విజయనగరం కేంద్రంగా ‘సిరిమాను కథలు ‘

మన సంస్కృతిలో దేవతలకు కొదవలేదు. అందునా గ్రామదేవతలు మరీ అధికం. అందుకు కారణం, ప్రతికుటుంబానికి ఓ కులదేవతో, కుటుంబదేవతో ఉండడమే. ఈ గ్రామదేవతల ఉత్సవాల వెనుక అనేక విశ్వాసాలూ, కుటుంబ నేపధ్యాలూ ముడిపడి ఉంటాయి. ఇప్పటికీ ఈ విశ్వాసాలతోనే ఈ గ్రామదేవతలకు పూజలూ, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో ముక్ష్యంగా తొలేళ్ళూ, సిరిమానూ, ఉయ్యాలకంబలా, ఘాటాలూ మొదలైనవి ఉంటాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేవారు ఎంతో ఉత్సాహంతో వారి వారి విశ్వాసాలను బట్టి, కొలుచుకుంటారు. ఆ ప్రక్రియలు అనేక విధాలుగా ఉంటాయి. కొందరు ఘటాలను నైవేద్యంతో నింపి, గుడివరకూ నడచుకొంటూ వెళ్లి సమర్పించడం. కొందరు దీపాలను వెలిగించి, గుడివరకూ వెళ్లి సమర్పించడం, మరికొందరు చీరెలు సమర్పించడం, కోళ్ళూ, గొర్రెలూ బలి ఇచ్చేవారు కొందరు.
ఇదంతా ఒక తరహ అయితే, చిత్ర, విచిత్ర వేషాలు వేసుకొని ఇంటింటికీ తిరిగి మొక్కు తీర్చుకోవడం మరో తరహ. ఇలా అనేక రకాలుగా తమ భక్తి, విశ్వాసాలను చాటుకుంటారు. ఇక ఈ విశ్వాసాలూ, భక్తి విషయాలను అనుసరించి చేసే పనులలో, అనేక ఆర్ధిక అంశాలూ, మానవ సంబంధాలూ ముడిపడి వుండడం సహజం. సరిగ్గా వీటినే కధా వస్తువులుగా తీసుకొని, వి. వెంకట్రావు గారు చేసిన రచనలే ఈ కధలన్నీ.
ఈ కధలన్నీ మనం చూస్తున్న, మన చుట్టుపక్కల ఉండే కుటుంబాల నుండీ, మనుషులనుండీ తీసుకున్నవే. ఈ కధల్లోని పాత్రలన్నీ ఎప్పుడో ఒకప్పుడు మనకు ఎదురు పడినవే. మనదైన సాంస్కృతిక ప్రపంచాన్ని మనం మళ్ళీ మళ్ళీ చూస్తున్నామనిపిస్తుంది. మనకు తెలియని అనేక ఆర్ధిక సూత్రాలు ఇందులో నిఘూడంగా దాగివున్నాయి. ఈ కధలన్నిటికీ కేంద్రం విజయనగరం అమ్మవారి పండగ. ఈ పండగలో ప్రధానమైనది సిరిమాను ఉత్సవం. అందుకే ఈ సంకలనానికి “సిరిమాను కధలు” అని పేరు పెట్టాం. ఈ సిరిమాను కధలు మనలను విజయనగరం పట్టణంతో పాటు, పరిసర గ్రామాలకు కూడా తీసుకువెళ్తాయి. అక్కడి సామాజిక వాతావరణాన్నీ, సాంస్కృతిక జీవనాన్ని చూపిస్తాయి.
వెంకట్రావు గారి రచనలన్నీ, మానవ సంబందాలలోని, ఆర్థిక అంశాలను చూపించే ప్రయత్నం చేస్తాయి. అంతే కాకుండా శ్రమ దోపిడినీ, ఆర్ధిక సమానత్వ వైఫల్యాలను చర్చించేవే. పిల్లల కోసం వ్రాసే కధల్లోకూడా, ఎంతో సరళంగా ఆర్థిక అంశాలను చెప్పగల దిట్ట ఈ రచయత వెంకట్రావు గారు. మంచి పుస్తకం ప్రచురించిన ఎన్.కె. పబ్లికేషన్స్ వారికి అభినందనలు.
-బి.ఎం.పి. సింగ్

SA:

View Comments (1)