(ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డుతో ఘన సన్మానం)
బాలీవుడ్ గాయని అనురాధ పౌడ్వాల్ హైదరాబాద్ వచ్చారు చాలా కాలం తరువాత. రవీంద్రభారతిలో రెండు పాటలు పాడమని కోరితే, పది పాటలు పాడారు. ఇప్పటికి స్వరంలో మెలడీ మంత్రం ఏమాత్రం తగ్గలేదు. తన తొలి చిత్ర రంగ ప్రవేశం అభిమాన్ లో పాడిన శ్లోకంతో ఆరంభించి అన్ని జోనర్స్ టచ్ చేస్తూ ఆలపించి సంగీతం లో తనకున్న అపార ప్రావీణ్యాన్ని పట్టును చూపించి స్టాండింగ్ వోయేషన్ అందుకున్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, తిరుమల బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతి లో ఈ వేడుక జరిగింది. బాలీవుడ్ తో పాటు వివిధ భాషల్లో 9000 పాటలు, వేలాది భజన గీతాలు పాడిన అనురాధ పౌడ్వాల్ ను ప్రైడ్ ఆఫ్ ఇండియా పురస్కారంతో సత్కరించారు.
ఈ సందర్భంగా నేను ఆమెతో కాసేపు మాట్లాడటం జరిగింది. ఆమె దగ్గర మూడు గంటలు పైగా వున్నాను. అనురాధ మొండిది. చిన్న పిల్లల్లా చిన్న చిన్న విషయాలకే అలుగుతుంది. ఆమె అనుకున్నట్లుగా జరగాలి అన్నీ. ఏమాత్రం ఆటు ఇటు అయినా ఇర్రిటేట్ అయిపోతోంది. వెంటనే మూడీ అయిపోతోంది. ఫ్రస్ట్రేషన్ ఏదో పాపం. ధ్యాస ఎక్కడో ఏమో. ఏవో ఆలోచనలు ఆమె చుట్టూ. స్థిమితంగా లేనే లేదు. మీడియా వారికి సరిగా సమాధానాలు కూడా ఇవ్వలేదు. నవ్వు లేదు అంతా చిరాకు చిరాకు. ఎంతయినా లత, ఆశా భోంశ్లే లాంటి మేరు శిఖరాలను ఢీ కొట్టిన స్వరం కదా. ఆమాత్రం పొగరు ఉండాల్సిందే. బాలీవుడ్ లో లతా మంగేష్కర్ ఏక ఛత్రాధిపత్యానికి తూట్లు పొడిచి విజయ బావుటా ఎగురవేసిన అద్భుత స్వరం అనురాధ పౌడ్వాల్… ఆమాత్రం మొండితనం ఉండకపోతే ఎలా. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. ఎన్నో సింగిల్ కార్డ్ మూవీస్. మరి ఆ మాత్రం ఉండొద్దా? అలా అని మన బాలు గారిలా డబ్బు మనిషి కూడా కాదు. బెంగళూరు నుంచి నలుగురు వాయిద్య కళాకారులను ఆమె డబ్బులిచ్చి తెప్పించుకున్నారు. అంతెందుకు సూర్యోదయ ఫౌండేషన్ స్థాపించి వినపడని వారికి హియరింగ్ కిట్స్ ఉచితంగా వేలాది మందికి అందిస్తున్నారు. ఈ విషయం మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి చెప్పగానే ఆయన సంతోషించి జూన్ 3న హైదరాబాద్ లో ఆమె ఫౌండేషన్ ఆధ్వర్యంలో 250 మందికి కిట్స్ ఇద్దాం అని స్వయంగా అనురాధ తో హరీష్ రావు చెప్పి అభినందించారు.
బాలీవుడ్ లో ఒక సునామి సృష్టించిన స్వరం ప్రస్తుతం భక్తి గీతాలకే పరిమితం అయ్యిందేమిటి అని అడిగాను… “ఎవరైనా చివరకు భక్తి మార్గం లోనే నడవాలిగా” అని సీరియస్ గా సమాధానం ఇచ్చారు అనురాధ. నా పేరు మహ్మద్ రఫీ అన్నాను, “అందుకే మాట్లాడుతున్న” అన్నారు నవ్వుతూ. బాలీవుడ్ బ్రేక్ తీసుకోవడం బాధ అనిపించలేదా అన్నాను. తప్పటడుగులు చేసినప్పుడు తిప్పలు తప్పవుగా అని సమాధానం. అవకాశం వస్తే మళ్ళీ పాడతారా సినిమాలో అని అడిగాను. లేదు, భక్తి గీతాలకే జీవితం అంకితం అని వివరించారు. పాటలే తనకు నిషా అని, ఒంటరిగా వున్నప్పుడు కూడా పాడుకుంటూనే ఉంటానని చెప్పుకున్నారు. ఏ రాష్ట్రం వెళ్లినా అభిమానుల ప్రేమ అనురాగాలు తనకు సంతృప్తిని ఇస్తాయని చెప్పారు. తెలుగులో పాడిన సాయి దివ్యరూపం పాట పాడి వినిపించారు. సుశీల, జానకి తనకు మంచి మిత్రులు అని, ఎస్ పి బాలుతో కలసి పాడాను అని, అయన చనిపోయినప్పుడు చాలా బాధ పడ్డానని గుర్తు చేసుకున్నారు. ఆది శంకరచార్య ఆల్బమ్ రూపొందిస్తున్న, మే నెలలో హైదరాబాద్ లో విడుదల చేస్తానని చెప్పారు.
నేను సభా సమన్వయం చేసిన అనురాధ పౌడ్వాల్ సత్కార సభలో శాసన సభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, సీల్ వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు, తిరుమల బ్యాంక్ చైర్మన్ ఎన్. చంద్రశేఖర్, సమాజ సేవకులు కొత్త శ్రీనివాస్, శ్రీమతి కొత్త కృష్ణవేణి, తాటికొండ పట్టాభి, లయన్ జి. హనుమంతారావు, ఆదర్శ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కుసుమ భోగరాజు, సీనియర్ పాత్రికేయులు టి. జితేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నవరస గాయని శ్రీమతి ఆమని సారధ్యంలో మద్దెల శివకుమార్, సుభాష్, శ్రీమతి శ్రీదేవి, శ్రీమతి స్వర కళ్యాణి తదితరులు శోభన్ బాబు సినిమా పాటలతో అలరించారు. తులసీ రామ్ వ్యాఖ్యానం అదనపు ఆకర్షణ. శాసన మండలి, శాసన సభ అధిపతులు ఇద్దరూ పాల్గొన్న తొలి సాంస్కృతిక వేదిక ఇదే కావడం గమనార్హం. వారిద్దరినీ ఒకే వేడుకకు తీసుకు రావడం శృతిలయ ఆమనిగారికే సాధ్యం. ఆమని గారికి అభినందనలు.
- డాక్టర్ మహ్మద్ రఫీ
ఫోటోలు : శ్రీ గిరి