ఆతను సినిమాలతో జాతీయస్థాయిలో అగ్రశ్రేణి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. వయసులో చాలా చిన్నవాడు అయితేనేమి చాలా పెద్ద మనసున్నవాడు. సినిమాలలో విలన్ లా నటిస్తాడు, నిజజీవితంలో హీరో లా జీవిస్తున్నాడు అతనే సోనూసూద్. ఈ కరోనా మహమ్మారి కాలంలో కష్ట జీవులను వదలనే వదలను అంటూ బహుశా మంచితనానికి మించి ప్రజలను ఆదుకున్నారు. లక్షలాది మంది వలస కూలీలను వారి వారి స్వస్థలాకు చేర్చారు. లాక్ డౌన్ సమయంలో ప్రతిరోజు వేలాదిమంది ఆకలి తీర్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ఓ రైతు కుటుంబానికి ట్రాక్టర్ అందించారు. ఈ సహాయాలన్ని అందరికీ తెలిసినవే. ప్రతి ఒక్కరూ మనస్పూర్తిగా సోనూసూద్ సేవా గుణాన్ని అభినందిస్తున్నారు. జూలై 30 సోనూసూద్ 38 వపుట్టిన రోజు.
మానవత్వం.. కష్టాల పట్ల ప్రతిస్పందన ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత ఉంటుంది.. మీరు సేవా గుణాన్ని ఓ ఉద్యమంలా ముందుకి తీసుకెళ్ళారు. ఇందుకు ప్రేరేపించింది ఏమిటి..?
వలస కూలీలు మన మూలాలు.. వాళ్ళ కష్టంతో ఏర్పడుతున్న పునాదుల మీద..సౌధాల మీద మనం బతుకుతున్నాం.. కరోనా లాక్ డౌన్ సమయంలో వార్చేమీ కోరుకోలేదు. వాళ్ళ స్వస్థలాలకి తిరిగి వెళ్ళాలనుకున్నారు..నాకు కష్టం తెలుసు. మా వూరికి కిక్కిరిసిపోయిన రైల్వే కంపార్ట్ మెంట్ లో డోర్ దగ్గర లేదా టాయిలెట్ దగ్గర..ఒంటి కాలి మీద నిలబడి వెళ్లిన రోజులెన్నెన్నో..ఆ ఉద్వేగమే నా చేత ఈ పని చేయించింది. నిజానికి పది లక్షల మంది పైన వలసకూలీలు ఉన్నారు. వాళ్ళ కష్టం.. తాపత్రయం చూడగానే పంపించడం మొదలు పెట్టాను. ఏ అయిదు వేల మందితోనో ఆగిపోలేదు. లక్షన్నర మందికి పైగా వలస కూలీలను వాళ్ళ ఇళ్ళకి చేర్చాను. వాళ్ళందరి ఆశ ఒకటే. సోనూభాయ్ ఉన్నాడు. మమ్మల్ని ఎలాగయినా మా ఇంటికి చేరుస్తాడు అని అనుకున్నారు. అదొక మూమెంట్.. అదొక వేవ్.. వాళ్ళ ఆశల్ని వమ్ము చేయడం నా కిష్టం లేదు. పంపిస్తూనే వచ్చాను.
ఆర్థికంగా భారం అవుతుందని ఆలోచించలేదా.. ?
అవత వాళ్ళన్ని ఇబ్బందులు పడుతుంటే డబ్బుల గురించి ఆలోచించే పరిస్థితి కాదు.. డబ్బు సంపాదిస్తూనే ఉంటాం. రాని ఒకరి కష్టం అప్పుడే మనం తీర్చాలి.
మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదా..?
నో..నో ప్రతి నిమిషం నాకు సపోర్ట్ గా ఉన్నారు. గో ఎ హెడ్ అని ప్రోత్సహించారు. వలస కూలీల లిస్ట్ తయారు చేస్తూ నాకు సహాయపడ్డారు.
మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాల పట్ల కొన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి..?
మీరు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకమా?
(నవ్వి) నా పని నాకు చేతనైన సహాయం చేయడం. ఏదో ప్రయోజనాన్ని ఆశించి చేయలేదు. రాజకీయ పార్టీలు ఏం ఆలోచిస్తాయి..ఎలా రియాక్ట్ అవుతారని నేను ఆలోచించి చేయను. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇండివిడ్యువల్ గా నాకెంత సాధ్యమో అంతా చేస్తున్నాను. కష్టాల్లో ఉన్న వాళ్ళకి కాస్త హెల్ప్ చేద్దామని తప్పితే పొలిటికల్ రూలింగ్.. అపోజిషన్ పార్టీలకు అనుకూలంగానో…వ్యతిరేకంగానో నేను చేయడం లేదు.
జాతీయ.. అంతర్జాతీయస్థాయిలో మీ సేవా కార్యక్రమాలకు గుర్తింపు వచ్చింది. భవిష్యత్ లో రాజకీయాల్లోకి వస్తారా.. ?
నేను పాలిటిక్స్ కి దూరంగానే ఉన్నాను. ప్రజలని ఎంటర్ టైన్ చేయడమే నా పని..నా జీవితం. భవిష్యత్ గురించి చెప్పలేను.. ఫ్యూచర్ ప్లానింగ్ లో భాగంగా ఈ పనులు చేయడం లేదు.
మీ కెరీర్ విషయానికి వద్దాం..పంజాబ్ మీ స్వస్థలం. అక్కడి నుంచి తెలుగు.. తమిళ సినీ పరిశ్రమలలోకి ఎలా వచ్చారు.. ?
అలా జరిగిపోయింది.. అంతే.. 1999లో ఓ తమిళ సినిమాతో నా నట జీవితం ప్రారంభమైంది. కెరీర్ తొలి దశలో తెలుగు.. తమిళంలో మంచి అవకాశాలు వచ్చాయి. ప్రశంసలు..గుర్తింపు లభించాయి. అలా కెరీర్ సాగిపోతూ వచ్చింది.
కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్ళ వెనక్కి వెళ్లిపోయింది. సినిమారంగం విషయాని కొస్తే స్టార్స్ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని డిమాండ్ ఎక్కువ అవుతుంది. మీ విషయానికొస్తే మీరు ఏమంటారు..?
నా రెమ్యునరేషన్ నేను తగ్గించుకోవడానికి రెడీ.. కోట్లాది పారితోషికం తీసుకునే స్టార్స్ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి అని నేనూ కోరుకుంటాను. కాని సినిమా వర్కర్స్ కి.. టెక్నిషియన్లకి మాత్రం డబ్బులు తగ్గించొద్దు. స్టార్స్ కి తగ్గించినా పర్లేదు. టెక్నిషియన్లకు రెమ్యునరేషన్లు పెంచి ఇవ్వండి. ఇది నా రిక్వెస్ట్.
మీ జీవితంలో తీరని లోటు ఉందా..?
ఉంది..మా తల్లిదండ్రులు కెరీర్ఎ దుగుదలని.. విజయాన్ని చూడలేదు.. 2007లో వాళ్ళు నాకు శాశ్వతంగా దూరమయ్యారు. నా కెరీర్ బిగినింగ్ సినిమాలు చూసారు. ఒకో సినిమా రోజుకి పది సార్లు చూసేవారు. వాళ్ళు లేరనే వెలితి జీవితంలో ఎప్పటికీ తీరనిది.