(సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ బహుమతి ప్రదానోత్సవ వేడుకలు విజయవాడలో 20 మార్చి ఆదివారం)
స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో పిచ్చుకల సంరక్షణకై నిర్వహించిన సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ బహుమతి ప్రదానోత్సవ వేడుకలు విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ డా. ఎమ్.సి దాస్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ డా. వెలగా జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బిగ్ బాస్ 2 కాంటెస్టంట్ దీప్తి నల్లమోతు ప్రత్యేక అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన ఆహుతులను అలరించింది.
అనంతరం డా. ఎమ్.సి.దాస్ మాట్లాడుతూ పిచ్చుకలు తాటాకు ఇళ్ళ చూరుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని మనుషుల మధ్యే జీవిస్తాయని, ప్రస్తుతం ఉన్న కాంక్రీటు జంగిల్ మధ్యలో వాటికి గూడు లేక అంతరించిపోతున్నాయని ఇకనైనా మనం మేల్కొని వాటికి సరైన ఆవాసాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ డా. వెలగా జోషి మాట్లాడుతూ పిచ్చుక వంటి చిన్నప్రాణి సంరక్షణ పై ఇంత పెద్ద ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయటం బట్టే పిచ్చుకలు పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గోళ్ళ నారాయణ రావు మాట్లాడుతూ పిచ్చుకలను సంరక్షించాలనే ముఖ్య ఉద్దేశంతో చిన్నారులకు,యువతకు చైతన్యం కలిగించటం కోసం స్ఫూర్తి శ్రీనివాస్ ఈ సేవ్ స్పారో కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా నడిపించారన్నారు.
బిగ్ బాస్ 2 కాంటెస్టంట్ దీప్తి నల్లమోతు మాట్లాడుతూ పిచ్చుకల సంరక్షణకై ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ముందుకు రావాలని వాటికి తగిన ఆవాసాలు కల్పించటం, ధాన్యపు గింజలు, నీరు ఏర్పాటు చేయాలన్నారు.
తదనంతరం ఏ.ఎమ్.సి చైర్మన్ దొంతిరెడ్డి కవిత, విద్యా వేత్త కే. పద్మలత, తెలుగు పండిట్ జి.వి.సాయి ప్రసాద్, రచయిత-ఉద్యమకారి సుబ్బు ఆర్. వి,పక్షి ప్రేమికులు షేక్ లతీఫ్ మరియు తోట శ్రీనివాసరావు లు పిచ్చుకల సంరక్షణకై మనకున్న బాధ్యతను తెలియపరిచారు.
చిత్రకారులు సన్మాన కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు పావులూరి చిదంబరం, ఏ. సునీల్ కుమార్, అరసవల్లి గిరిధర్, డి.మధుసూధనరావు, దివాకర్ మహారాణా లను స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ తరుపున ఘనంగా సత్కరించారు. ఈ ప్రముఖ చిత్రకారులందరి చేతులమీదుగా యువ చిత్రకారిణి చి. రఘపాత్రుని హర్షితని ప్రశంసా పత్రం, జ్ఞాపికతో సత్కరించారు.
అనంతరం అతిథుల చేతుల మీదుగా సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ విజేతలను శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రం, జ్ఞాపిక,మెడల్, బర్డ్ హౌస్ లను అందజేసారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్రియేటివ్ కాన్సెప్ట్స్ వర్క్ షాప్ పెన్సిల్ షేడింగ్, కలరింగ్/పెయింటింగ్, పేపర్ క్విల్లింగ్, మండాలా ఆర్ట్, ఫోటోగ్రఫీ, మైక్రో ఆర్ట్, లీప్ ఆర్ట్, క్లే మౌల్డింగ్ విభాగాల్లో నగరానికి చెందిన పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకత శక్తికి పదును పెట్టారు.
కార్యక్రమాన్ని స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ జి.స్నేహ శ్రీనివాస్, మరియు ఈవెంట్ కోఆర్డినేటర్ జి.స్ఫూర్తి పర్యవేక్షించగా.. సేవ్ స్పారో టీమ్ మెంబెర్స్ పాల్గొన్నారు.
మంచి కార్యక్రమం… నిర్వహించిన నిర్వాహకులకి… అభినందనలు…
Good program.