విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 14
తెలుగుపాటకు పాఠాలు నేర్పిన పాఠశాల ఘంటసాల, తండ్రి సూర్యారావుకు వారసునిగా విజయనగరంలో చిన్ననాటి నుండే తాను తీసిన కూని రాగాలను పూని కోకిల కూతలుగా మలచుకొని ఆకలితో అలమటిస్తున్నా తన పటిమకు పదును పెట్టడానికే నిర్ణయించుకొని ద్వారం వెంకటస్వామినాయుడు గారిని తన గానంతో మెప్పించి మరీ తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొని పాటలు పాడటం అభ్యసించాడు. అచ్చతెలుగు అక్షరమాలనైనా తన గాన మాధుర్యంతో సుస్వరాల గీతమాలగా మలచగలిగిన గానగంధర్వుడు ఘంటసాల. ఘంటసాల భక్తి పాటలు పాడినా, రక్తి పాటలు పాడినా, పల్లె పదాలాలపించినా ఆయన పాటలన్నీ తెలుగుతనానికి బాటలు. అవి తేట నీటి ఊటలు. పాడుతా… తీయగా… చల్లగా అని మనల్ని హాయిగా… నిద్రపుచ్చగలడు… “శేషశైలవాసా శయనించు మా అయ్యా” అని ఆ వేంకటేశునీ నిద్రపుచ్చగలడు. “తెలుగువీర లేవరా” అంటూ మనల్ని వెన్నుతట్టి రెచ్చగొట్టనూ గలడు. తిరుపతి ఆస్థాన గాయకుడై ఆ స్వామిని తన స్వర పుష్పాలతో అర్చించ గలిగాడు. తెలుగునాట “వాతాపి గణపతిం భజే” అన్నా, పుష్ప విలాపం విన్నా మన ముందు కదలాడేది ఘంటసాల వెంకటేశ్వరుడే! సుస్వరాల పాకశాల – తెలుగు పాటకు పర్ణశాల పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు నేటికీ మన ధృవతార!
( ఘంటసాల జన్మదినం 04 డిశంబర్ 1922)