కళలకు ఆకాశమే హద్దు – మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్ లో శోభానాయుడు పురస్కారాల ప్రదానోత్సవం…!
కళలకు ఎల్లలు లేవని, కళాకారులకు ఆకాశమే హద్దు అని గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు!. కూచిపూడి నాట్య రంగం లో దివంగత శోభానాయుడు శోభాయమానంగా వెలుగొందారని, కూచిపూడి ని ప్రపంచవ్యాప్తం చేసారని ఘన నివాళులు అర్పించారు. గురువారం(4-03-21) లకిడికపూల్ సెంట్రల్ కోర్టు హోటల్ లో ప్రణవ్ ఇన్ స్టిట్యూట్ అఫ్ కూచిపూడి డాన్స్ నాట్యగురు డాక్టర్ జి.పద్మజారెడ్డి ఆధ్వర్యం లో శోభానాయుడు పురస్కారాల ప్రదానోత్సవం కనుల పండువగా జరిగింది. ముఖ్య అతిథి గా విచ్చేసిన మేయర్ విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి, శోభానాయుడు చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మజారెడ్డి రచించిన కూచిపూడి సాంప్రదాయ పుస్తకాన్ని మేయర్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. శోభానాయుడు పేరిట అంతర్జాతీయ స్థాయి నృత్య పోటీలు నిర్వహించి ప్రముఖ నర్తకీమణి డాక్టర్ పద్మజారెడ్డి తన గురు భక్తిని చాటుకున్నారని అభినందించారు. కూచిపూడి నాట్యం ఉన్నంత కాలం శోభానాయుడు తరతరాలకు గుర్తుండి పోతారని, ఆమె కూచిపూడి నాట్యానికి విశేష సేవలు అందించారని కొనియాడారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మజా రెడ్డి మాట్లాడుతూ తన గురు పూజ్యులు శోభానాయుడు అకాల మరణం ఒక కల గానే ఉందని, తొలి బ్యాచ్ శిష్యురాలిగా తాను శోభానాయుడు ఖ్యాతి ని శాశ్వతం చేసేందుకు, మున్ముందు తరాలకు గుర్తు చేసేందుకు జూమ్ సహకారం తో ప్రపంచ వ్యాప్తంగా కూచిపూడి, భరతనాట్యం పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. ఇక ప్రతియేటా శోభానాయుడు పేరిట నాట్య పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పోటీలకు జ్యూరీ గా వ్యవహరించిన ప్రముఖ నాట్య గురువులు శ్రీ వేదాంతం రాధేశ్యాం, డాక్టర్ ఎస్.కృష్ణభారతి, డాక్టర్ వనజా ఉదయ్, కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ, బి.నాగయ్య, సుమలత, ఎంవి భాస్కర్ తదితరులు పాల్గొని నాట్య పోటీ విజేతలను అభినందించారు.

Padmasree Sobhanaidu awards-Hyderabad

శోభానాయుడు పురస్కార గ్రహీతలు:
సీనియర్స్ విభాగం లో శ్రీరాగిణి ఘంటసాల (కూచిపూడి), షెరీన్ ఎళ్ళిక్కల్ (భరతనాట్యం-అమెరికా), ఆర్.జి శిరీష (భరతనాట్యం-విశాఖ) వరసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు గెలిచి శోభానాయుడు పురస్కారాలను మేయర్ చేతుల మీదుగా స్వీకరించారు. జూనియర్స్ విభాగం లో వైనవి వేదాల, సి.హెచ్.శ్రీప్రణవి (దుబాయ్), సంజన సిరిపురపు విజేతలుగా నిలిచారు.సబ్ జూనియర్స్ విభాగం లో జి.క్షేత్ర సురభి (అమెరికా), టి.జేష్ణశ్రీ (హైదరాబాద్), తీర్థ శ్రీసత్య (ఏలూరు) పురస్కారాలు కైవసం చేసుకున్నారు.

ఓవర్సీస్ ఉత్తమ ప్రదర్శన విభాగం లో కృతి కవికొండల (కెనడా), రిషిత (దోహా), ఇసాబెల్ జోషేయ్ (సింగపూర్), అనన్య రవిశంకర్ (అమెరికా), సాహితి పెండ్యాల (ఆస్ట్రేలియా) నిలిచి శోభానాయుడు పురస్కారాలు గెలుచుకున్నారు. ఓవర్సీస్ విభాగానికి ప్రముఖ నాట్యగురువులు ఎం.ఎస్.శ్రీలక్ష్మి (సింగపూర్), లక్ష్మి (అమెరికా) న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
-సాగర్

SA:

View Comments (2)