సమాజము – చిత్రకళ

సమకాలీన సమాజ స్థితిగతులకు నిలువెత్తు దర్పణం చిత్రకళ. కళాప్రయోజనం కేవలం ఆనందానికి, సౌందర్యానికే పరిమితం కాదు. హృదయాలను కదలించి, సమస్యల పట్ల ఆలోచనలను రేకెత్తించి పోరాడమంటుంది. సమస్యలను చూపడమే కాదు పరిష్కారాల బాటలు వేయగలదు. చరిత్ర నిజాలను కన్నుల ముందుకు తీసుకురాగలదు. సమాజాన్ని చక్క దిద్దాలనే ప్రయత్నాలు చేయగలదు.
చిత్రకళ మొదట భావ వ్యక్తీకరణ కోసం జన్మించింది. తరువాత తరువాత మతాన్ని
ప్రచారం చేసింది. ప్రకృతిని ప్రతిబింబించింది. మనోగత భావాలకు, ధోరణికి ప్రతీకలు చూపి ప్రతిబింబించింది. కరిగిపోయే కాలాన్ని కూడా కన్నుల ముందు చిత్రంగా నిలబెట్టింది. అలాగే సమాజ స్థితిగతులకు తాను కూడా స్పందించింది. నవ్వింది, నవ్వించింది, ఆనందాన్నిచ్చింది. ప్రశ్నించింది, ప్రశ్నలకు బదులిచ్చింది. మనతో కూడా నడుస్తూనే ఉంది. సమస్యలను, లోపాలను, కర్తవ్యాలను గుర్తు చేస్తూ సమాజములో ఒక భాగమైపోయి, తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.
అయితే అటువంటి చిత్రకళ ఆ చిత్రకారుని మానసిక పరిపక్వత మీద, స్పందన పైన ఆధారపడి యుంటుంది. ఒక చిత్రం గొప్పదనాన్ని నిర్ణయించేది కూడా ఆ చిత్రం తెచ్చిన ప్రయోజనమే. అందుకే ఋగ్వేదం “ఆయా కాలాల్లో, ఆయా స్థితిగతుల్లో ఆవిర్భవించిన కళ సమాదరణీయమైనది” అని పేర్కొంది. ఈ మాట నిజంగా నిజం .
చిత్రం ఎంత గొప్పదైనా చూసేవారు లేకపోతే ఆ కళ నిష్ప్రయోజనం. ఓ గొప్ప చిత్రం ఏ మారుమూల ఉందని తెలిసినా తరలి వస్తారు జనం. ఆనాడు తమ కళ మీద నమ్మకంతోనే ఎక్కడో అజంతా కొండ గుహల్లో బౌద్ధులు అపురూప కళాప్రాభవం ప్రదర్శించారు. నేటి కాలంలో కళాదరణ తగ్గిందని చెప్పక తప్పదు.

నాటి కళా ప్రభావం ప్రపంచ దేశాల కళాభిమానుల్ని మన దేశానికి రప్పిస్తుంటే ప్రస్తుత ప్రదర్శనలకు ఆ ఊరి ప్రజలను కూడా రప్పించలేని పరిస్థితి ఎదురౌతూంది. దీనికి కారణం కళాభిమానుల లోటూ కాదు, కళాకారుల లోపమూ కాదు.
కాలానుగుణంగా అనేక విదేశీ సంస్కృతుల పోకడలు, ఆధునికత పేరుతో అనాగరికత చోటు చేసుకోవడం, దైనందిన జీవితంలోని సమయాభావం మొదలైన కారణాలు మనిషిని కళలకు దూరం చేస్తున్నాయి. ఈ పరిస్థితి నుండి కళాభిరుచి కలిగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్రింది చర్యలు చేపట్టాలి.

కేంద్రప్రభుత్వ పాత్ర
రాష్ట్రాల్లో చిత్రకళా అకాడమీలు నెలకొల్పుట, చిత్రకళా ప్రామాణికతను తెలిపే చిత్రకళా లక్షణదీపిక, సంస్కృత తాళపత్రి, విష్ణు ధర్మోత్తరములోని చిత్రసూత్రము, ఐతరేయ బ్రాహ్మణము, శిల్పరత్న ఎందుకు అందాలను వివిధ గ్రంథాలను ప్రాంతీయ భాషలోనికి అనువదింపజేయాలి. కళా అధ్యయన కళాశాలల్లో అనుసరణీయ అంశాలుగా చేర్చాలి. చిత్రకళా ప్రామాణికతను తెలిపే ప్రాచీన సంస్కృత గ్రంథాలను, కళా అధ్యయన కళాశాలలను విరివిగా ఏర్పాటు చేయాలి.
ఒక చిత్రకళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, కళా అధ్యయనంతో పాటు దేశవ్యాప్తంగా చిత్రక కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నడపాలి. రాష్ట్రస్థాయి చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించి ఉత్తమ చిత్రాలను కొనుగోలు చేసి,
జాతీయస్థాయి ప్రదర్శనగా అన్ని ముఖ్య పట్టణాలలో సంచార ప్రదర్శనలుగా (Mobile Exhibition) ప్రదర్శించాలి.
ఇతర దేశాలలో గల రాయబార కార్యాలయాలలో అన్ని ప్రాంతాల భారతీయ చిత్రాలు ప్రతి సంవత్సరం సేకరిస్తూ సంవత్సరం పాటు ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించాలి. ప్రదర్శించి దేశీయ చిత్రకళా వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి.
చిత్రకళా ఔత్సాహికులను ఇతర దేశాల చిత్రకళా రీతుల అధ్యయనానికి పంపించాలి. ఆ నూతన పోకడలను ప్రాంతీయ కళాశాలలకు అందించాలి.
ప్రాంతీయంగా నిర్వహింపబడే ప్రభుత్వేతర కళాసంస్థలకు చిత్రకళా పత్రికలకు గుర్తింపును, గ్రాంట్ ను ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రత్యేకంగా టి.వి. ఛానల్ ను ప్రారంభించి, ఎప్పటికప్పుడు చిత్రకళారీతులను అధునాతనం చేయాలి. చిత్రకళా కృషీవలులను పరిచయం చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర
ఆ చిత్రకళలో నిత్యకృషి చేసిన ప్రముఖుల గురించి ప్రత్యేక పుస్తకములు ప్రచురించాలి. చిత్రకళా సంబంధిత రచనలు చేసేవారికి గ్రాంట్ మంజూరు చేయాలి.
ముఖ్యపట్టణాలలో గ్యాలరీలు ఏర్పాటు చేసి ప్రాంతీయ చిత్రకారుల కళాప్రదర్శనల కొరకు అందుబాటులో ఉంచాలి.
చిత్రకారులకు గుర్తింపుకార్డులనిచ్చి, వివిధ చిత్రకళా కార్యక్రమాలలో పాల్గొనేవారికి గౌరవపూర్వకంగా ప్రయాణాల్లో రాయితీలు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను ప్రకటించి వారి కళాసాధనకు తోడ్పడాలి.
– రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలలో కళాగ్రామాలు ఏర్పాటు చేసి, ప్రజల వీక్షణార్థం విజ్ఞాన, వినోద ప్రదేశాలుగా తీర్చిదిద్దాలి. ఆ గ్రామాలలోనే చిత్రాల ప్రదర్శన, అమ్మకాలు కొనసాగించాలి.

కళాకారుల పాత్ర
లండన్ నేషనల్ హాస్పిటల్ లోని డైరెక్టర్స్ లోని ఒకరైన షెరిటన్ అనే డాక్టర్ చిత్రకారుల చిత్రాలు సేకరించి ఆసుపత్రి గోడలపై ప్రదర్శించారుట. అనేకమంది దర్శించి ప్రశంసించారట. ఈ పథకం నచ్చిన “న ఫీల్డ్” అనే ధర్మసంస్థ లండన్ లోని ఇతర ఆసుపత్రులను కూడా చిత్రాలు కొనడానికి సాలీనా 200 పౌండ్లు మంజూరు చేసిందట. లండన్లోని 20 ఆసుపత్రులు ఆర్ట్ గేలరీలుగా మారిపోయాయట. ఈ విషయం శ్రీ మాదేటి రాజాజీ “తూలిక” పత్రికలో తెలిపారు.
ఇదే పద్ధతిలో సమాజములోని ధనవంతులైన కళాభిమానుల, వ్యాపార సంస్థలలోను, హోటల్స్ లోను, ఆసుపత్రులలోను చిత్రాలతో నింపే ప్రయత్నం చేయగలగాలి. చిత్రకళా ప్రదర్శనా కార్యక్రమాలలో వారిని భాగస్వామ్యం చేస్తూ కళా కార్యక్రమాలను ప్రోత్సహించేలా కృషి చేయాలి.
మన నూతన రాజధాని మన సనాతన భారతావని కళా ప్రాభవానికి తగినట్లు చిత్ర శిల్పకళామయమైన భవన సముదాయాలను నిర్మించి మన సంస్కృతిని తిరిగి నిలబెట్టగలిగేందుకు కృషి చేయాలి.
కళలు – సమాజాన్ని ప్రతిబింబించాలి. ప్రభుత్వాలు – కళలను ప్రోత్సహించాలి. అప్పుడే కళకైనా – సమాజానికైనా ఒక విలువంటూ ఏర్పడుతుంది.
-ఎన్.వి.పి.యస్.యస్. లక్ష్మి

(ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ సౌజన్యంతో)

1 thought on “సమాజము – చిత్రకళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap