
భౌతికశాస్త్ర పరంగా శూన్యం అనగా ఒక కోణంలో అంత రిక్షం, అనంతమైన విశ్వం అనే అర్థంలో వాడతాము అంతే గాక సాధారణ పరిభాషలో ఒకవిధమైన ఏకాంత స్థితి, ధ్యానం అనే అర్థంలో కూడా వాడతాం. నిత్య జీవితంలో మనిషికి ఏకాంత స్థితి లోనే ఏ ఆలోచన అయిన పుట్టుకొస్తుంది. అది శాస్త్ర సాంకేతిపరమైన యాంత్రిక విషయాలు కావచ్చు. ఆధ్యాత్మిక పరమయిన ఆలోచనలు కావచ్చు. లేదా లౌకివ్యవహారాలతో కూడిన ప్రాపంచిక విషయాలు కూడా కావచ్చు. మనిషి మెదడు శూన్య మయిన ఆ ఏకాంత స్థితి లోకి ప్రవేశించినపుడు మాత్రమె సవ్యరీతిన ఆలోచలను వ్యక్తీకరణ చేయగలదు. నూతన ఆవిష్కరణలకు అంకురార్పణ గావించగలదు.
భౌతిక శాస్త్రానికి ఆంగ్లపర్యాయ పదమైన ఫిజిక్స్ ని తన ఇంటిపేరుగా మార్చుకున్న అరుణ్ కుమార్ కు ఆ శాస్త్రంలో నేడు అత్యంత పరిశోధనా అంశమైన అంతరిక్షానికి సమానార్ధంగా భావించే శూన్యం అన్న పదాన్నే సహజంగానే తన తొలికవితా సంకలనానికి పెట్టుకోవడం జరిగింది. వృత్తి పరంగా ఫిజిక్స్ లెక్చెరర్ గా పనిచేస్తూ అటు శాస్త్ర సాంకేతిక విషయాలతో పాటు ఇటు సమాజిక రాజకీయ రంగాలలో విశేష మార్పుకు కారణబూతులైన మహానుభావుల జీవిత చరిత్రలను ఆకళింపు చేసుకుని వాటి నుండి స్పూర్తి పొంది ప్రపంచ వ్యాప్తంగా నేడు సామాజికఆర్ధిక రాజకీయ అంశాలలోనే గాకా వైజ్ఞానికంగా కూడా జెట్ వేగంతో నేడు మార్పుకు గురౌతున్న పలు అంశాలకు స్పందించి తనదైన రీతిలో తన భావాలను వ్యక్తీకరించాడు ఈ శూన్యం కవితా సంకలనంలో.
ఇందులో మొత్తం 58 కవితలు ఉన్నాయి. వీటిలో ముందే చెప్పినట్టు కొన్ని సామాజిక అంశాలపైన వుంటే కొన్ని శాస్త్ర సాంకేతిక విజయాలపై మరికొన్ని చరిత్ర గతిని మార్చిన మహానుభావులపైన ఇంకొన్ని దేశానికి అన్నంపెట్టే రైతుల ఈతిభాదాలను గూర్చి ఇంకా దేశ సరిహద్దులకు రక్షణగా నిలిచిన సైనికుల జీవితాలపైనా మరికొన్ని అమ్మ గొప్పతం గురించి ఇలా పలు అంశాలను తనదైన రీతిలో కవితలుగా మలిచారు ఈ సంకలనంలో. కవిత్వంలో సాధారణంగా మనకు కనిపించే మార్మికతకు తావు లేకుండా అతి సాధారణ భాషలో తన భావాలను అన్నింటిని అరుణ్ కుమార్ అక్షరీకరించాడు. ఈ కవితాసంకలనంలో చరితకు నువ్వే ఓ టాగ్ లైన్ అంటూ యువత గురించి ఇలా రాస్తాడు…
“నేడేమైనా జరగని మిత్రమా. జయమో, అపజయమో, రేపోకటి ఉందని, గెలుపు వెలుగు చిమ్మే చీకటిని మ్రింగే స్తుందని నువ్వెప్పుడూ మరువకు అంటూ ప్రభోదిస్తాడు.
అంబేద్కర్ గురించి వర్నిస్తూ అక్షర జ్వాలై అన్న కవితలో ఇలా రాస్తాడు…
ఈ శతాబ్దపు చరిత లో నేటి మేధావిగా, విదేశీ విశ్వ విద్యాలయాల్లో విలువైన పాఠ్య పుస్తకంగా మనదేశపు ముఖచిత్రమై, భవిష్యత్ తరాలకు భరోసా భానుడిగా అంబేద్కర్ ఆలోచనలు అంతరిక్షంలో రాకెట్ లా విశ్వవ్యాప్త మాయ్యాయి అంటారు.
ఐ లవ్ యు అమ్మ అనే కవితలో అమ్మ గొప్పతనం వర్ణిస్తూ…
అమ్మ ప్రేమను మించిన కమ్మధనం కానరాదు కాల ప్రభావంలో / అమ్మ ప్రేమను పంచే శక్తి స్వరూపమే లేదు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సంచలనం లో అమ్మకు ప్రత్యమన్యాయం లేదు అమ్మాతనానికి అస్తమయం రాదు అంటూ అమ్మతనం గొప్పను గురించి వర్నిస్తాడు.
కావాలంటే చరిత్ర నడుగు కవితలో ఏ కులము నీదంటే నా కలం నవ్వింది. అమ్మతనము లోని మానవత్వమే మనిషి తనమై గెలిచింది, కుల రాజకీయ రణరంగపు గళాలు గర్జీస్తున్నా మన ప్రజాస్వామ్యపు నిబద్దత నిటారుగానే నిలబడింది అంటూ మన ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని వర్నిస్తారు.
ఇలా బిన్న విభిన్నమైన అంశాలపై తనదైన రీతిలో భావాలను వ్యక్తీకరిస్తూ రాసిన ఈ కవితలన్నీ గతంలో పలు దినవార మాస పత్రికలలో ప్రచురింప బడినవే కావడం విశేషం. రచయిత అరుణ్ కుమార్ తొలిసారిగా వెలువరించిన ఈ కవితా సంకలనానికి రచయిత భావాలకు అనుగుణంగా చిత్రకారుడు ఎస్.యెన్. వెంటపల్లి అందించిన ముఖచిత్రంతో కర్షక్ ప్రింటర్స్ హైదరాబాదు వారి ప్రచురణతో పుస్తకం ఎంతో ఆకర్షణీయంగా ఉంది.
ప్రతుల కొరకు ఈ క్రింది చిరునామాను సంప్రదించండి:
పీ. అరుణ్ కుమార్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణా – 509209
నెంబర్ : 9394749536, పుస్తకం వెల: 220/-
–వెంటపల్లి సత్యనారాయణ, చిత్రకారుడు, కార్టూనిస్ట్, చిత్రకళా రచయిత
9491378313