ఉద్దండం పుల్లయ్య స్వామి (52) గారు, సాయి దత్త ఆర్కేడ్, హిమాయత్ నగర్, హైదరాబాద్.
చదువుపరంగా బి.ఎ., బి.ఎఫ్.ఎ (జె.యన్.ఎ & యఫ్.ఎ. యూనివర్సిటీ).
“సిరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ పేయింటింగ్ స్వామి గారంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో తెలయని వారుండరు. “సిరి అంటే స్వామి, స్వామి అంటే సిరి” అన్నంతగా కళాకారులలో ముద్ర వేసుకున్నారు. స్వామి గారికి చిత్రకళ పట్ల చిన్నతనంలో కలిగిన ఆసక్తే తనను కళాకారుడిగా నిలబెట్టిందంటారు. ఐదవ తరగతిలోనే దృశ్యాన్నో, సినిమా పోస్టర్ నో, దేన్ని పడితే దాన్ని, ఎక్కడపడితే అక్కడ బొమ్మలు గీయడం అలవాటుగా చేసుకున్నారు. అది కాగితం మీద పెన్సిల్/పెన్నుతో కావచ్చు, గోడమీద బొగ్గుతో కావచ్చు, మట్టిలో పుల్లతో కావచ్చు.
స్టిల్ లైఫ్ పేయింటింగ్స్, టెక్చర్, అబ్ స్ట్రాక్, స్కెచెస్, చార్ కోల్, క్లే, ల్యాండ్ స్కేప్ మొదలగు మాద్యమాలతో చిత్రకళను వేస్తుంటారు. చదువుకు చిత్రకళ ఏ మాత్రం ఆటంకం కాదంటారు స్వామి గారు. 1982 సంవత్సరం నుండి ఈ కళారంగంలో రాణిస్తున్నారు.
నేటి కంప్యూటర్ యుగంలో క్షణానికో కళారూపాన్ని ఉత్పత్తి చేసే కాలంలో కూడా, స్వామి గారు ఒక్క పోర్టయిట్ ను తీర్చిదిద్దేందుకు నెలల తరబడి శ్రమించే ఆయన దీక్ష-పట్టుదలను చూస్తే ఆశ్చర్యం పోవాల్సిందే. కాలం ఒడిదుడుకులు పడ్డా, కళ శాశ్వతమని, సాంకేతిక ఎంత వృద్దిచెందినా, కళలోని విలువలు తరిగిపోవనీ నమ్మే స్వామి గారు, ఈ కాలపు చిత్రకారులలో కనిపించని అరుదైన వ్యక్తి. మరో విషయం ఏమంటే, స్వామిగారి మోములో ఎప్పుడు చూసినా చిరునవ్వు గొప్ప ఆభరణం వంటిది. వీరిని చూసిన ప్రతివారు స్వామిగారితో ఏదైనా పలకరించాలని అనుకుంటారు. అలాంటి మృదుస్వభావి.
చిత్రకళలో ప్రముఖ చిత్రకారుడు దాసరి యానాదిరావు గారి దగ్గర శిష్యరికం చేసి, ఆ తర్వాత హైదరాబాద్ లో జే.యన్.టి.యూ లో పేయింటింగ్ అప్లై కోర్సులో డిగ్రీ పూర్తిచేసి, కళారంగాన్నే ఊపిరిగా మలచుకున్నారు.
ఎన్నో ప్రభుత్వ, ప్రవేటు రంగాలకు కళాసేవగా, ఎంతోమంది మహనీయులు, సినీనటులు అక్కినేని నాగేశ్వరరావు గారివే యాభై పేయింటింగులు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హౌస్ లో వివేకానందుని చిత్రపటం, రవీంద్రభారతిలో రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్ బాలభవన్ లో నెహ్రూ చిత్రపటం, హైకోర్టులో న్యాయమూర్తుల తైలవర్ణ చిత్రాలు, అనేక సంస్థలకు, ప్రముఖ వ్యక్తులకు చిత్రాలను రూపొందించారు. చిత్రకారునిగా పేరు ప్రతిష్టలతోపాటు, పలువురి అభినందనలు, ప్రశంసలు, పురస్కారాలు పొందారు.
చిత్రకళనే జీవనాధారంగా ప్రవృత్తినే వృత్తిగా చేపట్టినా, కమర్షియల్ ఆర్టిస్టుగా రాణిస్తూ, తర్వాత గొప్ప కళాకారుడిగా ఎదిగారు స్వామి గారు. దీనికి కారణం తనజీవిత భాగస్వామి శ్రీమతి శివకుమారి సహకారమే అంటూ ఓరగా నవ్వుతూ అన్నారు స్వామిగారు. కారణం శ్రీమతి శివకుమారి గారు కూడా ఆర్టిస్టు కావడమే.
పోర్ట్రైయిట్ చిత్రీకరణలో సాటిలేని మేటిగా నిలిచారు. వీరు రూపొందించే చిత్రాలలో రవివర్మ, వడ్డాది పాపయ్యల ప్రభావం కొంత కనిపిస్తుంది. మొదట్లో ఏదో చిరు వుద్యోగం చేసినా, ఆ తర్వాత కళపై మక్కువతో పూర్తిగా కళారంగంలోనే జీవిస్తున్నారు.
తనకళను తనతోనే పరిమితం కాకుండా పదిమందికి భోదించాలనే తపనతో హిమాయత్ నగర్ లో హెడ్ ఆఫీసుగా “సిరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ పేయింటింగ్” పేరుతో 1993 సంవత్సరం నుండి నడిపిస్తున్నారు. మరియు బ్రాంచ్ ఆఫీసుగా బంజారాహిల్స్ లోను ఏర్పాటు చేసారు. ఇప్పటికే ఎన్నో వేలమందికి వయస్సుతో నిమిత్తం లేకుండా శిక్షణ తరగతులు ఇస్తున్నారు.
స్వామి గారు కళాప్రయాణంలో వెయ్యకు పైగానే కళాఖండాలను రూపొందించారు. అలాగే ఇంచుమించు ఆ మొత్తం అన్నీ అమ్ముడు పోయాయి. మూడుసార్లు సోలోగానూ, అరవైసార్లు గ్రూప్ లో చిత్రకళా ప్రదర్శనలు పాల్గొన్నారు. అవార్డులు ఇరవై ఐదు వరకూ అందుకున్నారు. ఈ కళారంగం తనకూ పూర్తిగా నూటికి నూరు శాతం సంతృప్తిగానే వుందన్నారు. ఇప్పటికే జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. భవిష్యత్ లో అంతర్జాతీయ స్థాయిలో ఇంకా గుర్తింపు రావాలని ఆశయంగా చెప్పారు.
చివరిగా “ఈరోజులలో కళలకు గుర్తింపు వుంది. అనేక రంగాలలో, అనేక సంస్థలలో ఆర్ట్ అవసరమవుతుంది. చిన్న తరగతుల నుండి పై చదువుల వరకూ అన్నీ సబ్జట్లలోను డ్రాయింగ్స్-పేయింటింగ్స్ వేయ్యాల్సి వస్తుంది. ఇంజినీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, అప్లైడ్ ఆర్ట్స్, స్కల్పచర్ తదితర ఎడ్యుకేషనలలో ఆర్ట్ అవసరం కాబట్టీ ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలను ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు. ఈ కళారంగంలో ఉద్యోగాలు గాని, సొంతంగానైనా చేసుకునే అవకాశాలున్నాయని” తన అభిప్రాయాన్ని తెలియజేసారు.
డా. దార్ల నాగేశ్వర రావు
Amazing works, congrats Swamy garu
Wonderful paintings…
Very good art service sir. I know your SIRI art school in Hyderabad.