వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గత 40 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ నేటి (25-9-20) మధ్యాన్నం 1.04 ని.లకు కన్నుమూసారు. ఆయన మరణంతో కోట్లాదిమంది బాలు ఫాన్స్ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని పేరు ఎస్పీ (శ్రీపతి పండితారాధ్యుల) బాలసుబ్రమణ్యం. గాయకుడిగా పరిచయమై.. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా కొనసాగారు. భారతీయ భాషల్లో దాదాపు 45 వేల పాటలు పాడిన కళాకారుడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేటలో 04 జూన్ 1946లో హరికథా పండితుడు సాంబమూర్తి, శకుంతలమ్మ ఇంట్లో జన్మించారు. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు మొత్తం ఎనిమిది మంది సభ్యులుగల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడి అందరి దృష్టిని ఆకర్షించారు బాలు. 1966 లో అప్పటి ప్రముఖ నటుడు పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాకు ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో గాయకుడిగా బాలు ప్రయాణం మొదలైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. బాలు రంగప్రవేశం నాటికి ఘంటశాల వెంకటేశ్వరరావు ఒక్కరే గాయకుడు. రామకృష్ణ లాంటి వాళ్లు ఉన్నా… అంతంతే. బాలసుబ్రమణ్యం సినిమా రంగంలో అడుగుపెట్టడం.. నటుల స్వరానికి తగ్గట్టుగా బాలు పాటలు పాడడంతో.. ఆదరణ పెరిగింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
అనితర సాధ్యం బాలు గానం: ఓ పాపాలాలీ సినిమాలో ‘మాటేరాని చిన్నదాని’ పాటను గుక్క తిప్పుకోకుండా పాడడం బాలుకే సాధ్యం. నటుల గొంతుకు తగ్గట్టుగా పాడడం వల్ల నటులకు డబ్బింగ్ చెప్పే అవకాశం కూడా బాలుకు కలిగింది. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు తెలుగులోకి డబ్ కావడం, ఆయా సినిమాల్లో కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్ వంటి ప్రముఖ నటులు నటించడంతో బాలుకు వద్దన్నా అవకాశాలు కలిగాయి. గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి కూడా డబ్బింగ్ చెప్పారు. 1969 లో వచ్చిన పెళ్లంటే నూరేళ్ల పంట సినిమాలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. ఆ తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళీ భవ మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశారు. సినిమాల్లోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. ప్రముఖ చానల్ ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించారు.
ఎన్నో అవార్డులు : 2001లో కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన ‘మిథునం’ సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.తెలుగు పరిశ్రమలో ఘంటసాల తర్వాత అత్యంత ఎక్కువ ప్రాధాన్యత సంపాదించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం లో అద్భుతమైన ప్రతిభ ఉంది. అతను గొంతు మార్చి ఏ హీరోకి అయినా తగ్గట్టుగా పాడగలడు. తన మొత్తం జీవితంలో 12 అవార్డును సంపాదించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగులో ఏ గాయకుడు సృష్టించని రికార్డులను నెలకొల్పాడు. ఒక్కసారి తాను సంపాదించిన అవార్డులు ఏంటో తెలుసుకుంటే… 1989 లో సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన మైనే ప్యార్ కియా సినిమా లో పాటలను ఎస్పీ బాలసుబ్రమణ్యం, లత మంగేష్కర్, శ్రద్ధా సిన్హా పాడారు. అయితే ఈ సినిమా పాటలకు సంబంధించిన ఆల్బమ్స్ కోటికి పైగా అమ్ముడుపోయాయి. ఒకే ఒక సినిమాకు సంబంధించిన ఆల్బమ్స్ కోటికిపైగా అమ్ముడు పోవడం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమాలో పాటలు పాడినందుకు గాను 1990 సంవత్సరంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి బెస్ట్ ప్లేబాక్ సింగర్ గా(ఉత్తమ నేపధ్య గాయకుడు) ఫిలింఫేర్ అవార్డు లభించింది. 2006వ సంవత్సరంలో తెలుగులో విడుదలైన శ్రీ రామదాసు చిత్రంలో ఏఎన్ఆర్, నాగార్జున, స్నేహ సుమన్ ప్రధాన పాత్రలలో నటించగా… ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా కంచర్ల గోపన్న జీవిత చరిత్ర పై తెరకెక్కి అనేకమైన అవార్డులను సొంతం చేసుకుంది. హీరో నాగార్జున కు ఉత్తమ నటుడిగా నంది అవార్డును రాగా… శ్రీరామదాసు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు సంపాదించింది. అయితే ఈ సినిమాలోని పాటలను పాడినందుకు రాను… ముఖ్యంగా ‘అంతా రామమయం ఈ జగమంతా రామమయం’, ‘అదిఅదిగో భద్రగిరి’, ‘చాలు చాలు చాలు’ పాటలు పాడినందుకు ఎస్పీబీకి ఎప్పుడు రాని ప్రేక్షకాదరణ వచ్చింది. ఇటువంటి పాటలకు తన గాత్రం దానం చేసినందుకుగాను 2007వ సంవత్సరంలో ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. 2008, 2011 సంవత్సరాల్లో కూడా అతనికి ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. 1987 అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్, 1984లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డు లభించాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఆరు నేషనల్ అవార్డులు కూడా లభించాయి. రుద్రవీణ సాగరసంగమం శంకరాభరణం లాంటి చిత్రాలలో తన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించి నేషనల్ అవార్డులను తన సొంతం చేసుకున్నాడు. 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులను కూడా బాలసుబ్రమణ్యం గెలుచుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఇంతటి విశేషమైన ఖ్యాతిని గడించిన మన ఎస్ పీ బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించుదాం.