బాలు ఇష్టపడే యువ గాయకుడు- శ్రీకృష్ణ

మ్యూజిక్ పై పెద్దగా నాలెడ్జ్ లేదంటూనే టాలీవుడ్ టాప్ సింగర్స్ లో ఒకటిగా నిలిచాడు శ్రీకృష్ణ విష్ణుభొట్ల. “నా తరువాతి తరంలో మంచి గాయకుడంటే శ్రీకృష్ణనే” అని లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేత అనిపించుకున్న శ్రీకృష్ణ మాటల్లోనే తన మ్యూజిక్ జర్నీ గురించి…

ప్లేబ్యాక్ సింగర్ కావాలని మొదట్నుంచీ ఉండేదా?
అస్సలు లేదు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. చిన్నప్పుడు ఆటవిడుపుగా భక్తి పాటలు పాడేవాడ్ని. ఆ కూని రాగాలు అమ్మకి నచ్చి మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేసింది. సరదాగా పాడమంటే ‘ఓకే’. కానీ, మ్యూజిక్ క్లాస్ అంటే ఆమడదూరం పరిగెత్తేవాడ్ని. క్లాస్ ఎగొట్టడానికి వంకలు వెతికేవాడ్ని. కానీ, అవన్నీ అమ్మకి తెలిసిపోయేవి. దాంతో ఇష్టం లేకపోయినా క్లాస్ కి వెళ్లేవాడ్ని. మొదట్లో అమ్మ కోరిక మేరకే మ్యూజిక్ నేర్చుకున్నప్పటికీ… రానురాను నాకూ ఇంట్రెస్ట్ వచ్చింది. సరిగ్గా ఆ టైంలోనే టెన్ ఎగ్జామ్స్ రావడంతో మ్యూజిక్ క్లాస్ లకి బ్రేక్ ఇచ్చి చదువుపై కాన్సన్ ట్రేట్ చేశా. అలాగని మ్యూజిక్ ని పూర్తిగా పక్కనపెట్టలేదు. ఎం.ఎస్ సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి పాటలు, అన్నమాచార్య కీర్తనలు ఆడియో క్యాసెట్స్ విని నేర్చుకునేవాడ్ని. ఎక్కడ పాటల పోటీలు జరిగినా వెళ్లి ఆ పాటలు పాడేవాడ్ని. లక్కీగా ప్రతి కాంపిటీషన్లో నాకే ఫస్ట్ ఫైజ్ వచ్చేది. దాంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగి మ్యూజిక్ క్లాస్ల వైపు మనసుమళ్లి… మళ్లీ డిగ్రీలో మ్యూజిక్ క్లాస్లో చేరా. ‘పాడాలని ఉంది’ లాంటి రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కూడా గెలుచుకున్నా. ఈటీవీ కన్నడలో టెలికాస్ట్ అయినా సింగింగ్ కాంపిటీషన్లో కూడా మొదటి స్థానంలో నిలిచా. కానీ, ఇంటికి పెద్దకొడుకుగా నాకంటూ కొన్ని బాధ్యతలు ఉండటంతో మ్యూజిక్ ని ఎప్పుడూ ఒక హాబీగానే చూశా. సినిమా పాటలు పాడాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ చేశా. 2007లో ఉద్యోగం కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చా.

మరి మ్యూజిక్ వైపు రావడం వెనక గట్టి రీజన్స్ ఏమైనా ఉన్నాయా?
ఉద్యోగం కోసం చాలా కంపెనీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చా. కానీ, ప్రతీది వచ్చినట్టే వచ్చి అంతలోనే చేజారిపోయేది. హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో నేను మా బామ్మ ఇంట్లో ఉండేవాడ్ని. ఎక్కువ రోజులు ఆమెకి భారమవడం నాకు ఇష్టం లేదు. అందుకని క్వాలిఫికేషన్ పక్కనపెట్టి జాబ్ సెర్చింగ్ మొదలుపెట్టా. జెమినీ టీవీలో యాంకర్ గా చేద్దామని చానల్ హెడ్ ఆఫీస్ కు వెళ్లా. వాళ్లు “ప్రస్తుతం యాంకర్ గా అవకాశమైతే లేదు. త్వరలో ఎఫ్.ఎమ్ స్టార్ట్ చేస్తున్నాం. కావాలంటే ఆర్టేగా అవకాశమిస్తాం” అన్నారు.కట్ చేస్తే ఎస్.ఎఫ్.ఎమ్.లో ఆర్టే అవతారమెత్తా. ‘పాడాలని ఉంది’ షో చేస్తున్నప్పుడు శ్రీదేవి అక్క పరిచయమయ్యారు. ఆమెతో మాట్లాడుతుంటే మాటల్లో మాటగా “నేను ఫలానా చోటు ఉంటున్నా” అని చెప్పా. వెంటనే “కోటిగారి ఆఫీసు పక్కనే ఉంటుంది. వెళ్లి కలువు” అని అక్క చెప్పారు. ఒకసారి ట్రై చేద్దామని వెళ్లా. ఆయనకి నా గొంతు నచ్చడంతో అసిస్టెంట్ గా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఒక పక్క ఆర్టేగా చేస్తూనే ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరా. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘గోపీ గోడ మీద పిల్లి’ సినిమాతోనే ప్లేబ్యాక్ సింగర్‌గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ ప్లెయ్యా. దాదాపు ఏడేళ్లు అసిస్టెంట్ గా పనిచేస్తూనే ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ కి పాటలు పాడా. తర్వాత సింగింగ్ లో బిజీ కావడంతో కోటి గారి దగ్గర ఉద్యోగం మానేశా.

పాడిన పాటల్లో మీకు ఫేవరెట్ సాంగ్స్ ? నచ్చినవి..
నచ్చనవి అంటూ ఏం లేవు. నేను పాడిన అన్ని పాటలూ నాకు ఇష్టమే. మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్న ట్యూన్ ని ప్రజెంట్ చేయడానికి చాలా కష్టపడతా. సిచ్యుయేషన్, ఎక్సెషన్ కి తగ్గట్టు భావాన్ని అర్థం చేసుకుని పాట పాడతా. ఒకటికి పదిసార్లు రిహార్సల్స్ చేస్తా… అందుకని నేను పాడిన ప్రతి పాటా నాకు ఇష్టమే. ఇప్పటివరకు సినిమా, భక్తి గీతాలు కలుపుకుని 1500లకి పైగా పాడా. అవన్నీ నాకిష్టమే.

ఎప్పటికీ మర్చిపోలేని ప్రశంస?
ఓ ఇంటర్వ్యూలో ఎస్పీబీ గారు “శ్రీకృష్ణ పాటలంటే ఇష్టం” అని చెప్పారు. అంత గొప్ప సింగర్ నోటి నుంచి నా పేరు రావడాన్ని మించిన ప్రశంస ఇంకేం ఉంటుంది. అలాగే ఇతర దేశాల్లో బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గార్లతో కలిసి స్టేజ్ పంచుకున్నా. అప్పుడు చాలాసార్లు మర్చిపోలేని కాంప్లిమెంట్స్ ఇచ్చారు వాళ్లు.

మ్యూజిక్ డైరెక్షన్ చేయాలనే ఆలోచనేమైనా ఉందా?
ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. నాకు తెలిసీ భవిష్యత్తులో రాదు కూడా. అది చాలా క్రియేటివ్ జాబ్. పాటలను ఎంజాయ్ చేయడం మాత్రమే నాకు తెలుసు. వీలైనన్ని మంచి పాటలు పాడాలి. సింగర్‌గా ఇండస్ట్రీలో నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి. అదే నా గోల్.

ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
నాకు లైఫ్ ఇచ్చిన కోటి, కీరవాణి, ఇళయరాజా, రెహ్మాన్, విద్యాసాగర్ గారు అందరూ ఇష్టమే. వీళ్లలో ఎవరి ప్రత్యేకతలు వాళ్లకున్నాయి. ఇళయరాజా గారి క్లాసిక్ ట్యూన్స్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. ఎ.ఆర్. రెహ్మాన్ గారి పాటలు నా ఆ లైట్ ఫేవరెట్. కీరవాణిగారి మ్యూజిక్ కూడా రోజూ వింటా. ఇక కోటిగారి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పగలను.

తోటి సింగలో ఎవరు బెస్ట్ అంటే ఎవరి పేరు చెప్తారు?
హేమచంద్ర గొంతంటే నాకు చాలా ఇష్టం. తన వాయిస్ మాడ్యులేషన్స్, ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగుంటాయి. నిజం చెప్పాలంటే తన గొంతు నన్ను చాలా ఇన్ స్పైర్ చేస్తుంటుంది. తన పాటలు రెగ్యులర్‌గా వింటా. ఈ విషయం చందుకి కూడా చాలాసార్లు చెప్పా. నా తోటి సింగర్స్ పాడిన పాటలు నచ్చితే వెంటనే ఫోన్ చేసి పాట బాగా వచ్చిందని చెప్తా.

చేజారిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
చాలానే ఉన్నాయి. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ‘ నిన్ను …చూడగానే’ సాంగ్ మొదట నాకే వచ్చింది. అప్పుడు నేను అందుబాటులో లేకపోవడంతో వేరొకరు పాడారు. ఆ పాట మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ ఫీల్ అవుతుంటా. కేవలం అదే కాదు ఊళ్లో లేకపోవడం, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల చాలా ఛాన్స్ లు మిస్ అయ్యా. మిస్ అయిన సాంగ్స్ లో సూపర్ డూపర్ హిట్ అయినవి కూడా ఎక్కువే. మ్యాజిక్ ఎఫ్.ఎమ్ లో ఆర్జీగా చేస్తున్నారు కదా! దాని గురించి? చిన్నప్పుడు విజయవాడ ఆకాశవాణిలో అనౌన్సర్‌గా పనిచేశా. దానివల్ల చిన్నప్పట్నించే రేడియోతో నాకు ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. అందుకే సింగర్‌గా క్లిక్ అయ్యాక కూడా రేడియోని వదిలిపెట్టలేదు.మ్యాజిక్ 106.4 ఎఫ్ ..ఎమ్ మార్నింగ్ ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ‘ఉదయరాగం’ అనే షో చేస్తున్నా.
రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ‘గీతాంజలి’ అనే మరొక షో చేస్తున్నా.

ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఒకవేళ సింగర్ కాకపోయుంటే ఏ ప్రొఫెషన్లో ఉండేవాళ్లు?
కాస్త ఖాళీ దొరికితే చాలు ప్రశాంతంగా నిద్రపోతా. రకరకాల వంటలు ట్రై చేసి ఇంట్లో వాళ్లకి తినిపిస్తా. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. వెరైటీ మొక్కకనిపిస్తే వెంటనే నా గార్డెన్ లోకి తెస్తా. ఫ్రెండ్స్లో సరదాగా టైం స్పెండ్ చేస్తా. సినిమాలు చూస్తా. సింగర్ కాకపోయుంటే లెక్కల మాస్టారు అయ్యేవాడ్ని, ఎమ్మెస్సీ ఉంది కదా. కాలేజీలో పాఠాలు చెప్తుండేవాడ్ని.

ప్రస్తుతం ఏ సినిమాలకి పాడుతున్నారు?
రిలీజ్ కి రెడీగా ఉన్న ‘మిండియా’ సినిమాలోపాడా. . మరికొన్ని ప్రాజెక్ట్ చేతిలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ వివరాలేం చెప్పలేను. కానీ, అందరినీ అలరించే పాటలతో మీ ముందుకు అతి త్వరలో వస్తా.
– ఆవుల యమున

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap