గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం గొప్ప వినయశీలి అని, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి వుండే మహా సంస్కారవంతుడు అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణా చారి అన్నారు. బాలు సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు, నిర్మాత, డబ్బింగ్ కళాకారుడు, స్టుడియో అధిపతిగా షణ్ముఖుడుగా బతికినంత కాలం విరాజిల్లారని కొనియాడారు. సంకల్ప బలం, కృషి, దీక్ష, తపన, వైవిధ్యం, రాజీపడని తత్వం బాలు గారి సప్త స్వరాలు అని వివరించారు.
మనీషా ఆర్ట్స్ ఆధ్వర్యం లో ఆదివారం(26-9-21) హైదరాబాద్ లో తెలంగాణ సారస్వత పరిషత్ లో “పండితారాధ్యునికి శంకరాభరణం” స్వర నివాళి కార్యక్రమం నిర్వహించి బాలుగారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాలు గారు అందరివాడు అని, బాలు జీవితం ఆదర్శవంతం అని చెప్పారు. సినీ సంగీత రంగానికి సంస్కారాన్ని నేర్పిన గాన గంధర్వుడు బాలు అని శ్రద్ధాంజలి ఘటించారు.
సభాధ్యక్షులు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ పాత్ర స్వభావాన్ని తెలుసుకుని పాడిన తొలి గాయకుడు, తెలుగు చలన చిత్ర నేపధ్య చరిత్రను మలుపు తిప్పిన మహాగాయకుడు బాలసుబ్రహ్మణ్యం అని అభివర్ణించారు. నటనా వైదుష్యాన్ని పాటకు పరిచయం చేసిన బాలు కారణ జన్ములు అని ఆయన అన్నారు.
డాక్టర్ మహ్మద్ రఫీ మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు పాట ఉన్నంత కాలం బాలు చిరంజీవి గా ఉంటారని, ప్రతి ఇంట తన పాట తో నిత్య స్మరణీయులుగా మార్మోగుతూనే ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమం లో కథక్ కళాక్షేత్ర నాట్యాచార్యులు శ్రీ పండిట్ అంజుబాబు, గాయకుడు మధుబాపు శాస్త్రి పాల్గొని నివాళులు అర్పించారు.
మధుబాపు శాస్త్రి ఆధ్వర్యం లో గాయకులు పవన్ కుమార్, సాయి సింధూర, కమల మనోహరి, రేఖ, క్రాంతి, మౌనిక చక్రవర్తి తదితరులు బాలు గారి పాటలతో స్వర నివాళి సమర్పించారు. పి.ఎం.కె. గాంధీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.