తెలుగు పాటల ‘సిరి’ వెన్నెల సీతారామ శాస్త్రి

సిరివెన్నెల (చేంబోలు) సీతారామశాస్త్రి కాకినాడలోని సాహితీ మిత్రబృంద సభ్యులకు తను రాసిన కవితలను పాడి వినిపిస్తుండేవారు. అక్కడే లెక్చరర్ గా పనిచేసే ఎర్రంశెట్టి సత్యారావు సీతారామశాస్త్రిని సినీ సంభాషణల రచయిత ఆకెళ్ళకు పరిచయం చేశారు. ‘శంకరాభరణం’ సినిమా శతదినోత్సవ సందర్భంగా సీతారామశాస్త్రి రచించిన గంగావతరణం గేయ కవితను వినిపించిన సీతారామశాస్త్రిని దర్శకుడు విశ్వనాథ్ ప్రశంసించారు.

ఆయన ‘సిరివెన్నెల’ సినిమాకు శ్రీకారం చుట్టుతూ నూతన గేయరచయితను పరిచయం చేయాలని సంకల్పించినప్పుడు గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం విశ్వనాథ్ కు సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ గుర్తుచేసి, ఆ కవితను పాడి వినిపించడం…. విశ్వనాథ్ అది విని పులకించిపోయి ‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలన్నీ సీతారామశాస్త్రిచేత రాయించడం చకచకా జరిగిపోయాయి. సిరివెన్నెలను ప్రేక్షకులకు పంచిన చేంబోలు సీతారామశాస్త్రి ఇంటిపేరు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గా మారిపోయింది.

నాదమయం సిరివెన్నెల కలం…

సినిమా పాటలు తెరమీద చూస్తూ వింటుంటే ఆసక్తిని కలిగిస్తాయి. కానీ ‘సిరివెన్నెల’ సినిమా పాటలు బయట వింటున్నా అవి సందేశాత్మకంగాను, శ్రావ్యంగానూ వుంటాయి. అశ్లీల గీతాలకు సిరివెన్నెల ఆమడ దూరంగా వుంటారు. అందుకే ఆయన పాటలు అధిక సంఖ్యలో నంది బహుమతులకు అర్హత సాధించాయి. సిరివెన్నెల చిత్రంలో ఆయన రాసిన తొలిపాటను గమనిస్తే కవితా ధోరణి గోచరిస్తుంది. సగటు ప్రేక్షకుడికి ఈ పాట అంతరార్ధం బోధపడకపోయినా, మహదేవన్ ఆ పాటని స్వరపరచిన తీరు జనబాహుళ్యం లోనికి చొచ్చుకుపోయింది. ‘’విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం… ప్రాణనాదులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం’’… అంటూ పల్లవిలో ఓంకార నాద ఆవిర్భావాన్ని శాస్త్రి కవితా ధోరణిలో వర్ణించారు. అందులో, అంధుడైన కథానాయకుని మనోనేత్రానికి విశ్వసృష్టికి మూలాధారమైన ఓంకారనాదం సాక్షాత్కారమైంది. ‘‘ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రుల పైన… జాగృత విహంగ గతులే వినీల గగనపు వేదికపైన … పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా’’ అంటూ ప్రధమ చరణాన్ని భావోద్వేగంతో వర్ణించారు. తూర్పుదిక్కు అనే వీణకు దినకరుని కిరణాలు తంత్రులుగా మారాయని, ఆ తంత్రులను బిగించి శూన్యంతో నిండిన ఆకాశమనే రంగస్థలం మీద పక్షులు తమ రెక్కలతో ఆ తీగలను మీటుతూ కిలకిలారావాలు చేస్తుంటే, ఆ శబ్దాలు జగత్రిని చైతన్యవంతం ఛేస్తున్నాయని సిరివెన్నెల అద్భుతంగా వర్ణించారు. ఈ పాటకు సిరివెన్నెల తొలిచిత్రంతోనే నంది బహుమతి అందుకున్నారు. ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘శుభలగ్నం’ చిత్రంలో సిరివెన్నెలకు మరో నందిబహుమతి సంపాదించి పెట్టిన పాట ’’చిలకా, ఏ తోడులేక యెటేపమ్మ ఒంటరి నడక… తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశలవెనక… మంగళసూత్రం అంగడి సరుకా, కొనగలవా చెయిజారాక … లాభం యెంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక’’ అంటూ సిరివెన్నెల రచించిన సన్నివేశ సందర్భపు పాట. ధనం మీద మోజుతో తన భర్తనే అమ్ముకున్న నాయికకు కనువిప్పు కలిగించే నేపథ్య గీతమిది. పై రెండు పాటల్ని గమనించండి. సిరివెన్నెల చిత్రంలోని పాటకు, ఈ పాటకు రచనా శైలిలో యెంతో వైదిధ్యం వుంది. వాడుక భాషలో రాసిన ఈ గీతం సినిమా మొత్తానికి మకుటాయమానంగా నిలిచింది.

2004లో విడుదలైన ‘నేనున్నాను’ చిత్రం కోసం సిరివెన్నెల రచించిన ‘’ఏ శ్వాసలో చేరి గాలి గాంధర్వమౌతున్నదో… ఏ మోవిపై వాలితే మౌనమేమంత్రమౌతున్నదో… ఆ శ్వాసలో నే లీనమై నిను చేరనీ మాధవా’’ పాటలో గాయకుడైన కథానాయకుని ప్రోత్సహిస్తూ కృతజ్ఞతా పూర్వకంగా కథానాయిక సమర్పించే కవితాంజలి ఈ పాట. గాలి శ్వాసలో చేరి గాంధర్వగానం కావడం సిరివెన్నెల సృజనాత్మకతకు ప్రతీక. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రుతిలయలు’ చిత్రంలో వాగ్గేయకారుడు అన్నమాచార్యుని శైలిలో సిరివెన్నెల రచించిన ‘‘తెలవారదేమో స్వామి… నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు’’ అనే పాట. అందులో ‘‘చెలువము నెలగా చెంగట లేవని కలతకు నెలవై నిలిచిన నెలతకు .. కలల అలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి అలమేలు మంగకు’’ అంటూ అన్నమయ్య రచించిన శైలిలోనే రాయడం సిరివెన్నెల గొప్పతనం.. ఇంత గొప్పగా పాటలు రాసిన సిరివెన్నెలే 1989లో నాగార్జున నటించిన మెగా హిట్ చిత్రం ‘శివ’ లో ‘‘బోటనీ పాఠముంది మ్యాటినీ ఆట వుంది దేనికో ఓటు చెప్పరా… హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా యేది బెస్టురా’’ అంటూ ఒక వచన కవిత్వం పలికేలా సరదా పాట రాశారు. కాలేజీ విద్యార్థులు పాడుకునే ఈ పాట వింటుంటే మహాకవి శ్రీశ్రీ రచించిన ‘’రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వే లో కాంచనమాల ఎటకేగుటో సమస్య తగిలిందొక విద్యార్థికి’’ అనే సంధ్యా సమస్యలు గుర్తుకొస్తాయి. అలాంటిపాటే ఆత్రేయ శైలిని గుర్తుచేసే ‘‘అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు వుండగా… అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా’’ అంటూ అలతి పదాలతో రచించిన ‘అంతఃపురం’ చిత్రంలోని పాట. ’అల్లరి ప్రియుడు’ సినిమాలో మనసుకవి ఆత్రేయను గుర్తుచేసే ‘‘అహో! ఒక మనసుకు నేడే పుట్టినరోజు… అహో! తన పల్లవి పాడే చల్లనిరోజు… చూపులకెన్నడు దొరకనిది, రంగూ రూపూ లేని మది… రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది’’ అనేది. అయితే ఈ పాటలో సిరివెన్నెల తనదైన శైలిని వినిపించారు. ఆత్రేయలాగే సిరివెన్నెల కూడా వానపాటను రాశారు. ‘వర్షం’ సినిమాలో ‘’ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా… ఎన్నాళ్లని దాక్కున్నావే పైనా (ఆంటే ఆకాశంలో అని కవి హృదయం)… చుట్టంలా వస్తావే, చూసెళ్ళిపోతావే’’ అంటూ కొంటెగా వానను ఆటపట్టిస్తూ సాగే గీతమిది. సీతారామశాస్త్రి రచించి గానం చేసిన ఈ ప్రైవేటు గీతం వింటే కార్తిక ఏకాదశి పుణ్యదినాన కైలాసం చేరుకున్న శాస్త్రి మనోధ్యేయం గుర్తురాకమానదు. ‘’విదిలించరాదా విభో విభూది…విడిపించరాదా విరాగీ విపత్తి… కలిగించరాదా కపర్దీ విముక్తి… కనిపించలేదా ప్రభో ఈ కబోది’’ అంటూ పరమశివుని అర్ధించాడు. బహుశా అందుకేనేమో కార్తిక మాస ఏకాదశి నాడు ఆ పరమేష్టి, శాస్త్రిని కైలాసానికి తీసుకెళ్ళాడు… ముందుగా. సిరివెన్నెల ఒకానొక కవితలో ఇలా చెప్పుకున్నారు: ‘’నొప్పిలేని నిమిషమేది జననమైన, మరణమైన జీవితాన… అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు…దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది… ఆశవుంది అస్తమాను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము… ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి… ఎప్పుడూ ఒదులుకోవద్దురా ఓటమి’’. కానీ సిరివెన్నెల సంగీత సాహిత్య ప్రియులను ఓడించి తానే గెలిచాడు.

-ఆచారం షణ్ముఖాచారి

1 thought on “తెలుగు పాటల ‘సిరి’ వెన్నెల సీతారామ శాస్త్రి

  1. మంచి వివరణాత్మక విశ్లేషణ….సమగ్రంగా వివరించారు…
    *ధన్యవాదములు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap