మదిలో వీణల మూర్తిమంత్రం… మోహన రాగం

సంగీతంలో ప్రవేశం వున్నా, లేకున్నా మనం సంగీతాన్ని విని ఆనందిస్తుంటాం. అదే సంగీతంతో కాస్త పరిచముంటే చాలు, ఆ ఆనందానుభూతి తీరే ప్రత్యేకంగా వుంటుంది. పాఠక శ్రోతలకు బాగా పరిచయమున్న కొన్ని రాగాలను వారికి సినిమా పాటల ద్వారా వినిపిస్తే, ఆ రాగాలను సులువుగా వారు గుర్తుపెట్టుకొని పాటలు పాడే ప్రయత్నం కూడా చేస్తారనే నమ్మకం. అందుకే ఈ చిరుప్రయత్నం. తెలుగు సినిమాలలో ‘మోహన’ రాగ ఆధారిత పాటలు వచ్చినంత విస్తృతంగా మరే ఇతర రాగాల ఆధారిత పాటలు వచ్చివుండవనేది నిజం. స్వరపరంగా ‘మోహన’ రాగం, ‘అభేరి’ రాగం లాగే ఐదు స్వరాల రాగం. శాస్త్రీయ సంగీతంలో ‘మోహన’ రాగానికి ఒక విశిష్టత వుంది. ఈ రాగానికి ప్రత్యేకమైన రూపం, భావం వున్నాయి. ఈ రాగంలో భక్తి, శృంగార, శాంత, వీర రసాలను పలికించవచ్చు. స్వరాలు తక్కువే…కానీ శ్రోతలకు రక్తి కలిగించి సులభంగా అర్థమయ్యే రీతిలో వుంటుంది మోహన రాగం. ఈ రాగంలో స, రి, గ, ప, ద అనే ఐదు స్వరాలు మాత్రమే వుంటాయి. మోహన రాగానికి “దగ్గరగా” ఉండే హిందూస్తానీ సంగీతంలోని రాగాన్ని “భూప్‌ రాగ్’’ అని వ్యవహరిస్తారు. స్వరపరంగా ఈ రెండు రాగాలు ఒకటే అయినప్పటికీ, శాస్త్రీయ సంగీతంతో పరిచయం ఉన్నవారు ఈ రెంటినీ రెండు విభిన్న రాగాలుగా పేర్కొంటారు. కర్నాటక సంగీతంలో 28 వ మేళకర్త రాగంగా మోహనరాగాన్ని వర్గీకరిస్తారు. మోహన రాగాన్ని ‘మోహనగర’ అనికూడా వ్యవహరిస్తుంటారు. మోహన రాగాన్ని హార్మోనియం లేదా కీబోర్డు మీద పలికించడం చాలా తేలిక. పైగా మోహన రాగం పిల్లనగ్రోవి వాద్యం మీద అతికినట్టు సరిపోతుంది. త్యాగరాజ కృతి ‘ననుపాలింపగ నడచి వచ్చితివో’ ను వింటే మోహనరాగం అవగతమైనట్టే.

మోహన రాగ లక్షణాలను సూచించే తెలుగు సినిమా పాటలగురించి…

ఇప్పుడు మోహన రాగంలో స్వరపరచిన కొన్ని సినిమా పాటలు గురించి చెప్పుకుందాం. కొన్ని పాటలు పదే పదే వినటం వల్ల వాటిలోని మాధుర్యం మరచిపోలేం. అలాంటి పాటల్లో ‘మాయాబజార్‌’ సినిమాలోని ‘’లాహిరి లాహిరి లాహిరిలో…” పాట ఒకటి. శుద్ధ మోహన రాగంలోని స్వరాలు తప్ప మరే స్వరాలు ఉపయోగించకుండా, పడవ మీద షికారు పోతూ శశిరేఖాభిమన్యులు పాడుకునే పాట ఇది. మెల్లగా, వెన్నెల రాత్రి, చల్లగాలిలో ప్రయాణిస్తూ, మంద గమనంతో సాగే ఈ పాటలోని సంగీతాన్ని వినండి. పాటలోని సాహిత్యానికి తగ్గ రాగంగా, సాహిత్యానుభూతికి ధీటైన సంగీతానుభూతిని పంచుతుంది. ఒకరకంగా మోహన రాగానికి ఈ పాటను ప్రామాణికంగా ఉదహరించవచ్చు. ’విజయా వారి వెన్నెల’ అనే పేరు ఈ పాట మూలంగానే వచ్చింది. విజయా వారి ‘మిస్సమ్మ’ చిత్రంలో ఎ.ఏం. రాజా ఆలపించిన ’’తెలుసుకొనవె యువతీ అలా నడుచుకొనవె యువతీ’’ పాటను రాజేశ్వరరావు మొదటినుంచి చివరి చరణం వరకు మోహనరాగంలోనే స్వరపరచారు. అలాగే నాణేనికి మరోవైపు సావిత్రిచేత పాడించే ‘’తెలుసుకొనవే చెల్లీ’’ పాటకూడా మోహన రాగపు తేనెలో ముంచిన పాటే! ఎన్.టి. రామారావు స్వంత సినిమా ‘జయసింహ’లో టి.వి. రాజు స్వరపరచిన ‘’ఈనాటి ఈ హాయీ కలకాదోయి నిజమోయీ’’ అనే జాజిపూల జలపాతం లాంటి సమ్మోహన పాటను మోహన రాగంలోనే స్వరపరచారు. ఈ పాటకు ‘దిల్–ఎ-నాదాన్’ అనే హిందీ చిత్రంలో గులాం మహమ్మద్ స్వరపరచగా తలత్ మెహమూద్ ఆలపించిన ‘’జిందగీ దేనే వాలీ సున్… తేరి దునియాసే దిల్ భర్ గయా’’ పాట స్పూర్తి. అందులో ‘తేరి దునియా సే దిల్ భర్ గయా’ ట్యూన్ ని పల్లవి గా తీసుకొని మోహన రాగంలో పాటను హిట్ చేసిన ఘనత టి.వి. రాజు, అతని శిష్యుడు సత్యం లది కావడం విశేషం. ఇదే టి.వి. రాజు ‘మంగమ్మ శపథం’ చిత్రంలో ‘’ఈరాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈరేయి నీదే కదా చెలి నారాణి నీవేకదా’’ పాటలో అన్యస్వరాన్ని జొప్పించి పాటకు మరింత అందాన్ని చేకూర్చారు. అలాగే ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలోని ”పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా” మరొక ఉదాహరణ. శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీత పరంగా బాణీ కట్టి, వీణతో రాజేశ్వరరావు పలికించిన పాట ఇది. విజయా వారి ‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాకోసం సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పన చేసిన ‘’ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి’’ అనే పాటను మోహనరాగంలో తిశ్రగతిలో సాగేలా స్వరపరచారు. ఈ పాట స్వరరచనలో ”వీచెనో..” అనే పదం తరవాత సాగే గమకంలో మోహన రాగంలో నిషిద్ధమైన “నిషాదం” దొర్లుతుంది. అలా ‘హంసధ్వని’ రాగం అని భ్రమించేలా ‘ని’ అనే స్వరాన్ని కలుపుకొని రాజేశ్వరరావు మోహనరాగపు ప్రత్యేకతను నిలబెట్టారు. విజయా వారి మరో చిత్రం ‘జగదేకవీరుని కథ’లో పెండ్యాల స్వరపరచగా ఘంటసాల, సుశీల ఆలపించిన ‘’ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసీ’’ పాట కొంత మోహన రాగంలో కొంత కల్యాణి రాగంలో అమరింది. మోహన రాగానికి 5 స్వరాలు (సరిగపద)మాత్రమే పలికితే కల్యాణి రాగంలో సప్తస్వరాలూ పలుకుతాయి. అయితే ఇందులో ‘మ’, ‘ని’ స్వరాలను పొదుపుగా ప్రయోగించి మోహనరాగమనే భ్రమను కలిగించారు. అలాగే ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ సినిమా కోసం పెండ్యాల మట్లుకట్టిన “మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే” అనే పాట మొదలవుతూనే వినిపించే స్వరాల్లో తీవ్ర ‘నిషాదం’ ఉపయోగించటం జరిగింది. ఇలాంటి ఇంకో ఉదాహరణ ‘గుండమ్మ కధ’ సినిమాలోని “మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటినే’’ అనే పాటలో ‘’నీ మనసు నాదనుకొంటిలే..” అన్నప్పుడు “మనసు” లో ‘నిషాదం’ పలికించాడు ఘంటసాల. గమ్మత్తుగా మోహన రాగం స్వరాలు మాత్రమే ఉపయోగించే ఇంకొక హిందూస్తానీ రాగం “దేశ్‌కార్‌”. చిరంజీవులు సినిమాలో “తెల్లవార వచ్చే తెలియక నా స్వామి..” అన్న పాట “దేశ్‌కార్‌” రాగం లోనిదే! మోహన రాగానికి దగ్గరగా ఉండే ఈ “దేశ్‌కార్‌” రాగం సూర్యోదయ కాలంలో పాడుకొనే రాగం. ఇక ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రంలో ‘’మోహన రాగమహా మూర్తిమంతమాయే’’ పాట పెండ్యాల మోహనరాగ బ్రాండెడ్ సాంగ్ గా చెప్పుకోవాలి. భరణీ వారి ‘విప్రనారాయణ’ సినిమాలో సాలూరు రాజేశ్వరరావు చేతిలో మోహనరాగం యెంత సమ్మోహనంగా రూపుదిద్దుకుందో నిరూపించడానికి ఎ.ఏం. రాజా, భానుమతితో కలిసి పాడిన ‘’మధుర మధురమీ చల్లని రేయి మరువ తగనిదీ ఈ హాయీ’’ అనే పాటే ఉదాహరణ. భానుమతి మోహనరాగంలో అతితక్కువ పాటలు పాడింది. ఆమె స్వరజీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట ఇది. చరణంలో ‘’మన అనురాగము చూసీ, చిరునవ్వులు చిలుకును స్వామీ, మీ వరమున నా జీవనమే పావనమాయెను స్వామీ’’ అనే చివరి చరణంలో భానుమతిచేత రాజేశ్వరరావు పలికించిన గమకాలు, ఆలాపన మోహనరాగానికి గీటురాళ్లనేచెప్పాలి. ఇంటర్లూడ్స్ లో రాజేశ్వరరావు పలికింపజేసిన హవాయిన్ గిటార్ బిట్లు కూడా అద్భుతాలే. మోహన రాగంలో స్వరమాంత్రికుడు ఇళయరాజా చేసిన అనేక ప్రయోగాల్లో, రెండు ఇక్కడ చెప్పుకోవాలి. మొదటిది “నినుకోరి వర్ణం సరిసరి కలిసేనే నయనం” అనే ‘ఘర్షణ’ డబ్బింగ్ సినిమాలోని పాట. పూర్తిగా మోహన రాగం, ఆది తాళంలో స్వరపరచబడ్డ ఈ పాట వింటే, మోహన రాగంలో సరళంగా ఎంతటి విలక్షణత తీసుకు రావచ్చో ఇళయరాజా నిరూపించాడు. ఇలాంటి ప్రయోగాలు మన శాస్త్రీయ సంగీతం మీద మాత్రమే కాకుండా, వెస్టర్న్‌ మ్యూజిక్‌ మీద కూడా మంచి పట్టువున్న ఇళయరాజా లాంటి వారికి వెన్నతోపెట్టిన విద్య. రెండవ ఉదాహరణ ‘’వే వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే’’’ అనే ‘సాగర సంగమం’ సినిమాలోని పాట. ఈ పాటకు మోహనరాగాన్ని మూలంగా తీసుకున్నా, అన్య స్వరాలు అక్కడక్కడ ఉపయోగించటం వల్ల పాటకు ఒక కొత్త అందాన్ని సంతేరింపజేశాయి. “మోహనాల వేణువూదే..” అన్న చోట శుద్ధ ధైవతం వాడటం, పాటలో ఉన్న రెండు చరణాలకి మధ్య ఉన్నఇంటర్లూడ్స్ వేణువుతో మొదలవడం ఇళయరాజా ప్రత్యేకత.

మోహన రాగం ఆధారంగా వచ్చిన కొన్ని తెలుగు పాటలు ఇవి…
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే వూగెనుగా తూగెనుగా… (మాయాబజార్‌)

చెంగు చెంగునా గంతులు వేయండి ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా … (నమ్మిన బంటు)
ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి… (అప్పుచేసి పప్పుకూడు)
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే … (శ్రీ కృష్ణార్జున యుద్ధం)
అయినదేమో అయినది ప్రియ గానమేలే ప్రేయసీ… (జగదేకవీరుని కథ)
మోహన రాగమహా మూర్తిమంతమాయే… (మహా మంత్రి తిమ్మరసు)
వే వేల గొపెమ్మల మువ్వ గోపాలుడే ముద్దు గోవిందుడే… (సాగర సంగమం)
కొత్తగా రెక్కలొచ్చెనా, మెత్తగా రేకు విచ్చెనా (స్వర్ణకమలం)
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతిక… (ఇద్దరు మిత్రులు)
వినిపించని రాగాలే కనిపించని అందాలే… (చదువుకున్న అమ్మాయిలు)
నను పాలింపగ నడచి వచ్చితివా మొరలాలించగ కదలి వచ్చితివా… (బుద్దిమంతుడు)
ఘనా ఘన సుందరా కరుణారస మందిరా… (చక్రధారి)
సిరిమల్లె నీవె విరిజల్లు కావే వరదల్లే రావే వలపంటే నీవే… (పంతులమ్మ)
మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నో చెలరేగే… (ఆత్మీయులు)
ఈనాటి ఈహాయి కలకాదోయి నిజమోయీ… (జయసింహ)
తెల్లవార వచ్చె తెలియక నా స్వామి మళ్ళీ పరుండేవు లేరా… (చిరంజీవులు)
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటినే… (గుండమ్మ కథ)
తెలుసుకొనవె యువతీ అలా నడచుకొనవె యువతీ… (మిస్సమ్మ)
మధుర మధురమీ చల్లని రేయీ మరపురానిదీ ఈ హాయీ… (విప్రనారాయణ)
శివ శివ శంకర భక్తవశంకర శంభో హరహర నమోనమో… (భక్త కన్నప్ప)
చందన చర్చిత నీల కళేబర… (తెనాలి రామకృష్ణ)
నినుకోరి వర్ణం సరిసరి కలిసేనే నయనం …. (ఘర్షణ)

హిందీ సినిమాలలో ఈరాగంలో వచ్చిన వినసొంపైన గీతాలు కొన్ని…

ఓ మేరే షాహే ఖుబా, ఓ మేరీ జానే ఝణాన (లవ్ ఇన్ టోక్యో)
హే… నీలే గగన్ కె తలే ధర్తీకా ప్యార్న్ పలే (హమ్ రాజ్)
సాయోనారా సాయోనారా వాదా నిభావూంగి సాయోనారా (లవ్ ఇన్ టోక్యో)
ఏ మేరా ప్రేమ్ పత్ర్ పఢ్కర్ తుమే నారాజ్ నా హోనా (సంగమ్)
జిందగీ ఏక్ సఫర్ హై సుహానా యహా కల్ క్యా హొ కిస్నే జానా (అందాజ్)
జ్యోతి కలష్ ఝల్ కె (భాభీ కి చూడియా)

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)
*హార్మోనియం మీద మోహనరాగ లక్షణాలను https://www.youtube.com/watch?v=EonFIQjozRQ ద్వారా వినండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap