కన్ను మూసిన సౌమిత్ర చటర్జీ …

భారతదేశం మరొక గొప్ప కళాకారుణ్ణి కోల్పోయింది. కోవిడ్-19 మహమ్మారికి బలైపోయిన ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ. కరోనా పాజిటివ్ రావడంతో కలకత్తా లోని బెల్లే వ్యూ క్లినిక్ లో సౌమిత్ర చికిత్స తీసుకున్నారు. కోవిడ్ నుంచి బయటపడినా వైరస్ ప్రభావం మూత్రనాళాలమీద చూపి ఆరోగ్యం విషమింపజేసింది. పదహారు మంది నిపుణులైన వైద్యులు అహర్నిశం శ్రమించినా సౌమిత్రిని బ్రతికించలేకపోయారు. 15 నవంబరు 2020 ఉదయం ఆసుపత్రిలోనే అశువులు బాయటం వూహించని పరిణామం. సౌమిత్ర బాబు సత్యజిత్ రాయ్ కి అత్యంత ఆప్తుడు. ఆయన దర్శకత్వంలో సౌమిత్ర పద్నాలుగు సినిమాలలో నటించారు. ఫ్రెంచ్ ప్రభుత్వం డాక్టరేట్ తో గౌరవించిన మొట్టమొదటి కళాకారుడు ఈ బెంగాలీ బాబే! 2004లో భారత ప్రభుత్వం సౌమిత్ర చటర్జీని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2012లో దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారాన్ని సౌమిత్ర అందుకున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం మరలా 2018లో సౌమిత్ర చటర్జీని ‘నైట్’ బిరుదుతో సత్కరించింది. సౌమిత్ర బాబు మరణానికి సంతాపం తెలుపుతూ అంజలి ఘటించే క్రమంలో ఆయన సేవలను గుర్తు చేసుకుందాం…

తొలిరోజుల్లో…
సౌమిత్ర చటర్జీ (చటోపాధ్యాయ)జనవరి 19, 1935 న కలకత్తా లోని సీల్డా రైల్వే స్టేషన్ కు సమీపంలో వుండే మీర్జాపూర్ (ఇప్పుడు సూర్యసేన్ వీధి) వీధిలోవున్న స్వంత ఇంటిలో జన్మించారు. అప్పట్లో ద్విజేంద్రలాల్ రాయ్ కృష్ణ నగర్ లో నాటక సంస్థను నిర్వహిస్తూవుండేవారు. సౌమిత్ర తాతగారు ఆ సంస్థలకు అధ్యక్షునిగా వ్యవహరిస్తూ వుండేవారు. సౌమిత్ర మీద వారి తాతగారి ప్రభావం మెండుగా వుండేది. పాఠశాల విద్యార్థిగా వుండగానే అనేక నాటకాలలో విభిన్న పాత్రలు పోషించేవారు. అలా నాటకరంగం మీద సౌమిత్రకు అనురక్తి కలగడానికి దోహదంచేసిన మరోవ్యక్తి సౌమిత్ర స్నేహితుడు మృత్యుంజయ సిల్. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి సౌమిత్ర చటర్జీ బెంగాలీ సాహిత్యంలో పోస్ట్ గ్రాడుయేషన్ పూర్తిచేశారు. 3 లేక్ దేవాలయ వీధిలో గల సత్యజిత్ రాయ్ కి చెందిన ఇంటిలో సౌమిత్ర చాలాకాలం నివాసం వున్నారు. అప్పుడే అహీంద్ర చౌదరి నడుపుతున్న నాటక సంస్థలో సభ్యుడుగా చేరి కొన్ని నాటకాలలో సౌమిత్ర ప్రధాన పాత్రలు పోషిస్తూ వచ్చారు. మరొక నాటక పితామహుడు సిసిర్ భాదురి ప్రభావం సౌమిత్ర మీద ఎక్కువగా పనిచేసింది. తరవాత సౌమిత్ర ఆల్ ఇండియా రేడియోలో ప్రయోక్తగా వుంటూనే నటుడుగా తన ప్రస్థానం కొనసాగించారు.

సత్యజిత్ రాయ్ పరిచయం…..
1956లో సత్యజిత్ రాయ్ ‘అప్పు ట్రయాలజీ’ నేపథ్యంలో ‘అపరాజితో’ సినిమా నిర్మిస్తూ ఎవరైనా కొత్త నటుణ్ణి పరిచయం చేద్దామనుకున్నారు. సౌమిత్ర ఆయన దృష్టిలో పడినా, వయసు రీత్యా సౌమిత్ర యువకుడు కావడంతో అప్పు పాత్రకు సౌమిత్ర సరిపోలేదు. అయితే రెండేళ్ల తరవాత సౌమిత్ర అప్పు పాత్రను పోషించగలిగారు. అది వేరే సంగతి. 1957లో కార్తీక్ చట్టోపాధ్యాయ ‘నీలాచలే మహాప్రభు’ అనే సినిమా కోసం సౌమిత్రకు స్కీన్ టెస్ట్ చేయించారు. అయితే సౌమిత్ర విఫలమయ్యారు. 1958లో సత్యజిత్ రాయ్ తన నాలుగవ చిత్రం ‘జలసాగర్’ నిర్మిస్తూ సౌమిత్రకు యువ అప్పు పాత్రను ఇస్తానని అభయం ఇచ్చారు. చెప్పినట్లే 1959లో సత్యజిత్ రాయ్ ‘అపరాజితో’ కు సొనసాగింపుగా నిర్మించిన ‘అప్పు సంసార్’ చిత్రంలో సౌమిత్రను హీరోగా పరిచయం చేశారు. ఇందులో సౌమిత్ర చటర్జీ నూనూగు మీసాలు, చిన్ని గెడ్డంతో యువ రవీద్రనాథుని గుర్తుకు తెచ్చారు. సౌమిత్రకు జంటగా షర్మీలా టాగూర్ నటించింది. పండిత్ రవిశంకర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి ఉత్తమచిత్రంగా జాతీయ బహుమతి లభించగా, మరెన్నో అంతర్జాతీయ బహుమతులు కూడా గెలుచుకుంది. అలా సౌమిత్ర చటర్జీ సత్యజిత్ రాయ్ నిర్మించిన 14 సినిమాలలో హీరోగా నటించారు. వీటిలో ఎక్కువగా షర్మీలా టాగూర్ హీరోయిన్ గా నటించింది. సత్యజిత్ రాయ్ నిర్మించిన ఎక్కువ శాతం సినిమాలలో సౌమిత్రను దృష్టిలో వుంచుకొనే పాత్రలు సృష్టించారని చెప్పవచ్చు. సత్యజిత్ మీద వున్న గౌరవంతో సౌమిత్ర ‘ఎఖ్కోన్’ అనే పత్రికను ప్రారంభించి అందులో సత్యజిత్ రాయ్ సినిమాల స్కిప్తులు, సన్నివేశాలను ముద్రిస్తూ వచ్చారు. సినిమాలలో బిజీ అయ్యాక సౌమిత్ర సంపాదకత్వాన్ని తన భార్య నిర్మాల్యకు అప్పగించారు. ఇవి కాకుండా ఒక డజను కవితా సంకలనాలను కూడా సౌమిత్ర ముద్రించారు.

ఇతర బెంగాలీ సినిమాలు….
మృణాల్ సేన్, తపన్ సిన్హా వంటి ఉద్దండ దర్శకుల వద్ద సౌమిత్ర ఎన్నో సిమాలకు పనిచేశారు. వాటిలో తపన్ సిన్హా దర్శకత్వం వహించిన ‘ఝందర్ బంది’ (1961)లో సౌమిత్ర విలన్ మయూర్ వాహన్ గా నటించడం ఒక విశేషం. మృణాల్
సేన్ నిర్మించిన ‘ఆకాష్ కుసుమ్’ (1965)లో సౌమిత్రకు మంచి పేరు వచ్చింది. అపర్ణా సేన్ సౌమిత్రకు జంటగా నటించింది. 1979 లో ఇదే సినిమాని హిందీలో ‘మంజిల్’ పేరుతో బాసు చటర్జీ పునర్నిర్మించారు. అశుతోష్ టెనర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘తీన్ భువనేర్ పారే’ (1969) చిత్రంలో సౌమిత్ర తనూజకు జంటగా నటించారు. ఇందులో మన్నాడే పాడిన పాటలు బెంగాల్ లో నేటికీ వినిపిస్తూనే వుంటాయి. 80 వ దశకంలో యువ దర్శకులు గౌతమ్ ఘోష్, అంజనా దాస్, రుతుపర్నో
ఘోష్ నిర్మించిన సినిమాలలో సౌమిత్ర నటించారు. సరోజ్ ఘోష్ నిర్మించిన ‘అగ్రగామి’ (1986) సినిమాలో స్విమ్మింగ్ శిక్షకుడుగా సౌమిత్ర నటించారు. ఈ చిత్రానికి జాతీయ బహుమతి లభించింది. సౌమిత్రకు ‘కొనే’ చిత్రంలో నటించిన పాత్ర అంటే చాలా ఇష్టం. అయితే సౌమిత్ర నాటక రంగాన్ని మాత్రం విస్మరించలేదు. రాజకుమార్, ఫీరా, నీలకంఠ, ఘటక్ బిదయ్, న్యాయమూర్తి నాటకాలలో సౌమిత్ర నటించి మంచి పేరు గడించారు. ముఖ్యంగా సౌమిత్ర స్వయంగా రచించి దర్శకత్వం వహించిన నాటకాలు కోకొల్లలు. షేక్ స్పియర్ రాసిన ‘కింగ్ లియర్’ నాటకం స్పూర్తితో ‘రాజా లియర్’ అనే నాటకంలో నాయకుని పాత్ర పోషించారు. ఈ నాటకానికి ప్రసిద్ధ దర్శకుడు సుమన్ ముక్కోపాధ్యాయ దర్శకత్వం వహించడం విశేషం.

Padmabhushan award receiving from President of India in 2004

బహుమతులు, పురస్కారాలు… .
ఇటలీ ప్రభుత్వం సౌమిత్ర చటర్జీకి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. 1970 లో పద్మశ్రీ, 2004లో పద్మభూషణ్ పురస్కారాలను భారత ప్రభుత్వం అందజేసింది. ఫ్రెంచ్ ఫిలిమ్ దర్శకుడు కేథరిన్ బెర్ట్ సౌమిత్ర మీద ‘గాచ్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. 1998 లో జాతీయ సంగీత ఆకాడమీ సౌమిత్రకు బహుమతిని ఇచ్చి సత్కరించింది. 1991లో అంతర్ధాన్ చిత్రానికి, 2006లో పోడోక్కెప్ చిత్రానికి ఉత్తమ నటుడుగా జాతీయ బహుమతులు సౌమిత్ర అందుకున్నారు. 2012లో దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారం, 2000లో జాతీయ ప్రత్యేక జ్యూరీ పురస్కారం లభించింది. 8 సార్లు బెంగాల్ ఫిలిమ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు సౌమిత్ర చటర్జీని ఉత్తమ నటుడుగా ఎంపికచేసి సత్కరించారు. నాలుగుసార్లు ఉత్తమ నటుడుగా సిమంతే, బాబు మొషాయ్, గణదేవత, అగ్రదని చిత్రాలలో నటనకు ఉత్తమ నటుడుగా ఫిలిమ్ ఫేర్ బహుమతులు లభించాయి. ఫ్రెంచ్ ప్రభుత్వం 2017లో సౌమిత్రకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.
ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap