‘సిరివెన్నెల’ తొలి పాట అనుభవం

సినిమా పేరునే తన కలంపేరుగా మార్చుకున్న ప్రముఖ సినీకవి సీతారామశాస్త్రి. తను రచించిన తొలి పాటకే 1986 లో ఉత్తమ గేయ రచయితగా నంది బహుమతి దక్కించుకున్న అద్భుత కవి సిరివెన్నెల. సీతారామశాస్త్రిని వెండితెరకు పరిచయం చేసిన ఘనత కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ది. ఈ పాటకు మరో రెండు విశేషాలు కూడా ఉన్నాయి. ఈ పాటను ఆలపించిన బాలు గారికి ఉత్తమ నేపథ్య గాయకుడుగా నంది బహుమతి లభించడం…. ప్రముఖ వేణునాద విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా ఈ పాటకు ఆద్యంతం నాద నేపథ్యాన్ని వినిపించడం ఈ విశేషాలు. సీతారామశాస్త్రి సిరివెన్నెల చిత్రానికి పాటలన్నీ రచించి సింగిల్ కార్డ్ ఎంట్రీ చేసిన గేయరచయితగా పరిచయమయ్యారు. ఈ సినిమాకు మొత్తం మీద 5 నంది బహుమతులు లభించాయి. ఈ చిత్రంలో నాయకుడు(సర్వదమన్ బెనర్జీ) అంధుడు, మంచి వేణునాద విద్వాంసుడు. అందుకే దర్శకుడు విశ్వనాథ్, హరిప్రసాద్ చౌరాసియా వాద్యసేవలను ఈ చిత్రంలో వినయోగించుకున్నారు. ఇప్పటికే మీకు ఈ పాటేమిటో తెలిసిపోయి వుంటుంది. సంస్కృత పద లాలిత్యం సంతరించుకున్న ఆ పాటే విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం… ఓం…. ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం… అనే పల్లవితో మొదలై సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం నీ గీతం అంటూ వేగం అందుకుంటుంది. ఈ పాటలోని అద్భుత చరణం ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన, జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన, పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా…అంటూ చకచకా సాగిపోతుంది. ఇప్పుడు ఈ పాట నేపథ్యాన్ని, దాని విశేషాన్ని విశ్లేషించుదాం.

సీతారామశాస్త్రికి తాత్వికధృక్పథం మెండు. ఈపాటలో విశ్వసృష్టికి మూలాధారమైన ఓంకారనాద విశిష్టతను విశద పరచారు. ఆ ప్రణవనాదాన్ని సాక్షాత్కరింపజేసే భావాన్ని అంధుడైన నాయకుడు భాహ్యేంద్రియాలకు అందని రీతిలో ఆస్వాదించగలగడం ఈ పాట అంతరంగం. ’ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన’ అనే చరణంలో అద్భుతమైన భావం స్పురిస్తుంది. తూరుపుదిక్కు (ప్రాగ్దిశ) అనే వీణకు, సూర్యభగవానుని కిరణాలను తీగలుగా బిగించి (దినకర మయూఖ తంత్రులపైన) గూళ్లనుంచి మేలుకొని ఆకాశమనే రంగస్థలం మీద పక్షుల గుంపు బారులుతీరి తమ రెక్కలను వ్రేళ్ళుగా చేసుకొని ఆ వీణినియపై పలికించే కిలకిలారావాలు, సుషుప్తిలో వున్న జగతిని మేలుకొలుపుతూ చైతన్య పరుస్తున్నాయని, అది అర్థం చేసుకుంటే విశ్వకావ్యానికి మనం భాష్యం చెప్పగలుగుతామని సీతారామశాస్త్రి తన మనోగతాన్ని ఆవిష్కరించారు. సంస్కృత పద లాలిత్యంతో నిండిన ఈ పాట సాహిత్యం అందరికీ త్వరగా అర్థమయ్యేది కాదు. అయినా ఈ పాటను ‘అభేరి’ రాగంలో మహదేవన్ స్వరపరచిన విధానమే పాటను సూపర్ హిట్ చేసింది. హరిప్రసాద్ చౌరాసియా ఈ పాటను తాపీగా షట్జమంలో ఆరంభించి బాలు ఆలాపనతో తన వేణునాదాన్ని రిషభం లోకి పయనింపజేసి టెంపో సృష్టిస్తారు. పాట ఆసాంతం చౌరాసియా వేణునాదం లీలగా వినిపిస్తూనే వుంటుంది. ఈ సినిమా హీరో అంధుడైనా మానసిక వికాసం పుష్కలంగా కలవాడనే లక్షణాన్ని ఈ పాట, సినిమాను వీక్షించే ప్రేక్షకుడికి గుర్తుచేస్తుంది. ఇక చివరి చరణం జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం- చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్యానం- అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా తెలియజెప్పే తత్వ విశేషం గమనిస్తే…. పురిటి బిడ్డడు ‘కెవ్వు’మని ఏడ్చే ఏడుపును చైతన్యం పొందిన ప్రాణం, స్పందించే జీవన నాద తరంగమే అనాది రాగమని, ఆ ఆది తాళమే అనంత జీవన వాహినిగా సాగుతూ సృష్టి విలాసాన్ని తెలియజేస్తుందని, అలాంటి చైతన్యం వున్నవాడి ‘ఉఛ్వాసం’ ఈ విశ్వరహస్యాన్ని ఆకళింపుచేసుకొని, స్పందిస్తూ నిట్టూర్పుగా కాకుండా ఒక గానంలా వెలువరించే ‘నిశ్వాసం’ అవుతుందని తన తాత్విక ధృక్పథానికి సీతారామశాస్త్రి ఈ పాటద్వారా ముగింపు పలికారు.

1980లో ‘శంకరాభరణం’ సినిమా విజయోత్సవం సందర్భంగా సీతారామశాస్త్రి ఉద్యోగ నిర్వహణలో వుంటూ ‘గంగావతరణం’ అనే గేయాన్ని రాశారు. అందులో శంకరాభరణం చిత్రనిర్మాతను భగీరతునితో పోల్చుతూ, దర్శకుడు విశ్వనాథ్ ను కళాసృష్టి కావించమని కోరగా, శంకరాభరణం రూపంలో ఆ దర్శకుడు ఆకాశగంగను సృష్టించినట్లు సాగే ఈ గేయం కళాతపస్వికి ఎంతగానో నచ్చింది. రచయిత ఆకెళ్ళ, సీతారామశాస్త్రిని విశ్వనాథ్ కు పరిచయం చేశారు. అప్పటికే సేతారామశాస్త్రి ‘భరణి’ అనే కలం పేరుతో పత్రికలకు గేయాలు రాస్తుండేవారు. గంగావతరణం గేయాన్ని విశ్వనాథ్ బాలు గారికి వినిపించి సీతారామశాస్త్రిని పరిచయం చేశారు. ఉప్పొంగిపోయిన బాలు, సీతారామశాస్త్రి భవిష్యత్తులో మెండుగా పాటలు రాయాలని, వాటిని తన గళంద్వారా సంగీత ప్రియులకు చేరువ చేస్తానని ఆశీర్వదించారు. సిరివెన్నెల చిత్రం ద్వారా శాస్త్రి గారిని సినీ గేయరచయితగా పరిచయం చేద్దామని విశ్వనాథ్ సీతారామశాస్త్రికి సినిమా పాటలు రాసే మెలకువలను తెలియజెప్పారు. సినిమాలో వచ్చే ఈ పాట నేపథ్యాన్ని వివరించి, ఆయనకు తోచిన పద్ధతిలోనే హీరో, అతని చెల్లెలు ఆలపించే సన్నివేశపు పాటగా రాయమని ప్రోత్సహించారు. పైగా, హీరో వేణునాద విద్వాంసుడు కనుక అందుకు అనుగుణంగా వుండే భాషలో స్వేచ్ఛగా పాటను రాయమని సూచించారు. ఈ చరాచర జగత్తు నిండివున్న ఓంకార నాదాన్ని సీతారామశాస్త్రి ప్రధాన వస్తువుగా ఎంచుకొని ఈ అద్భుత గీతానికి శ్రీకారం చుట్టారు. అదీ ఈ పాట విశిష్టత. తొలి చిత్రం నుంచే తాను శ్లేషతో కూడిన అశ్లీల గీతాలను సినిమాలకు రాయబోనని కరాఖండిగా ప్రకటించారు కూడా. అదే మాటను చివరిదాకా నిలబెట్టుకున్నారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

1 thought on “‘సిరివెన్నెల’ తొలి పాట అనుభవం

  1. సిరివెన్నెల ష్రిస్టికర్త ఇకలేరు. సీతారామ శాస్త్రిని కలవడానికి పయనమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap