సు ‘స్వర ‘ శృతి రంజని

పాటల మాధుర్యంలో ముంచెత్తుతున్న విజయవాడ గాయనీమణి శ్రుతి రంజని

అమ్మానాన్న ఇద్దరూ కర్ణాటక సంగీత విద్వాంసులే. అమ్మ.. మాటల ప్రాయం నుంచే పాటలు నేర్పిస్తే, పల్లవించిన శ్రుతి గానానికి సుధా మాధుర్యాన్ని అద్ది, మెలకువలతో కూడిన గాత్ర మెరుగులు దిద్ది సంగీతంవైపు అడుగులు వేయించారు నాన్న. చదువుతో పాటు కర్ణాటక సంగీతం నేర్పిస్తూ శ్రుతి, లయ, ఆలాపనతో పాటు భక్తిని, భావాన్ని సమపాళ్లలో రంగరించి, స్వర మాధుర్యాన్ని వినిపించి ప్రోత్సహించారు. అమ్మానాన్నతో శాస్త్రీయ వేదికలపై కచేరీలు చేస్తూ, కళాశాల, టీవీ షోల్లో సినిమా గానంచేస్తూ శాస్త్రీయ, మోడరన్, సినీ సంగీత రంగంలో నేర్పరిగా నిలిచిన శ్రుతి రంజని పాటల కబుర్లు 64కళలు.కాం పాఠకులకోసం…  ఆమె పేరే శ్రుతి రంజని. శ్రుతిపక్వమైన గాత్రంతో జనరంజకం చేయటం ఆమెకు బాగా తెలుసు. అమ్మ మోదుమూడి అంజని, నాన్న సుధాకర్.. ఇద్దరూ సంగీతం విద్వాంసులే. ఎంతోమందికి శిక్షణ ఇచ్చి సంగీత రంగంలో మంచి గాయకులుగా ఎదిగారు. ఎనిమిదో తరగతి చదివే సమయంలో కళాదర్శిని నిర్వహించిన సంగీత పోటీల్లో ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ చేతులమీదుగా ప్రథమ బహుమతిని అందుకుంది. మరో పోటీలో మిక్కిలినేని రాధాకృష్ణ నుంచి బహుమతి అందుకుని వారి ప్రశంసలు అందుకుంది.

ఆల్ ఇన్ వన్
ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా కర్ణాటిక్ మ్యూజిక్ పూర్తిచేసింది శ్రుతి రంజని. చదువు, సంగీతం సమపాళ్లలో నేర్చుకుంటూ కేఎల్ యూనివర్సిటీలో 2015లో బీటెక్ బయోటెక్నాలజీ పూర్తి చేసిన శ్రుతి రంజని మరోవైపు ఐఎఎస్డీ సంస్థలో 2016లో ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా చేశారు. గాయనిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా, సంగీత బాణీలు సమకూర్చే కంపోజర్‌గా పనిచేస్తూ మరిన్ని మెలకువలు తెలుసుకునేందుకు హైదరాబాద్ బ్రదర్స్ సంగీత విద్వాంసుడు ధరూరి రాఘవాచారి వద్ద శిక్షణ తీసుకుంటోంది. తెలుగునాటే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 150 వేదికలపై బృంద, సోలో గానాలను వినిపించి ప్రశంసలు అందుకుంది. ఆల్ ఇండియా రేడియో జాతీయ సంగీత పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుంది. బీ గ్రేడ్ ఆర్టిస్టుగా అర్హత సంపాదించుకుంది. దూరదర్శన్లో ‘స్వర సమరం’, ఎస్వీబీసీ చానల్ లో ‘స్వరరాగ సుధ’ పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచింది. ‘పాడుతా తీయగా’ బృందం నిర్వహించిన పోటీల్లో ‘వాయిస్ ఆఫ్ కృషా’ టైటిల్‌ను అందుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే నాదనీరాజనంలో, ప్రముఖ చానల్స్ నిర్వహించే మ్యూజిక్ కాంపిటీషన్లలో ప్రతిభ కనబరిచింది. సినీ నేపథ్య గానం బీ.టెక్. పూర్తి చేసిన శ్రుతి రంజని ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ నిర్వహించిన ఆడిషన్స్ లో పాల్గొని ‘హలో’ అనే సినిమాలో ‘మెరిసే మెరిసే నా కళ్లలో ఏదో మెరిసే’ పాట పాడే అవకాశం చేజిక్కించుకుంది. ఆ తర్వాత మరో సంగీత దర్శకుడు తమన్ వద్ద ఆడిషన్స్ లో పాల్గొని ‘మిస్టర్ మజ్నూ ‘ సినిమాలో హే నేనిలా.. నీతో నేడిలా’ అనే పాటను పాడింది. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఆమెతో తమిళంలో రెండు సినిమాల్లో పాటలు పాడించారు. ఆ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గ్రూప్లో మ్యూజి! కంపోజ్ అండ్ సింగింగ్ లో కలిసి పనిచేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాక చేసినమ్యూజిక్ లోనూ పనిచేశారు. ముళ్లపూడి వెంకటరమణ తిరుప్పావై కీర్తనలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కీరవాణి, మాధవపెద్ది, శ్రీలేఖతో కంపోజ్ చేసి పాడుతున్నారు. వీరితో పాటు ‘గుహలోన నిదురించు సింహ రాజమా’ అనే కీర్తనను శ్రుతి రంజని కంపోజ్ చేసి గానం చేసింది. ‘బదులు నీవే శంకరీ..’ అనే ఆల్బమ్ లోనూ ఆమె భక్తి మధుర గీతాలు పాడారు.

-శ్రీనివాస రెడ్డి (9885864418 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap