మంత్రి ట్వీట్‌పై స్పందించిన నటుడు
కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ సినీనటుడు సోనూసూద్ రియల్ హీరోగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన్ని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సైతం సూపర్ హీరో అంటూ కొనియాడారు. తాము అడగ్గానే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చి సాయం చేసిన కేటీఆర్‌ను నిజమైన సూపర్ హీరో అంటూ నందకిశోర్ అనే వ్యక్తి ట్విటర్‌లో ప్రశంసించగా.. దానికి మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎన్నికైన ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించినట్టు కేటీఆర్ తెలిపారు. సోనూసూద్‌ను సూపర్ హీరోగా పిలవడం సరైనదంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా తన ట్వీట్‌కు సోనూసూద్‌ని ట్యాగ్ చేశారు. ఆపదలో ఉన్నవాళ్లకు ‘మీరూ సాయం చేయండి బ్రదర్’ అంటూ ఆ వ్యక్తికి కేటీఆర్ సూచించారు.
తెలంగాణ నా రెండో ఇల్లు
కేటీఆర్ ట్వీట్‌పై సోనూసూద్ స్పందించారు. తన గురించి చేసిన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ తెలంగాణకు ఎంతో చేస్తున్న మీరే నిజమైన హీరో అంటూ కేటీఆర్‌ను సోనూ కొనియాడారు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తెలంగాణను తన రెండో ఇల్లుగా భావిస్తానని, అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా తనపై ప్రేమను చూపుతున్నారంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. ఇటీవల సోనూసూద్ కు ఇంత భారీగా నిదులెక్కడి నుండి వస్తున్నాయంటూ కొదరు ప్రశ్నించడం కూడా మనం చూసాము.
మరోవైపు, కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల వల్ల అనేకమంది ప్రజలు సాయం కోసం సామాజిక మాధ్యమాలను ఓ మంచి వేదికగా వినియోగించుకుంటున్నారు. ఔషధాలు, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, వ్యాక్సిన్లు.. ఇలా ఏ అవసరం ఉన్నా ట్వీట్లు చేస్తూ వాటికి పలు రంగాల ప్రముఖులను ట్యాగ్ చేస్తున్నారు. దీంతో వారు సకాలంలో స్పందించి తగిన సాయం అందిస్తుండటం ద్వారా ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు.