విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 17
నాలుగు దశాబ్దాల పాటు పాటల బాటలో సాగిన పాటసారి, తన పాటల పాటవంతో ఖండాంతరాలు చేరిన బాటసారి ఆల్ ఇన్ వన్, ఆల్ టైమ్ గ్రేట్ మహమ్మద్ రఫీ. ఆజాతుఝుకో పుకారే మేరేగీత్….అంటూ ప్రతీ ఒక్కరినీ తనవైపు ఆకర్షించిన మధుర గాయకుడైన రఫీ పాటలలో తియ్యదనం, భారతీయదనం రెండింటినీ మనకు రుచి చూపిస్తాడు. చాహె కోయి ముయె జంగ్లీకజా…..అని షమ్మీకపూర్ కి పాడి, దర్దేదిల్ అంటూ రిషీకపూర్ కీ పాడీ, సునోసునో బాపూజీకీ అమర్ కహానీ అంటూ నెహ్రూ గారింట్లో నెహ్రూగారికోసం పాడి, తరంతరం నిరంతరం ఆనందించేలాగా తన స్వరం మార్చుకోగలిగిన స్వర మాంత్రికుడు రఫీ దైవభక్తి, దేశభక్తి, యువతను వెర్రెక్కించే రక్తి, భజన, ఖవ్వాలి అంటూ 14 భారతీయ భాషలలో పాటలు పాడిన విలక్షణ గాయకుడు. అల్లరి పాటల వల్లరి కిషోర్ కుమార్ కి కూడా తొలి రోజుల్లో ప్లేబాక్ పాడిన ఘనత రఫీకే దక్కిందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంతవారుగానీ, వేదాంతులైన గాని అంటూనే నామది నిన్ను పిలిచింది గానమై….. అంటూ మన తెలుగు వాడినీ గెలిచాడీ గాయకుడు. రఫీ పాటలు వింటూ మైమరచి పోతూ ఇది నాలుగోతరం. ఈ స్వర మంత్రం ఇంకెన్ని తరాలు సాగుతుందో చెప్పడం ఎవరి తరం? భారతదేశం నలుమూలలా తన పాటల పూదోటలు వేసిన సుమధుర గాయకుడు మహమ్మద్ రఫీ నేటికీ మన ధృవతార!
(మహమ్మద్ రఫీ జన్మదినం 24 డిశంబర్ 1924)