ఆయన ఓ జంతు ప్రేమికుడు మూగజీవాలకు ఆపద్భాందవుడు. తను చేస్తున్న పని ప్రాణంతో చెలగాటమని తెలిసికూడా మూగ జీవాలపై తనకున్న ప్రేమతో తను ఈ పని చేస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం దగ్గరలోని పేరంపేట గ్రామానికి చెందిన క్రాంతి “Snake Saviours Society (SSS)” అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. త్రాచుపామును పట్టుకుని వాటిని జనావాసాలకు దూరంగా విడిచిపోడుతుంటాడు. ప్రజలు పాముల్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు అవి గాయపడి తప్పించుకుంటాయి. అలాంటి వాటిని ఇతను పట్టుకొని ఫస్టెయిడ్ చేస్తాడు. క్రాంతి మొబైల్ నెం. 80998 55153, 91331 27327. పేదరికంలో ఉన్న ఇతను ఇంటర్మీడియట్ వరకూ చదివాడు. చిన్నప్పటినుండి పాముల్ని పట్టుకోవాలని, చంపకూడదనే అభిప్రాయం ఏర్పడింది. కుటుంబ పోషణ కోసం ఒక న్యాయమూర్తికి డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించారు. ఆ న్యాయమూర్తి విశాఖపట్నం బదిలీ అవడంతో ఇతను కూడా విశాఖపట్నం చేరుకున్నాడు. అక్కడ ఏజెన్సీ ప్రాంతం కావడంతో, అడవులు ఎక్కువగా ఉండటంలో పాముల్ని పట్టుకోవాలన్న ఆశయానికి రూపకల్పన చేశాడు. మిత్రుల సలహా మేరకు 2009లో కేరళలో సుందరన్ అనే నిపుణుని వద్ద చేరాడు. ఆయన క్రాంతికి పాముల్ని పట్టుకోవడంలో మెళకువలను నేర్పాడు. ఆ తర్వాత క్రాంతి తన స్వంతగ్రామానికి చేరుకుని “Snake Saviours Society (SSS)” ను స్థాపించాడు. క్రాంతి పాముల్ని చాకచక్యంగా పట్టుకొని అడవుల్లో వదిలేస్తున్నాడన్న విషయం బాగా ప్రచారం జరిగింది. దీంతో డ్రైవర్‌గా పని లేనప్పుడు పాముల్ని పడుతూ, పాఠశాల, కళాశాల విద్యార్ధులకు పాములపై అవగాహన కల్పిస్తూ మూగజీవుల రక్షకునిగా మారాడు. తనకు కలిగిన ఆలోచనకు కార్యరూపం ఇచ్చి ప్రత్యక్షంగా పాముల్ని రక్షిస్తూ, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాడు. సెప్టెంబర్ 2019 వరకు 10885 పాముల్ని పట్టుకుని రక్షించాడట. వీటిలో అతి ప్రమాదకరమైన త్రాచుపాము, కట్లపాము, పొడ పాము, రక్తపింజర ఉన్నాయి. ఆహారపు గొలుసు (Food Chain) లో పాముల పాత్ర కూడా ప్రముఖమైందే అంటారు క్రాంతి. పరోక్షంగా క్రాంతి కూడా పర్యావరణ పరిరక్షకుడే. ఇలాంటి వారు దేశం మొత్తమ్మీద ఎంతోమంది ఉన్నారు. పాముల సంరక్షకుల కోసం వివరాలు కావాలంటే indiansnakes.com అనే వెబ్ సైట్ కూడా అందుబాటులో ఉంది.
కనుక తాచుపాము పగ బడుతుందనుకోవడం మూర్ఖత్వం. అవికూడా మనలాంటి ప్రాణులే. సుమతీ శతకకారుడు చెప్పినట్లు పాముకి తలలోనే విషం ఉంటుంది. మనిషికి శరీరమంతా విషమేనట. అందుకేనేమో మనిషిని చూసి పాములు పారిపోతుంటాయి. కనుక శరీరం అంతా విషం ఉన్న మనం ఆ కొద్దిపాటి విషం ఉన్న పాములను చూసి భయపడటం ఎందుకు? అంటాడు క్రాంతి.
వీరి సేవలను గుర్తించిన విజయవాడ ‘పట్టాభి కళాపీటం ‘ వారు పర్యావరణ రంగంలో క్రాంతి ని ‘పట్టాభి పురస్కారం ‘తో సత్కరించారు.
డా. తూములూరి
Very good service.