మకుటం లేని మహారాజు – సిరివెన్నెల

మే 20 ‘సిరివెన్నెల ‘ సీతారామశాస్త్రి గారి జన్మదిన సందర్భంగా….

35 ఏళ్ళ క్రితం విధాత తలపున ప్రభవించినది… అంటూ ఆయన రాసిన మొదటి పాటతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఎంత ప్రభంజనం సృష్టించారో… ఈనాటి సామజవరాగమనా పాటతో అంతే ఉర్రూతలు ఊగించారు. ధన మాయను (చిలక ఏ తోడు లేక) ఎంత చిన్న చిన్న పదాలలో పొదగగలరో దైవ మాయని (ఆదిభిక్షువు వాడినేమి అడిగేది) కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశాలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల. మీరు ఆయన పాటలకు అభిమాని కాకపోతే తెలుగు భాషకి అభిమానులు కానట్టే…సినీకవి అనే పదం ఈయనతోనే ఆఖరు అనుకుంటారు ఆయన అభిమానులు. త్రివిక్రమ్ గారి మాటల్లో మనమంతా అర్ధరాత్రి నిదురపోతుంటే ఆయన అక్షరాలపై దండయాత్రకి బయలుదేరతారు. ఆయన స్థాయికి సినీకవిగా మిగిలిపోవడం ఆయన దురదృష్టం అయితే ఆయన పాటలు వినే భాగ్యం కలగడం మన అదృష్టం.

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా, ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అంటూ నిద్రపోతున్న సమాజాన్ని పాటల తూటాలతో చైతన్య పరచగలరు…
తెల్లారింది లెగండోయ్ కుకురుక్కో…మంచాలింక దిగండోయ్ అంటూ మనల్ని మేల్కొలపగలరు…

ఈ వేళలో నీవు, చెప్పమ్మా చెప్పమ్మా అంటోంది ఆరాటం, మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది, నువ్వు నువ్వు నువ్వే నువ్వు….అనే పాటలతో ఈయన నిజంగా అమ్మాయి మనసు లోతుల్ని చూసి వచ్చారా అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేయగలరు.
సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా అంటూ నిరాశా లోకంలో ఉన్నవారికి కొండంత బలం ఇవ్వగలరు.

స్వర్ణకమలం, స్వయంకృషి, శ్రుతిలయలు, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, శుభలగ్నం, శుభాకాంక్షలు, సింధూరం, ఖడ్గం, గమ్యం…ఇలా ఎన్నో సినిమాలలో ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే…

తెలుగు సినీ పాటల ప్రపంచంలో నిస్సందేహంగా మకుటం లేని మహారాజు ఆయన. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు…

సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీకవి, గీత రచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడుకె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమా పేరుతోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది. భారత దేశ పురస్కారం పద్మశ్రీ ఈయనను 2019 వరించింది.

SA: