి సముద్రాల, పింగళి, మల్లాది, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సదాశివబ్రహ్మం, అనిశెట్టి, పినిశెట్టి, వీటూరి, వేటూరి దగ్గర నుంచి నారాయణరెడ్డి, దాశరథి మొదలగు కవులు ఎందరో సినిమా పాటకు సాహితీ సుగంధాలను అద్దారు. ఒకే రాగంలో ఉన్న పాటలను ఒకే చోట చేర్చడం కష్టమే అయినా ఇష్టంగా చేశాను. మోహన రాగంలో ఉన్న పాటల గురించి చెప్పేటప్పుడు మల్లాది రాసిన “తెల్లవార వచ్చే తెలియక నా స్వామి” దగ్గర నుంచి వేటూరి “నిన్ను కోరి వర్ణం” వరకు ఈ పుస్తకంలో పొందుపరిచాను. మోహన రాగం దగ్గర నుంచి కీరవాణి రాగం వరకు ఆయా రాగాలలో వచ్చిన పాటలను వివరించాను. ఆయా రాగాలను, లక్షణాలను స్వరాలను వివరిస్తూ ఆ పాటల సాహిత్యాన్ని ,పాడిన వారిని తెరమీద అభినయించిన తారల గురించి వివరాలు చెప్పాను. ఈ పుస్తకంలో రాగమాలికల గురించి కూడా వివరించాను.
ప్రశ్న: రాగమాలికలు అంటే ఏమిటండి?
జ. ఒక కీర్తన, ఒక కృతి, ఒక వర్ణం, ఒక పాట, ఒకే రాగంలో ఉంటాయి సహజంగా. కానీ ఒక్కొక్క చరణం ఒక్కొక్క రాగంలో స్వరపరిచి మొత్తం ఆ ఐటమ్ కే ఒక కొత్త అందాన్ని తీసుకువచ్చే ప్రక్రియ రాగమాలిక. ఈ “రాగ రంజితాన్ని” కూడా శాంతా వసంత ట్రస్టు వారే ప్రచురించారు.
ప్రశ్న: సంగీతం, సాహిత్యం ఈ రెండు ఒకరిలోనే అరుదుగా ఉంటాయి. మీరు అలాంటి అపురూప గాయని, రచయిత్రి. రచయిత్రిగా మీరు ఎన్నో నవలలు, కథలు రాశారు. మీకు పేరు తెచ్చిన నవల గురించి చెప్తారా?
జ. “కనిపించే గతం” నవలను పాఠకులు బాగా ఆదరించారు. ఆ నవల వార్తలో సీరియల్ గా వచ్చింది.

ప్రశ్న: మిగిలిన నవలల గురించి చెప్తారా?
జ. విశాల ప్రపంచం, కరిగిన హరివిల్లు, వెన్నెల మట్టి, మాతృ బంధం, నిజానికి అబద్ధానికి మధ్య ఆవలి తీరం ఇవన్నీ నా నవలలు.
ప్రశ్న? మీ కథా సంపుటుల గురించి వివరిస్తారా?
జ. ప్రేమలేఖ, ప్రయోజనం, అంతరంగ తరంగాలు, ఆత్మదృష్టి, అందరం ప్రేక్షకులమే ఇవన్నీ నా కథా సంపుటాలు. ఇటీవల ఈ కథలన్నీ కలిపి “జానకీబాల కథలు” పేరిట ప్రచురించాను.
ప్ర. మీ మొదటి కథ ఎప్పుడు రాశారు? ఆ విశేషాలు ఏమిటి ?
జ. 1970లో ఆంధ్రపత్రికలో నా మొదటి కథ “మనిషికి మరో మలుపు” వచ్చింది. అంతకుముందు 66 లో నేను రెండు గల్పికలు రాశాను. అవి “జగతి”లో ప్రచురించారు.
ప్ర. అమృతం కురిసిన రాత్రి కవి తిలక్ మీ ఊరి వారే కదా. వారిని బాగా ఎరుగుదురా?
జ. తిలక్ గారు నన్ను ఎంతో అభిమానించేవారు. కుర్రవాళ్ళమైన కొందరు సాహిత్య అభిమానులం తరచూ ఆయన దగ్గరికి వెళ్లి ఆయన చెప్పే గొప్ప విషయాలు వింటూ ఎంతో ఉత్సాహం పొందేవాళ్ళం.
ప్ర. మీరు కవితా సంపుటి కూడా ప్రచురించారు. ఆ వివరాలు చెప్పండి?
జ. మొదట్లో నేను కవిత్వం రాశాను. “మనశ్శల్యాలు” అనే కవితా సంపుటి ప్రచురించాను. తర్వాత పాటలు, వ్యాసాలు, స్కెచ్ లు రాసాను.
ప్ర. సినిమా గాయనుల గురించి కూడా రాసినట్లు న్నారు కదా?
జ. అవును. చలనచిత్ర నేపథ్య గాయనుల జీవిత విశేషాల గురించి “కొమ్మా కొమ్మా కోకిలమ్మ” అనే పుస్తకం రాసాను . సినీ నటి, గాయని పి భానుమతి జీవిత చరిత్రను “యశస్విని” పేరుతో రాసాను.” మార్గదర్శి దుర్గాబాయి దేశముఖ్ జీవిత చరిత్ర”, కొన్ని పిల్లల పుస్తకాలను ప్రచురించాను.
ప్ర. మీరు పొందిన పురస్కారాల గు వివరాలు తెల్పండి.
జ. 2001లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం పొందాను. 2024 లో జనవరిలో సినారె పురస్కారాన్ని అందుకున్నాను.
ఇంటర్వ్యూ: మందరపు హైమావతి (9441062732)
