1946 జూన్ 4న భూమి మీదకి వచ్చిన గాన గంధర్వుడు తన సంగీత జైత్రయాత్ర ముగించుకుని సెప్టెంబర్ 25.. 2020న తన స్వస్థలానికి దివిలోని ఏ లోకానికో తరలి వెళ్ళిపోయారు. ఆయనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గంధర్వ యాత్రికుడు భూమి మీద ఉన్నంతకాలం ఎన్ని వేల పాటలు పాడారో ఎన్ని కోట్లు అనుభూతులు కలిగించారో శ్రోతలకు తెలుసు.
పాటలతో పాటు పాట విడుపుగా ఎన్నెన్ని సరదా పనులు చేశారో…పాటల విజయాల వెనక మరుగున పడిపోయింది. వాటిలో స్వరకల్పన సృష్టికర్తగా ఓ అవతారం అయితే.. మరొకటి వైవిధ్యమైన పాత్రలకు జీవ ప్రతిష్ట చేసిన అవతారం.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. మాటలు పెగలడం లేదు.. పాళీ రాయడానికి మొరాయిస్తోంది.. జర్నలిస్టుగా 34ఏళ్ల బంధాన్ని అందుకున్న అనుభవాలను నెమరువేసుకుని రాయబోతుంటే.. ఒక్కొక్క జ్ఞాపకం పెనుకడలి కెరటమై.. కన్నీటి వానతో… విషాద శబ్దంతో.. శోకతప్తవర్ణంతో ఏ మూలకో ఈడ్చుకుపోతోంది. భాషలకు అతీతంగా.. భారతీయ భాషలలో అధిక శాతం భాషలకు తలకట్టుగా ఎదిగిన గళబ్రహ్మ మనసొంత మనిషే అయితే ఆ అనుభవం అమృతం. సుమారు 40 వేల పాటలంటే ఆయన పాడిన పాట ఒక్కొక్కటీ ఒక్కో రోజు విన్నా.. ఏ మనిషి ఆయు:ప్రమాణమూ సరిపోదు. పూర్తిగా ఆ పాటలన్నీ వినడానికే 109 సంవత్సరాలు పడుతుంది. తను ఇంజనీరింగ్ మద్రాసులో చదువుతున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యంగారి తండ్రి సాంబమూర్తిగారు ప్రతినెలా 80 రూపాయలు పంపించేవారు. ఆ బరువుని తండ్రికి తప్పించాలని..చదువు పూర్తయ్యే వరకూ కొన్ని పాటలు పాడే అవకాశం వస్తే పాటకి 150 రూపాయలు వస్తే.. అదే పదివేలు అనుకున్నారు బాలూ.. కానీ వద్దన్న వాళ్ళే పిలిచి పిలిచి పాటలిచ్చి ఆయన్ని ఇంకా తర్వాత చదవనివ్వలేదు. 1946లో పుడితే 1966 లో ఆయన మొదటి పాట విజయగార్డెన్స్ లో రికార్డయింది. అంటే సరిగా 20ఏళ్ళ వయసులో, బాలూగారు ఈ జన్మలో నేర్చుకున్న సంగీతం ఏం లేదు. గత జన్మలో నేర్చుకున్న సంగీతాన్ని ఈ జన్మలో పునశ్చరణ చేసుకున్న సుకృతం.. పుణ్యం ఆయనది. కేవలం ప్రతిభ ద్వారా మాత్రమే రాణించిన అంతులేని వైభవానికి బాలూగారు నిలువెత్తు సంతకం. తొలి రోజుల్లోనే అందరినీ ఆకట్టుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ బాలూ తప్పితే మరెవ్వరూ లేరన్న రికార్డు సృష్టించడం ఆయనకు మాత్రమే చెల్లింది. సంగీత దర్శఖులందరికి తన గొంతుతో..సొగసుతో పాటూ ఓ సుళువుని కూడా కొత్తగా రుచి చూపించిన తొలి గాయకుడు బాలూగారే. ఎంతకష్టమైనా పాటనైనా 5నిమిషాలకన్నా ఆయన నేర్చుకున్న సందర్భమే లేదు. మరో 10 నిమిషాలు రికార్డింగ్.. అయిపోయింది పాట. ఆఫ్ డే కాలీట్ లో మిగతా అంతా అలర్లి.. ఆంటే థియేటర్ లో అందరితో ఎంత సుఖం.. నిర్మాత..దర్శకుడు.. సంగీత దర్శకుడికీ పాట బైటకు రావడమే లేటు..రాగానే పెద్ద హిట్టు. ట్యూన్ ని నేర్చుకుని తనదైన కొత్త దనంతో పాటని గొప్ప స్పలులేజేషన్ తో ప్రెజెంట్ చెయ్యడంలో ఆయనను మించిన మాస్టర్ ప్రపంచంలోనే లేడు. బాలూగారు పాడని కృష్ణగారి సినిమాలు సైతం ఆడలేదు. వేటూరిగారు. వారిద్దరి మధ్యన వారధిగా నిలబడి వాళ్ళని ఓ ఒడ్డుకు చేర్చారు. నువ్వు ఘంటసాల గారిలా పాడలేవు.. హీరోల్లాగా పాడు అన్న ఒక్క మాటని పట్టుకుని ఎన్టీఆర్ కి.. ఏయన్నార్ కి పాడడం మొదలు పెట్టాక..
బాలూ మరో యుగాన్ని వాళ్ళకోసం సృష్టించారు. పిచ్చి పాటల్లా వున్నా.. బాలూగారి చాకచక్యం.. చమత్కారాలతో ఆ పాటలు కూడా జన బాహుళ్యాన్ని ఊపేశాయి.
తెలుగులో పాటలు ఒక ఎత్తైతే.. తమిళంలో పాటలు మరొక ఎత్తు, అన్నీ కష్టమైన.. క్లిష్టమైన బాణీలు. వాటిని కూడా అవలీలగా ఊదిపారేసి.. తమిళుల గుండెల్లో మరో మురుగున్ లా కొలువుతీరిన చరిత్ర బాలుగారి స్వంతం. బాలూ తెలుగువాడని గానీ.. మనం అంటే మనల్ని తన్నడానికి సిద్ధమవుతారు. తమిళ ప్రజలు మొత్తం కల్పి. వాళ్ళే ఎక్కువగా బాలూగారి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు..దు:ఖపడ్డారు.. కన్నీటి పర్యంతం అయ్యారు. ఎప్పుడో జీవితచక్రంలో కమెడియన్ పద్మనాభం గారికి పాట పాడించిన శంకర్ జైకిషన్.. బాలూ గారి ప్రతిభకు పొంగిపోయి..
రాబోయే రోజుల్లో బాలూగారిదే రాజ్యం అని జోస్యం చెప్పారు. వాళ్ళు అన్నట్టుగానే బాలీవుడ్ లో కూడా పదేళ్ళపాటు మరో గొంతు వినిపించలేదు. బాలూగారిది తప్పితే. కెరీర్ లో నిలబడడంతో పాటూ మైకుముందు పాడుతూ లక్షల గంటలు వేదికల మీద నిలబడ్డారు. ఆయనకి బాగా ఆకలివేస్తే ఓ రెండు ఇడ్లీ తినేవారు. కొబ్బరి పచ్చడి ఇష్టమైనా గొంతులో జీర వస్తుందని తినేవారు కాదు. నాకు తెల్సి గొంతుకోసం ఆయన తీసుకున్న జాగ్రత్త అదొక్కటే. మిగతాది అంతా ఆయనిష్టమే. కానీ ఆ గొంతు ఆయనకోసమే పుట్టింది. చివరిక్షణం వరకూ ఆయన్ని కనిపెట్టుకునే వుంది. సర్జరీ వద్దు గొంతుపోతుందని లతా మంగేష్కర్ హెచ్చరించినా పాడడంకోసం రిస్క్ చేసి అమెరికాలో సర్జరీ చేయించుకున్నారు. పాటలు ఒక్క క్షణం పక్కన పెడితే స్నేహానికి.. మానవసంబంధాల విషయంలో విశ్వ విద్యాలయాలు.. బాలూగారి ముందు దిగదుడుపే. ఎంతమందికి అండగా నిలబడ్డారు.. ఎందరికి చేయుతనిచ్చారో లెక్కలేదు. నవ్వుతూ బ్రతకాలిరా.. నవ్వుతూ చావాలిరా అని ఆయన పాడిన పాటలాగే జీవితాన్ని కొనసాగించారు. మరణించాక కూడా ఎలా బ్రతకాలి అన్నది బాలూగారిని చూసే నేర్చుకోవాలి. నెల్లూరులోని తనింటిని కంచిపీఠానికి వేదపాఠశాల నిమిత్తం రాసిచ్చేశారు. గాయకుడిగా కన్నా ఓ మంచి మనిషిని.. ప్రాణమిచ్చే స్నేహితుణ్ణి.. శ్రేయాభిలాషిని.. కష్టమొస్తే నిలబడే ఆత్మబంధువుని పోగొట్టుకున్నందుకే ఎక్కువశాతం కుమిలిపోయారు. గాయకుడిగా ప్రపంచమంతా ఆవరించిన బాలూగారు మనిషిగా అంతకన్న ఎత్తుగా ఎదిగారు. మరో బాలూని చూడలేం.. వినలేం.. ఈ యుగం శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం అనే మన బంగారు బాలూది.. కమ్మనైన పాటలకి మరో యుగం లేదు. అది ఆయనతోనే పోయింది.. అది మళ్ళీరాదు.
-పసుమర్తి నాగేంద్రకుమార్