అంతరిక్ష విహారి శిరీష

అంతరిక్ష ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా మారింది. అంతరిక్షంలోకి మనుషులను పంపి, అక్కడనుండి భూగోళపు రూపురేఖలు గమనించి తిరిగి కిందికి వచ్చే సౌకర్యం కొన్ని ప్రైవేటు సంస్థలు చేపట్టాయి.

అందులో ఒక సంస్థ వర్జిన్ గెలాక్టిక్. ఆ సంస్థ అంతరిక్షంలోకి పంపుతున్న బృందంలో తెలుగు అమ్మాయి బండ్ల శిరీష వుండటమే ఒకవిశేషం. భారత సంతతికి చెందినకలునా చావ్లా 1997లో కొలంబియా స్పేస్ షటిల్ ద్వారా అంతరిక్షయానానికి ‘నాసా’ బృందంలో వెళ్ళగా ఇప్పుడు అవే మూలాలు వున్న మరో మహిళ శిరీష వెళుతుంది. న్యూమెక్సికో నుండి ‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ ప్రయోగించే వాహక నౌకలో ఆ సంస్థ – వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సతో పాటుగా వెళుతున్న ఆరుగురు బృందంలో ఆ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో పనిచేస్తున్న బండ్ల శిరీష మూలాలు గుంటూరు జిల్లాలో వున్నాయి. అమ్మవైపు వారిది తెనాలి, చీరాల ప్రాంతం కాగా నాన్నవైపువారిది పల్నాటిసీమలోని పిడుగురాళ్ళ.

శిరీషకు ఆరేళ్ళ వయసులో తల్లిదండ్రుల మకాం టెక్సాస్ రాష్ట్రంకి మారింది. అక్కడి హాస్సన్ నగరంలో లోనే అంతరిక్ష కేంద్రంవుంది. కాబట్టి ఆ కేంద్రాన్ని ఒకసారి దర్శించే అవకాశం వచ్చింది.
అందరు పిల్లలులాగానే శిరీషకూడా ఆకాశం వైపు అలా చూస్తూ అందులోకి ఎగిరిపోయే కలలు కన్నది. ఆ కలలు నిజంచేసుకోవాలంటే ఏకైకమార్గం ఆ దేశ అంతరిక్ష ప్రయోగంలోపాల్గొనే అర్హత సంపాదించాలి. ఇంజనీరింగ్ లో డిగ్రీ, విమాన పైలెటింగ్ లో నైపుణ్యం కలిగినవారి నుండే వ్యోమగాములను చివరిగా ఎంపికచేస్తారు. కాబట్టి తాను కూడా ఎప్పటికైనా వ్యోమగామి కావాలనుకుంది. కాని పరిస్థితులు అనుకూలించలేదు. హైస్కూల్ స్థాయి చదువులో వున్న సమయంలోనే శిరీషకి కంటిచూపు సమస్య ఏర్పడింది. కంటిచూపు పర్ఫెక్ట్ గా లేనివారికి పైలెట్ ఉద్యోగమే ఇవ్వరు. ఇక ‘స్పేస్’లోకి వెళ్ళే అవకాశం ఎవరిస్తారు!

అనుకున్నది సాధించలేకపోతున్ననీరసం. కలలు సాకారం కాలేదని కుంగిపోకపోవటమే బండ్ల శిరీష జీవితాన్ని మలుపు తిప్పింది. ‘నాసా’లో అవకాశాలు దొరకనంత మాత్రాన – అంతరిక్షంలోకి వెళ్ళటం ఆగిపోవని, ఇతర మార్గాలు ఇప్పుడు వున్నాయని అర్థం చేసుకుంది. అమెరికాలో అంతరిక్షయానంకి ప్రైవేట్ సంస్థలు సిద్ధమయ్యాయి. వాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రైవేట్ సంస్థల ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళేందుకు అవసరమైన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్స్ లో చేరింది. ఇంజనీరింగ్ విద్యార్థిగా వుంటూనే ఒకసంస్థలో శిక్షణ, మరో సందర్భంలో భూ ఆకర్షణ శక్తికి ఆవల ప్రయాణం చేయటం ముగించింది.

సాంకేతిక అంశాలలో పరిజ్ఞానంతోపాటుగా వ్యాపార నిర్వహణ అంశాలలో కూడా నైపుణ్యం వుండటం అవసరమని భావించి శిరీష ఎమ్.బి.ఎ.లో చేరింది. ఆ ఎమ్.బి.ఎ. కోర్స్ కూడా స్పేస్ ఇండస్ట్రీ . అలా ఇంజనీరింగ్, ఎమ్.బి.ఎలు పూర్తి చేసిన శిరీష కమర్షియల్ స్పేస్ ఫెడరేషన్లో ఉద్యోగిగా చేరింది. అంతరిక్ష విధానాల మీద అవగాహన పెంచుకుంది శిరీష కమర్షియల్ స్పేస్ ఇండస్ట్రీ విధానాన్ని, ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ అంశాలలోనూ పరిజ్ఞానం సంపాదించింది.

2015 నాటికి వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలో ఉద్యోగి అయింది. పూర్తిగా అంతరిక్ష పర్యటన మీద దృష్టి పెట్టిన సంస్థ. విమానంలో ప్రయాణీకులను గాలిలోకి తీసుకు వెళతారు. అంతరిక్షంలోకి అదేవిధంగా ప్రయాణీకులను తీసుకువెళ్ళి తిప్పి తీసుకువస్తారు.

సుమారు 85 నుండి 90 కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలో తిరుగుతూ అక్కడ కనిపించే అందాలను తిలకించటం, భూగోళపు రమ్యరూపాన్ని చూసి అబ్బుర పోవటం చెయ్యగలరు పర్యాటకులు.
ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పర్యాటకం. అంతరిక్షంలోకి వెళ్ళటానికి తగిన ఆరోగ్యం, శారీరక దృఢత్వం, సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం. అవన్నీ ముందుగా తమ సంస్థ సభ్యులకు అనుభవంలోకి తెచ్చి, వారి అనుభవాలకు, తగిన జాగ్రత్తలు జతచేసి అంతరిక్ష పర్యటనారంగాన్ని కొత్త పుంతలు తొక్కించాలన్నది ఆ సంస్థ ఆలోచన. తొలిగా వెళ్ళే ఆ బృందంలో ఆ సంస్థ అధినేత వున్నారు.

శిరీష సాధించిన విజయానికి తెలుగు వారంతా గర్విస్తున్నారు.
తల్లి అనూరాధ, తాత రాపర్ల వెంకట నరసయ్య. అమ్మమ్మ రమాదేవి. అమ్మమ్మ ఇంటికి రెండేళ్ళ క్రితంకూడా వచ్చి వెళ్ళింది. గలగలా తెలుగులో మాట్లాడే బండ్ల శిరీష చాలా సరదా మనిషి అంటారు తాతయ్య. చిన్నప్పటినుండి వచ్చిన ధైర్యం ఆమెను ముందుకు నడిపింది.

నడకలో తొలి అడుగులు వేసిన తెనాలి నుండి ఇప్పుడు అంతరిక్ష ప్రయాణంవైపు వెయ్యటం చాలా గర్వంగా వుందని వారి కుటుంబ పెద్దలు చెపుతున్నారు. ముత్తాతల కాలం నుండి తెనాలితో సంబంధాలున్నాయి. తెనాలి రాజకీయాలలోనూ వారి ముత్తాతకు ప్రవేశముందట. ఐతే శిరీష, వారి తల్లిదండ్రులది వైజ్ఞానిక ప్రపం చం. తండ్రి వృక్షశాస్త్రం, వైరాలజీలో పరిశోధ కుడు. తల్లి విద్యాధికురాలు. వారందించిన ప్రోత్సాహం వల్లనే శిరీష ఈ స్థితికి చేరగలిగింది. ‘నువ్వు ఏదైనా చేయగలవు’ అనే ప్రోత్సాహం, కలను నిజం చేసుకోవాలన్న బలమైన తపన వుంటే ఎవరైనా దేనినైనా సాధించగలరనేది బండ్ల శిరీష యువతకు అందిస్తున్న సందేశం.
నిజానికి ప్రైవేట్ సంస్థలు చేయించే అంతరిక్ష ప్రయాణం చాలా తక్కువసేపే. బండ్ల శిరీష ప్రయాణం సమయం పదినిమిషాలే. అందులో మూడు నిమిషాలే భారరహిత స్థితిలో వుంటారు.

ఐతేనేం ఆ తక్కువ సమయంలోనే 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరి తిరిగి కిందికి వస్తారు’నాసా’వారి స్పేస్ షటిలాగానే వీరి వాహననౌక రన్‌వే మీద దిగుతుంది. ఆ నౌకలోనుండి బయటకు అడుగు పెట్టి తెలుగు జాతి ధైర్యాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళి, ప్రదర్శించి, తిరిగి వచ్చిన తొలివనితగా బండ్ల శిరీష చరిత్రలో నిలుస్తుంది.
స్వాతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap